Friday, May 10, 2024

కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేం

- Advertisement -
- Advertisement -

కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేం
సుప్రీం కోర్టుకు వివరించిన కేంద్రం


న్యూఢిల్లీ : కొవిడ్ 19తో మరణించిన కుటుంబాలకు రూ.4 లక్షల వంతున పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియచేసింది. ఆర్థిక పరిమితులు, ఇతర కారణాల వల్ల ఈ విధంగా నష్టపరిహారం చెల్లించడం సాధ్యం కాదని అఫిడవిట్ ద్వారా తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, సహాయక చర్యలకు కనీస ప్రమాణాలు, మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కోరుతూ దాఖలైన వ్యాజ్యానికి సంబంధించి కేంద్రం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు నష్టపరిహారంగా చెల్లించే విధంగా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. మే 24న కేంద్రానికి నోటీసు జారీ చేసింది. విపత్తు నిర్వహణ చట్టం ,2005 లోని సెక్షన్ 12 దృష్టా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన లేఖ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని పిటిషనర్ కోరారు. దీనిపై కేంద్రం స్పందిస్తూ ఇలా ఇవ్వాల్సి వస్తే విపత్తు సహాయ నిధులు మొత్తం వాటికే కేటాయించాల్సి వస్తుందని అఫిడవిట్‌లో పేర్కొంది. దేశంలో కరోనా మహమ్మారి వల్ల ఇప్పటివరకు 4 లక్షల మంది చనిపోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంతమందికి ఒక్కొక్కరికి రూ. 4లక్షల వంతున ఇవ్వాలంటే మొత్తం ఎస్‌డిఆర్‌ఎస్ నిధులన్నీ దీనికే ఖర్చయిపోతాయని మిగతా వాటి కోసం మరింత భారీగా చెల్లించాల్సి వస్తుందని కేంద్రం తెలియచేసింది.

ఒకవేళ అలా చేయాల్సి వస్తే కరోనా వైరస్ విజృంభణ సమయంలో అత్యవసర వైద్యసేవలు, పరికరాలను సమకూర్చుకోవడం లేదా తుపాన్లు, వరదలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోడానికి రాష్ట్రాల వద్ద సరిపడా నిధులు ఉండవని వివరించింది. అందుకే కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం కోరుతూ పిటిషనర్ చేపిన విన్నపం రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థోమతకు మించినదని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాకుండా ఒకవేళ కరోనాకు పరిహారం చెల్లిస్తే ఇతర వ్యాధులకు నిరాకరించడం అన్యాయమే అవుతుందని అభిప్రాయ పడింది. కేవలం వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు మాత్రమే విపత్తు సహాయం చెల్లిస్తుందని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. నేషనల్ హెల్త్ మిషన్ కింద 201920 లో కొవిడ్ నియంత్రణ కోసం రాష్ట్రాలకు అదనంగా రూ.1113.21 కోట్లు విడుదల చేసినట్టు కేంద్రం వెల్లడించింది.

can’t give compensation for covid victims: Centre

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News