Tuesday, May 7, 2024

అశ్లీల వీడియోల అప్‌లోడింగ్: దుబాయ్ మహిళ పిటిషన్ కొట్టివేత

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: తన పేరుతో కొనుగోలు చేసిన సిమ్ కార్డ్ ద్వారా అశ్లీల వీడియోలు అప్‌లోడ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దుబాయ్‌కు చెందిన మహిళ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు తోసిపుచ్చింది. బెంగళూరు ఈస్ట్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని కోరుతూ గత 13 ఏళ్లుగా దుబాయ్‌లో నివసిస్తున్న మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి కె. నటరాజన్ ఇటీవల తోసిపుచ్చారు. దర్యాప్తునకు సహకరించవలసిందిగా నిందితురాలైన ఆ మహిళను న్యాయమూర్తి ఆదేశించారు.

అశ్లీల వీడియోలను ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్ చేసేందుకు ఉపయోగించిన సిమ్ కార్డ్ ఆమె పేరుతో కొన్నందున ఆమె నిందితురాలేనని, ఆమె నేరం చేసినట్లు తాము పరిగణించడం లేదని న్యాయమూర్తి అన్నారు. తన పేరుతో మరొకరు సిమ్ కార్డు కొన్నట్లు ఆ మహిళ నిరూపించాలని, దీని వల్ల అసలు నేరస్తులపై చార్జిషీట్ దాఖలు చేయవచ్చని కూడా న్యాయమూర్తి అన్నారు. బెంగళూరులోని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఆ మహిళ పేరుతో కొన్నట్లు సమాచారం లభించడంతో పోలీసులు ఐటి చట్టంలోని 67, 67(బి) కింద ఆమెపై కేసు నమోదు చేశారు.

దుబాయ్‌లో గత 13 ఏళ్లుగా నివసిస్తున్న మహిళ బెంగళూరులో సిమ్ కార్డు ఎలా కొంటారని, ఆమె పేరుతో ఎవరో కొంటే అందుకు ఆమె ఎలా బాధ్యురాలు అవుతుందని నిందితురాలి తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. కాగా..పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ ఆమెకు తెలిసే సిమ్ కార్డు కొనుగోలు జరిగిందా లేక ఆమె కొనగోలు చేసి వేరే వ్యక్తికి ఇచ్చారా అన్న వాస్తవం దర్యాప్తులో తేలాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News