Saturday, April 27, 2024

తెలంగాణ జీవన శిల్పం ‘బలగం’

- Advertisement -
- Advertisement -

సినిమాను లాభాలను ఆశించే వాణిజ్య పెట్టుబడి రంగంగానే చూడాలి. నిర్మాణ మెళకువలు తెలిసినా నిరంతరం కొత్తదనాన్ని సంతరించుకునే, అందరికీ పట్టుదొరకని వివిధ కళల సమాహారం అది. సినిమాలంటే వినోదమే అయినా అప్పుడప్పుడు కంటిని తడిపే సినిమాలు కూడా వస్తుంటాయి. వినోదాత్మక సినిమాలు తీయడం కన్నా జీవితంలోని సహజ ఘట్టాలను తెరకెక్కించడం కష్టమైన పని. వినోద ప్రధాన సినిమాల ద్వారా పెట్టుబడిని తిరిగి రాబట్టుకునే వీలు కూడా ఎక్కువే. జీవితాలకు దగ్గరగా ఉండే సినిమాల్లో వాస్తవికత లోపిస్తే, నటన, చిత్రీకరణలో పరిపక్వత లేకపోతే ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఆ భయం నిర్మాతలకు ఉంటుంది. కథను నోటితో చెప్పినట్లుగా తెరపైకి ఎక్కించకపోతే మొదటికే మోసం వస్తుంది. విషాదాన్ని సరిగ్గా నిలపకపోతే ప్రేక్షకుడు తల పట్టుకొని బయటికి వస్తాడు. అందుకే సినిమాల్లో వినోదాలే ఎక్కువ. వాటిలో కష్టం తక్కువ, ఫలితం ఎక్కువ. అయితే లెక్కలో తక్కువైనా మానవ సంవేదనలపై నిర్మించిన సినిమాలు ప్రేక్షకులకు ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఆ కోవలో వచ్చిన అరుదైన సినిమా ‘బలగం’. చిన్న సినిమా అయినా అందరూ మెచ్చే గొప్ప సినిమాగా బలగం ప్రేక్షక ఆదరణ పొందుతోంది. తెలంగాణ గ్రామీణ జీవితాల్ని, మనుషుల మధ్య బంధాల్ని ఈ సినిమా చక్కగా ఉన్నదున్నట్లుగా తెరకెక్కించింది.

తెలంగాణ ప్రజలకు కోపాలెక్కువే, ప్రేమలూ ఎక్కువే. క్షణికావేషాలు, నోరు పారేసుకోవడాలు, అలకలు, ఆత్మాభిమానాలు వారిని అంటుకొనే ఉంటాయి. అయితే అవన్నీ బూరుగు చెక్కల మంటలే. బింకంగా వదిలి పలకరిస్తే కరిగి కన్నీళ్ళవుతాయి. ఈ లక్షణాలన్నీ అడపాదడపా ప్రేమానురాగాలు వికటించిన కారణంగా పెరిగిన గులాబీ పక్కన ముళ్ళు మాత్రమే. ఇంత మాటంటాడా అనే పట్టింపులే మనుషుల మధ్య తాత్కాలిక ఎడబాటును కల్పిస్తాయి తప్ప మనసుల్లో మాత్రం పెనవేతనే ఉంటుంది. ఇది తెలంగాణ జీవితాల్లోని లోపం కాదు సహజ తత్వం. సినిమా కథలో భాగంగా తెలంగాణ గ్రామీణ జీవితాల్లోని అలకలు, అనుబంధాలు కలగలిసి నడిచి బలగంను ప్రేక్షకులు గుండెలకు హత్తుకునేలా చేశాయి. అది కథ కాదు మా బతుకు అని సినిమా చూసిన జనం కంట నీరు తుడుచుకుంటున్నారు. ఈ సీరియస్ సినిమాను ఆశించిన రీతిలో తెర కెక్కించడం పట్ల నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు పడిన శ్రమ కనిపిస్తుంది.

