Sunday, April 28, 2024

పొట్టి క్రికెట్‌లో కొత్త రూల్.. ప్రణాళికలు సిద్ధం చేసిన బిసిసిఐ

- Advertisement -
- Advertisement -

పొట్టి క్రికెట్‌లో కొత్త రూల్
ప్రణాళికలు సిద్ధం చేసిన బిసిసిఐ
ముస్తాక్ అలీ ట్రోఫీ నుంచి అమల్లోకి!
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా టి20 ఫార్మాట్‌కు విపరీత ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. భారత క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టోర్నీల కంటే ఐపిఎల్‌కే ఎక్కువ ఆదరణ ఉందనడంలో సందేహం లేదు. ఇదిలావుంటే పొట్టి క్రికెట్‌ను మరింత జనరంజకంగా తీర్చిదిద్దేందుకు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) నడుం బిగించింది. ఈ మేరకు దేశవాళీ టి20 క్రికెట్‌లో మార్పులు చేయాలని నిర్ణయించింది. రానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ నుంచి కొన్ని కొత్త నిబంధనలను అమలు చేయాలనే ఉద్దేశంతో బిసిసిఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించినట్టు సమాచారం. ఈ రూల్ ప్రకారం ప్రతి టీమ్ టాక్టికల్ సబ్‌స్టిట్యూట్‌ను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. తొలుత టాక్టికల్ సబ్‌స్టిట్యూట్ నిబంధనను మొదట దేశీయ టి20 ఫార్మాట్‌లో అమలు చేయాలనే ఉద్దేశంతో బిసిసిఐ వర్గాలు ఉన్నాయి. అక్టోబర్ 11 నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ రూల్‌ను అమలు చేయాలని బిసిసిఐ భావిస్తోంది. ఈ టోర్నమెంట్‌లో టాక్టికల్ సబ్‌స్టిట్యూట్ విధానం విజయవంతమైతే వచ్చే ఐపిఎల్‌లోనూ దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఇలాంటి రూల్‌ను తేవాలని బిసిసిఐ భావిస్తున్నా అది ఆచరణలో అమలు కావడం లేదు. అయితే తాజాగా బిసిసిఐ ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాలతో ఈ రూల్ విషయంలో చర్చలు జరిపినట్టు సమాచారం.

దీనికి ఆయా ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్‌లు అంగీకరించినట్టు తెలిసింది. కాగా రానున్న ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రతి మ్యాచ్‌కు ఒక టాక్టికల్ సబ్‌స్టిట్యూట్‌ను ఎంపిక చేసుకోవాలని బిసిసిఐ ఆయా సంఘాలను కోరింది. మ్యాచ్ ప్రారంభానికి ముందే సదరు ఆటగాడి పేరును ప్రకటించాల్సి ఉంటుందని బిసిసిఐ అధికారులు వివరించినట్టు తెలిసింది. ఈ రూల్ రాకతో టి20 ఫార్మాట్‌కు మరింత మేలు జరుగుతుందని బోర్డు పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఆయా జట్లకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశమని వారు పేర్కొంటున్నారు. కొత్త నిబంధనల ప్రకారం తమ 11 మంది ఆటగాళ్లలో ఒకరిని రిప్లేస్ చేసుకునే అవకాశం ఆయా జట్లకు ఉంటుందని, దీన్ని ప్రతి జట్టు సద్వినియోగం చేసుకోవాలని బోర్డు పెద్దలు ఆయా రాష్ట్రాల సంఘాలకు సూచించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దీని కోసం రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు బిసిసిఐ మెయిల్ ద్వారా సమాచారం అందించినట్టు బోర్డు వర్గాల ద్వారా తెలిసింది.

BCCI Introduces Impact Player Rule in T20 Format

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News