Friday, May 3, 2024

నియామకాలపై బిజెపి కుట్రలు

- Advertisement -
- Advertisement -

BJP conspiracies over Job recruitement

అమలు కాకుండా చేసే పన్నాగం అధికార టిఆర్‌ఎస్ నేతల అనుమానం
ఆరునూరైనా నియామకాలు జరిపించడానికి సిఎం కెసిఆర్ దీక్ష

మన తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ వేదికగా బుధవారం 80వేలకుపైగా ఉద్యోగ నియామకాల ప్రకటన చేయగానే తెలంగాణ నిరుద్యోగుల నుంచి మద్దతు వెల్లువెత్తుతుండడంతో విపక్ష బిజెపి జీర్ణించుకోలేకపోతున్నదని అధికార టిఆర్‌ఎస్ అనుమానిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం చేసే మంచి పనులకు గతంలో పలుమార్లు ముందరికాళ్లకు బంధం వేసేలా బిజెపి కుట్రపూరితంగా వ్యవహరించిన సందర్భాలను అధికార పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ సజావుగా సాగితే తెలంగాణ ప్రజానీకంలో టీ.ఆర్.ఎస్.పార్టీకి తిరుగులేని అభిమానం, సానుభూతి పెరుగుతాయని, అందుకే సీఎం ప్రకటనపై బి.జే.పి.నాయకులు విషం చిమ్ముతున్నారని, భారతీయ జనతా పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని వారి మాటలు స్పష్టంచేస్తున్నాయని కొందరు టి.ఆర్.ఎస్.పార్టీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. నోటిఫికేషన్లను జారీ చేసిన తర్వాత ఏవో కొన్ని లేని లొసుగులను లేవనెత్తి, సరికొత్త వివాదాలకు తెరతీసి ఎలాగైనా పోస్టుల భర్తీని కోర్టుల ద్వారా అడ్డుకోవాలని బి.జే.పి. నాయకులు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ నేతలు అనుమానిస్తున్నారు.

బిస్వాల్ కమిటీ సిఫారసుల మేరకు పోస్టులను భర్తీ చేయాలని, సుమారు ఒక లక్షా 90 వేల పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే బి.జే.పి.నాయకులు లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తే ఆ పార్టీ నియామకాల ప్రక్రియను నిర్వీర్యం చేయాలనే కుట్రకు రచన చేస్తున్నదని అనుమానించాల్సి వస్తుందని టిఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. నీళ్ళు& నిధులు& నియామకాల నినాదాన్ని పరిపూర్ణం చేసినట్లుగా తాము, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కేడర్, నిరుద్యోగులు, విద్యార్ధి లోకం సంబరపడిపోతున్న ఈ పరిస్థితుల్లో బి.జే.పి. నాయకులు అక్కసుతో, ఓర్వలేక చేస్తున్న విమర్శలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని ఆ నాయకులు అనుమానిస్తున్నారు. 80వేల 39 పోస్టులను కొత్తగా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయడం, వీటితోపాటుగా 11 వేల 103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడమనే భారీ ప్రక్రియ విజయవంతంగా పూర్తయితే టి.ఆర్.ఎస్. నినాదం పరిపూర్ణమవుతుందని, అదే ఇప్పుడు బి.జే.పి.అక్కసు వెళ్ళగక్కడానికి ప్రధాన కారణమని ఆ నేతలు అంటున్నారు.

నోటిఫికేషన్‌లలో సాంకేతికపరమైన అంశాల్లో ఏమైనా లోపాలుంటే వాటిని వివాదాస్పదం చేయడానికి, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే నిర్ణయంలో గెజిటెడ్ హోదాలోని వారిని నేరుగా రెగ్యులరైజ్ చేయకూడదనే చట్టాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆ రెగ్యులరైజ్ చేసే ప్రక్రియకు బ్రేకులు వేస్తారేమోనని ఆ నేతలు మదనపడుతున్నారు. అంతేగాక కొత్తగా నియామకాలు చేసే పోస్టులకు బడ్జెట్ కేటాయింపులు కూడా జరపలేదని బి.జే.పి.నేతలు విమర్శించడాన్ని చూస్తుంటే ఈ అంశాన్ని కూడా వివాదాస్పదం చేస్తారేనని టి.ఆర్.ఎస్. నేతలు అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. ఎటొచ్చీ ఈ నియామకాలు జరిగితే రాష్ట్రంలో టి.ఆర్.ఎస్. పార్టీకి జనం నీరాజనాలు పలుకుతారని, ఎలాగైనా టి.ఆర్.ఎస్.కు ఇబ్బందులు సృష్టించాలనే బి.జే.పి.చేసే కుట్రలు, కుతంత్రాలను పసిగట్టి సమర్ధవంతంగా ఎదుర్కోవాలని ఆ నాయకులు ప్రభుత్వ పెద్దలను కోరుతున్నారు. పైగా బి.జే.పి. నాయకులకు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో అవసరమైన పలుకుబడి కూడా ఉందనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు పరిగణనలోకి తీసుకోవాలని కూడా ఆ నేతలు కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News