చిన్న బడ్జెట్ కారణంగా కొన్ని సినిమాల్లో సాంకేతిక విలువలు కొరవడే అవకాశం ఉంటుంది. అయితే ఈ సినిమా నిర్మాణానికి భారీ నిర్మాత ముందుకు రావడంతో ఆ కష్టాలు గట్టెక్కాయి. ఎంతో కష్టంగా, ఇష్టంగా స్క్రిప్టు తయారు చేసుకొన్న దర్శకుడు యెల్దండి వేణుకు అభిరుచి గల నిర్మాత దిల్ రాజు పచ్చజెండా ఊపడం అభినందనీయం. నిర్మాత సాహసించకపోతే చిత్ర నిర్మాణమే సాధ్యం కాదు. సీరియస్ సినిమాలకు స్క్రిపు కన్నా చిత్రీకరణ ప్రాణం. నిర్మాతకు లాభాన్ని లేదా నష్టాన్ని నిర్ణయించేది నిర్మాణ కౌశల్యమే. దానిని దర్శకుడిగా తొలి చిత్రంలోనే వేణు సాధించాడనవచ్చు. మామూలుగా కొత్త దర్శకుడి సినిమాలో సన్నివేశాల పొడుగు, పాత్రల అభినయంలో పచ్చిదనం కనబడుతుంది. వేణు అలాంటి లోటు పాట్లను అధిగమించాడు. తెలుగు సినిమాల్ని చూస్తున్న తెలంగాణ జనాలకు తాము కేవలం ఆంధ్ర ప్రాంత నటులను, ప్రాంతాలను, జీవితాలను, పద్ధతులను చూస్తున్నామనే భావన లోలోపల ఉంది.

మా బతుకులు కథలు రాసే, సినిమాలు తీసే స్థాయిలో లేవా అనే సందిగ్ధం, న్యూనతా భావం కూడా ఉన్నాయి. పల్లెలంటే కోనసీమ ఊర్లే సినిమాల్లో కనబడతాయి. ఏ సినిమాలోనైనా ఆలుమగలు , అన్నదమ్ములు, చివరికి బావామర్దళ్ళైనా.. వారి భాషా, వేషాలు ఆంధ్రకు చెందినవే ఉండడం వల్ల తెలంగాణ సంస్కృతికి సినిమా దూరమైందని చెప్పవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలుగు సినీరంగంలో చెప్పుకోదగ్గ మార్పులు తెచ్చింది. మా జీవితాలు మీకు పనికిరావా, మేము లేని సినిమాలు మాకెందుకు అని ప్రశ్నించక ముందే సినిమా వాళ్లు జాగ్రత్త పడి తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రధాన పాత్రల్లో కొన్నిటికి తెలంగాణ యాసలో సంభాషణలు, ఇక్కడి ఊర్ల పేర్లు, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో సినిమాల చిత్రీకరణ ఆరంభించారు. అయితే ఇవి తెలంగాణ జీవితాలకు, సంస్కృతికి బింబాలు కావు. తెలంగాణ రచయితలతో, నటులతో, సాంకేతిక నిపుణులతో నిర్మిస్తే తప్ప వాస్తవ తెలంగాణ చిత్రణ సాధ్యం కాదు. 1977లో వచ్చిన చిల్లర దేవుళ్ళు సినిమాలో ఆంధ్ర రచయితలు, గాయకులు పాల్గొనడం వల్ల సహజత్వం కోల్పోయింది.

పాటలు రాసినాయన, వాటిని పాడినాయన ఇది తెలంగాణ సినిమా అనే స్పృహలో ఉన్నట్లు అనిపించదు. ఏదైనా మేమిలాగే రాస్తాం, పాడుతాం అనుకున్నారేమో! తెలంగాణ సొంత సినిమాను తెలంగాణ బిడ్డలే తేవాలి. అప్పుడే విడిగా తెలంగాణ సినిమా వర్ధిల్లే అవకాశముంది. ఇక్కడి జీవన వైవిధ్యం, ప్రాధాన్యత నలుగురికీ తెలుస్తుంది. ఉత్తర భారతంలో ప్రధాన భాష హిందీ అయినా చాలా రాష్ట్రాల్లో స్థానిక భాషల్లో సినిమాలు నిర్మించబడతాయి. బీహార్‌లో భోజ్‌పురి భాషలో, మహారాష్ట్రలో మరాఠి, కొంకణి, తులు భాషల్లో, ఊటీలో బడగ భాషలో, గుజరాత్‌లో గుజరాతీలో సినిమాలు ఎంతో కాలంగా నిర్మాణమవుతున్నా యి. అక్కడివారు జీవన సంస్కృతులు వాటిలో ప్రతిబింబించి తమకూ సొంత సినిమాలున్నాయనే సంతృప్తిని వారికిస్తున్నాయి.

