Sunday, April 28, 2024

పిఎం పదవినే తృణప్రాయంగా త్యజించిన గొప్పనేత అటల్: బండి

- Advertisement -
- Advertisement -

Atal bihari vajpayee death anniversary

హైదరాబాద్: ప్రతి బిజెపి కార్యకర్త కు స్ఫూర్తి ప్రదాత, ప్రేరణ అయిన భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ 2018 ఆగస్టు 28న మన నుంచి దూరమై మూడేళ్లయిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్మరించుకున్నారు. అటల్ భౌతికంగా దూరమైనా దేశ ఔన్నత్యాన్ని చాటాలన్న వారి ఆశయాలు, పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యాలు, వారి ఆలోచనలు, నిరుపమాన సేవలు, అసమాన త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ప్రశంసించారు. వారి మార్గదర్శనం సదా మమ్మల్ని నడిపిస్తుందన్నారు. ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అటల్ బిహారీ వాజ్‌పేయీ దేశ అత్యున్నత స్థాయికి చేరుకోవడం ఒక్క బిజెపితోనే సాధ్యమైందన్నారు. ఇద్దరు ఎంపిలతో మొదలైన బిజెపి ప్రస్థానం నేటి ప్రస్తుత సంకీర్ణ యుగంలోనూ సొంతంగా మెజారిటీ సాధించిందంటే… ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బిజెపి అవతరించిందంటే దానికి వారు వేసిన పటిష్ట పునాదులే కారణమని బండి కొనియాడారు.

1996లో తొలిసారి 13 రోజులు ప్రధానిగా, తర్వాత 13 నెలల పాటు మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది ఐదేళ్ల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న తొలి కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు సృష్టించారని గుర్తు చేశారు. పదవుల కన్నా విలువలకు పట్టం కట్టిన వాజ్ పేయి.. భారత అత్యున్నత పదవి అయిన ప్రధానమంత్రి పదవిని నైతిక విలువల కోసం తృణప్రాయంగా త్యజించిన గొప్ప నేత అని ప్రశంసించారు.  భారత దేశానికి ఆయన చేసిన సేవలకు గాను నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించిందన్నారు.

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రసంగాలకు ప్రజలే కాకుండా ప్రతిపక్షనేతలు సైతం ముగ్గులయ్యే వారన్నారు. మౌలిక వసతులకు అత్యంత ప్రధాన్యతనిచ్చిన వాజ్ పేయి స్వర్ణ చతుర్భుజితో జాతీయ రహదారులను విస్తరించారని,  2001లో ఆయన ప్రతిపాదించిన రహదారుల విధానాన్నే ఆ తర్వాతి ప్రభుత్వాలూ కొనసాగిస్తున్నాయని, గ్రామాల్లోనే నేడు రహదారుల సౌకర్యం ఏర్పడిందంటే దానికి కారణం వారేనని గుర్తు చేశారు. అమెరికా ఉపగ్రహ నిఘాకు చిక్కకుండా పోఖ్రాన్ లో అణపరీక్షలు నిర్వహించి భారత సత్తా చాటిన ఘనత వారికే దక్కుతుందన్నారు. ‘అంధకారం మాయవుతుంది… సూర్యుడు ఉదయిస్తాడు.. కమలం వికసిస్తుంది’ అన్న వారి నినాదం ప్రతి బిజెపి కార్యకర్త గుండెల్లో నిలిచి ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News