Tuesday, May 7, 2024

కులానికి అడ్డుకట్ట వర్గ ఉద్యమాలే!

- Advertisement -
- Advertisement -

కుల సమస్యపై అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ వైఖరిపై అనేక అవాస్తవమైన విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కుల వ్యవస్థ పునాది కుల వ్యవస్థకు అడ్డుకట్ట ఎలా జరుగుతుంది అన్నది అవగాహన చేసుకుందాం. కుల వివక్ష, అంటరానితనం, కుల అణచివేత ఇప్పుడే కనుగొన్నట్లు కొందరు భావిస్తున్నారు. కుల సమస్య పరిష్కారం కాకుండా దేశంలో సమస్యలు పరిష్కారం కావని, ముందుగా కుల వ్యతిరేక పోరాటాలు చేయాలని, ఆ తర్వాత మాత్రమే వర్గ పోరాటాలు చేయాలని కొందరు, మార్క్సిజానికి, అంబేడ్కరిజాన్ని జోడిస్తేనే నేటి వ్యవస్థ మార్పు సాధ్యమవుతుందని మరికొందరు, దానికి అనుగుణంగానే లాల్, నీల్ జండాలు ఐక్యం కావాలని చెబుతున్నారు. అసలు కులాల ఏర్పాటుకు ఆర్థిక అసమానతలు ఎలా దోహదం చేశాయి అన్నవిషయాలను గుర్తించటంలో కొన్ని కమ్యూనిస్టు శ్రేణులు, కుల పోరాటవాదులు, విఫలమవుతున్నారు. అసలు కులాల ఏర్పాటుకు దారితీసిన ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులు ఏమిటన్నది పరిశీలన చేయటం చాలా అవసరం.

ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా భారత సమాజంలో కులం ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. ఆదిమ సమాజం చివరి దశ ముందు వర్గాలు, వర్ణాలు, కులాలు లేని పరిస్థితుల్లో వర్ణ విభజన, కుల విభజనకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? ఆ కాలంలో ఆర్యులు సింధునది పరివాహక ప్రాంతమైన పంజాబ్‌లో ప్రవేశించి తూర్పు గంగానది మైదాన ప్రాంతపు వైపు వచ్చారు. మొదట వీరు దేశ దిమ్మరులుగా ఉన్నారు. అప్పటికే ఆ ప్రాంతంలో ద్రవిడ తెగలు ఉన్నాయి. భూప్రాంతాల ఆధిపత్యం కోసం ఆర్యులు, ద్రావిడుల మధ్య యుద్ధాలు జరిగాయి. యుద్ధాలలో గెలిచిన తెగ ఓడిపోయిన తెగ ప్రజలను మొదట చంపివేశారు. ఆ తర్వాత యుద్ధంలో ఓడిపోయిన ద్రావిడులను బానిసలుగా చేసుకున్న ఆర్యులు వారిని ఊరికి దూరంగా ఉంచారు. వారిని అంటరానివారుగా చూశారు. నిప్పు కనిపెట్టడం, వ్యవసాయం నేర్చుకోవడంతో తమ బానిసలుగా ఉన్నవారి చేత వ్యవసాయం చేయించి ఆర్యులు అదనపు ఉత్పత్తిని పొందారు. ఆ విధంగా శ్రమ దోపిడీ ప్రారంభమై బానిస యజమానిగా బానిస సమాజానికి పునాది ఏర్పడినది. వ్యవసాయం స్థిరమైన వృత్తిగా ఏర్పడటం, ఉత్పత్తి పెరగటంతో తెగల మధ్య యుద్ధాలు తీవ్రమైనాయి.

సమాజం యుద్ధం చేసేవాళ్లుగా విభజింపబడింది. గణపతి యుద్ధ నాయకుడు అయ్యాడు. గణవ్యవస్థ విచ్ఛిన్న దశలో తనకు తాను రాజుగా గణపతి ప్రకటించుకున్నాడు. క్రమంగా బానిస సమాజం ఏర్పడింది. బానిస సమాజ ఏర్పాటుకు భూమి కోసం యుద్ధా లు కారణంగా ఉంది. బానిస సమాజంలో వర్ణ విభజన జరిగింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా సమాజం విభజించబడింది. హిమాలయ పర్వత ప్రాంతంలో అనేక తెగలకు చెందిన పర్వత ప్రాంతవాసులను నిషాదులుగా పిలిచేవారు. వర్ణ వ్యవస్థకు బయట ఉన్న వీరిని, వీరి ప్రాంతాలను కూడా ఆర్యులు ఆక్రమించుకుని తమ సేవకులుగా చేసుకుని పంచములుగా స్థానం కల్పించారు.
సమాజంలో తమ స్థానాలను సుస్థిరం చేసుకోవటానికి పురోహితవర్గం, యుద్ధవీరుల (రాజుల) వర్గం ఐక్యం అయ్యారు. రాజుని దేవుడుగా పురోహిత వర్గం అభివర్ణిస్తే, పురోహితుణ్ణి పవిత్రుడిగా రాజు పేర్కొన్నాడు.