తెలంగాణ వారికి ఈ కొరత తీరాలి, బలగం సినిమా ఆ హామీ ఇస్తున్నట్లుగా ఉంది. నిజానికి తెలంగాణ సినిమాకు శ్యామ్ బెనెగల్ 1974 లోనే బీజం వేశారు. ఆయన హిందీలో తీసిన అంకుర్, నిశాంత్ సినిమాలు తెలంగాణ జీవితాలకు చెందినవే. రూ. 5 లక్షలతో తీసిన అంకుర్ కోటి రూపాయల వసూళ్లతో పాటు అవార్డులను సాధించింది. ఆ తరవాత ముందుకు సాగని తెలంగాణ సినిమా ‘బలగం’ తో బలపడే అవకాశం ఉంది. తెలంగాణ భాష, స్థానిక కళా రూపాలు, సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు, మానవ సంబంధాలు, జీవన విధానం, నమ్మకాలు, ఆర్థిక స్థితిగతులు.. అన్నింటి మేళవింపుగా రాబోయే సినిమాలకు ఒక ఇమ్మతిని కలిగిస్తుంది. తెలుగు పత్రికలేమోగాని టైమ్స్ ఆఫ్ ఇండియా, ది ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఇండియన్ హెరాల్డ్ లాంటి ఆంగ్ల దినపత్రికలు బలగం సినిమాను మెచ్చుకుంటూ వార్తలు రాశాయి.
బలగం ఒక సామూహిక జీవన సౌందర్య చిత్రం.

ఇందులో ప్రతి పాత్రకు తమదైన ప్రాధాన్యత ఉంది. చనిపోయిన పెద్దాయన పిండాన్ని కాకి ముట్టడానికి ఆ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఘర్షణలు, చివరకు వారి కోరిక తీరే క్రమంలో ఎదురయ్యే భావోద్వేగాలు సినిమాలో ప్రధాన ఘట్టాలు. ఈ సినిమాకు పాటలు, సంగీతం కుడిభుజంగా నిలిచాయి. నేపథ్య సంగీతం సన్నివేశాలను దగ్గరికి చేర్చేలా ఉంది. సినిమా క్లైమాక్స్ లో 5 నిమిషాల పాటు ఉన్న బుడగ జంగాల జంట పాడిన పాట, దాని చిత్రీకరణ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. వివిధ కారణాలతో ఎడమొఖంగా ఉన్న కుటుంబ సభ్యులను కలిపేందుకు పెద్దాయన మాటలుగా వారి పాటలోని చరణాలు అందరినీ కంట తడిపెట్టిస్తాయి. కుటుంబం, బలగం అంటే ఏమిటో ఆ పాట స్పష్టపరుస్తుంది. ములుగు ప్రాంతంలోని బుడగ జంగాల కులానికి చెందిన కొమురమ్మ, మొగిలయ్య అనే కళాకారులు సొంత గానం, వాద్యం, అభినయంతో కథాసారాన్ని మొత్తం వారి పాటలో పలికించారు. అలాంటి కళాకారులు ఇంటి ముందుకొచ్చి స్వయంగా పాడితే వినే సమయం లేని జనం ఇప్పుడు యూ ట్యూబ్‌లో వారికి లైకులు, కామెంట్లు పెడుతున్నారు. ఈ రకంగానైనా తెలంగాణ జానపద కళలకు పూర్వవైభవం దక్కాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ మట్టిలోంచి పుట్టిన సినిమాలను ప్రోత్సహించి, మరిన్ని చిత్రాల నిర్మాణానికి ఆర్థికంగా తోడు నిలవాలి.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News