Tuesday, May 14, 2024

గాంధీ మహాత్ముడెలా అవుతాడు: బిజెపి ఎంపి వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు:మహాత్మాగాంధీ సారథ్యంలో జరిగిన దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఒక నాటకంగా మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపి అనంతకుమార్ హెగ్డే అభివర్ణించారు. అటువంటి వ్యక్తులను భారతదేశంలో మహాత్మ అని ఎలా పిలుస్తారని అంటూ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం బెంగళూరులో జరిగిన ఒక బహిరంగసభలో బిజెపి ఎంపి హెగ్డే మాట్లాడుతూ, స్వాతంత్య్ర ఉద్యమం పేరిట జరిగినదంతా అప్పటి బ్రిటిష్ పాలకులు ఆడించిన నాటకమని ఆరోపించారు. స్వాతంత్య్ర ఉద్యమ నాయకులు అని చెప్పుకున్న వీరెవరూ పోలీసుల లాఠీ దెబ్బలు ఏనాడూ తినలేదు. “వారు సాగించిన స్వాతంత్య్ర ఉద్యమం ఒక పెద్ద డ్రామా. బ్రిటిష్ పాలకుల అనుమతితోనే ఈ నాయకులు ఈ నాటకం ఆడారు. అది ఒక నిజమైన పోరాటం కాదు. అది ఒప్పందం ప్రకారం జరిగిన డ్రామా” అంటూ ఆయన ఆరోపించారు. అంతేకాదు..మహాత్మా గాంధీ చేసిన సత్యాగ్రహాలు, నిరాహార దీక్షలను కూడా బిజెపి నాయకుడు హెగ్డే ఒక డ్రామాగా కొట్టివేశారు. “ఆమరణ దీక్షల వల్ల, సత్యాగ్రహాల వల్ల మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందంటూ కాంగ్రెస్ చెబుతున్నవన్నీ కాకమ్మ కబుర్లు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. సత్యాగ్రహం వల్ల బ్రిటిష్ పాలకులు ఈ దేశాన్ని విడిచి వెళ్లలేదు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. “నిరాశా నిస్పృహలతోనే బ్రిటిషర్లు మన దేశానికి స్వాతంత్య్రం ఇచ్చారు. చరిత్ర చదువుతుంటే నా రక్తం మరిగిపోతుంటుంది. అటువంటి వ్యక్తులు మన దేశంలో మహాత్మాగా చెలామణి అవుతున్నారు” అంటూ హెగ్డే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

BJP MP Hegdes shocking comments on Gandhi, Gandhis freedom struggle is a big drame, he alleges
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News