Saturday, May 4, 2024

ఆస్ట్రేలియాదే యాషెస్..

- Advertisement -
- Advertisement -

Australia's big win in third Ashes Test against England

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఓటమి, కంగారూలకు హ్యాట్రిక్ విజయం

మెల్‌బోర్న్: ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌ను మరో రెండు టెస్టులు మిగిలివుండగానే 30తో సొంతం చేసుకుంది. ఇక ఇంగ్లండ్ వరుసగా మూడో ఓటమితో సిరీస్‌ను చేజార్చుకుంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది. బాక్సింగ్ డే టెస్టును ఆస్ట్రేలియా రెండున్నర రోజుల్లోనే కైవసం చేసుకోవడం విశేషం. ఇక యువ బౌలర్ స్కాట్ బోలాండ్ అసాధారణ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. 31/4 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం మూడో రోజు బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. బోలాండ్ తాను ఆడిన మొదటి మ్యాచ్‌లోనే అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. ఏడు పరుగులు మాత్రమే ఇచ్చిన బోలాండ్ ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇంగ్లండ్ మూడో రోజు మరో 37 పరుగులు మాత్రమే జోడించి చివరి ఆరు వికెట్లను కోల్పోయింది.

కెప్టెన్ జో రూట్ (28), బెన్‌స్టోక్స్ (11) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. మిగతా బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. మూడో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. మిచెల్ స్టార్క్ అద్భుత బంతితో స్టోక్స్ (12)ను వెనక్కి పంపాడు. కొద్ది సేపటికే స్టార్ బ్యాట్స్‌మన్ బెయిర్‌స్టో (5)ను బోలాండ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత బోలాండ్ మరింత చెలరేగి పోయాడు. వరుసగా జో రూట్, మార్క్‌వుడ్ (0), ఓలి రాబిన్సన్ (0)లను బోలాండ్ పెవిలియన్ బాట పట్టించాడు. ఇక అండర్సన్ (0)ను గ్రీన్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో 68 పరుగుల వద్దే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన బోలాండ్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు. ఇక తొలి రెండు టెస్టుల్లోనూ ఇంగ్లండ్‌కు ఓటమి ఎదురైన విషయం తెలిసిందే. తాజాగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమి పాలై సిరీస్‌ను చేజార్చుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News