దాని ప్రకారం బ్రాహ్మణుణ్ణి అందరూ గౌరవించాలి. వర్ణ విభజనకు ఆర్థిక అంశాలే పునాదిగా ఉన్నాయి. రాజు భూమికి అధిపతిగా ఉన్నాడు. బ్రాహ్మణుడు సమాజం చేత గౌరవం పొంది అన్నిటినీ పొందాడు. వైశ్యుడు వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించాడు. సమాజానికి అవసరం అయిన ఉత్పత్తులు సృష్టించే శూద్రులకు మాత్రం వాటిపై హక్కు ఉండదు. వారు సృష్టించే ఉత్పత్తులన్నీ ఉత్పత్తిలో పాల్గొననిపై మూడు వర్గాలు దోపిడీ చేశాయి. ఇది వర్గ దోపిడీగా రూపుదిద్దుకుంది. వర్ణ వ్యవస్థలో స్థానం పొందటానికి ఉత్పత్తిపై హక్కు, సంపద ప్రభావితం చేశాయి. ఆర్థికంగా సంపన్నులై, అపార పశుసంపద కలిగిన ఫణులకు మాత్రం వైశ్యులలో స్థానం కల్పించారు. దీన్ని గమనిస్తే ఆర్థిక అవసరాల ప్రాముఖ్యంగా ఏర్పడినదే వర్ణ వ్యవస్థ. వర్ణ విభజన వ్యవస్థను పరిరక్షించటానికి కట్టుదిట్టమైన అణచివేత, మతపరమైన విధానాలు ప్రవేశపెట్టారు. వర్ణ విభజనను వ్యతిరేకిస్తే కఠినమైన శిక్షలు తప్పవని, మరో జన్మలో కూడా నీచంగా జన్మిస్తారని, నరకం తప్పదని శూద్ర వర్గాన్ని భయపెట్టారు. వర్ణాశ్రమ ధర్మాలను, కట్టుబాట్లను పరిరక్షించే బాధ్యతను రాజు తీసుకున్నాడు.

బానిస సమాజంలో ఏర్పడిన వర్ణ విభజన దాని నుంచి వృత్తిపరమైన విభజన జరగగా, ఆ వ్యవస్థ చివరి దశలో శూద్ర వర్ణానికి చెందిన కొన్ని శాఖలు ఫ్యూడల్ సమాజంలో భూమి కాపలాదారులుగా, అజమాయిషీదారులుగా మారారు. ఈ వృత్తిదారుల నుంచే కాపు, కమ్మ, రెడ్డి, రాజు, ఎస్సీ కులాలుగా ఏర్పడ్డాయి. కుల విభజనను ఫ్యూడల్ వర్గం ఆమోదించింది. కమ్మ, రెడ్డి, కాపు, క్షత్రియ కులాలు క్రమంగా భూమిని, ఉత్పత్తి పరికరాలను తమ అధీనంలోకి తెచ్చుకుని ఆర్థికంగా, సాంఘికంగా అభివృద్ధి చెంది శూద్ర వర్ణంలో అగ్ర కులాలుగా మారారు. నేడు అగ్ర వర్ణాల కన్నా ఈ కులాలకు చెందినవారు ఆర్థికంగా, రాజకీయంగా పట్టు సాధించి రాష్ట్రంలో పాలక వర్గాలుగా మారారు. ఈ అగ్ర కులాల్లో కూడా కమ్మ, రెడ్డి కులాల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. ఇందుకు ఆర్థిక సంబంధాలే కారణం. ఈ పరిణామ క్రమాన్ని గమనిస్తే వర్ణ విభజన నుంచి ఫ్యూడల్ సమాజంలో కుల వ్యవస్థ ఏర్పాటు జరిగిందనే వాస్తవం వెల్లడవుతున్నది. అగ్ర వర్గాలు శూద్ర వర్ణ ప్రజలను ఊరికి దూరంగా పెట్టినట్టే, ఎస్సీ కులాలను అగ్రకులాల వారు ఊరికి దూరంగా ఉంచారు. కొంత భూమి, పశువులు, వృత్తి పరికరాలు కలిగిన యాదవ, గౌడ, చాకలి, మంగలి కులాలను గ్రామంలోనే ఉండనిచ్చారు. కుల దొంతరను ఫ్యూడల్ వర్గం ప్రోత్సహిస్తూ తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ ఉన్నది.

కుల వ్యవస్థకు, కుల అణచివేతకు చారిత్రక కారణాలను విస్మరించి భూస్వామ్య వర్గ, పాలక వర్గాల ప్రయోజనాలకు అనుకూలమైన విధంగా కుల సమస్యపై ప్రచారం చేస్తూ, భారత కమ్యూనిస్టు ఉద్యమంపై కొందరు విషపూరిత ప్రచారం చేస్తున్నారు. కుల వ్యతిరేక పోరాట అవగాహనలో అంబేడ్కర్ ఆలోచనకు, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఆలోచన మధ్య కుదరని అంశాలు చాలా ఉన్నాయి. అంబేడ్కర్ కుల వ్యత్యాసాలకు, కుల వివక్షకు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. దాన్ని అందరూ అంగీకరిస్తారు. ఈ విషయంలో విభేదాలు లేవు. కుల వివక్ష, కుల అణచివేత ఎలా తొలుగుతుంది అన్న విషయంలో కమ్యూనిస్టులకు, అంబేడ్కర్‌కు మధ్య విభేదం ఉంది. కుల వ్యవస్థ ఫ్యూడల్ సమాజం సృష్టిని, కుల అణచివేతకు అదే కారణమని, ఫ్యూడల్ వ్యవస్థను కూలద్రోయటం ద్వారానే కుల వివక్షపోతుందని అంబేడ్కర్ గుర్తించలేదు. అందుకే భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయలేదు.

కుల వివక్ష వ్యతిరేక పోరాటాలకే ఆయన పరిమితమైనారు. కమ్యూనిస్టు పార్టీ అర్ధ ఫ్యూడల్ వ్యవస్థే, కులాల ఏర్పాటుకు కారణమని, ఆ వ్యవస్థను కూలద్రోయటం ద్వారానే కుల అణచివేతను, వివక్షను ఆపగలమని చెప్పి, అందుకు భూస్వామ్య వ్యతిరేక వర్గ పోరాటాలు చేపట్టింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కులాలను విస్మరించి గ్రామీణ పేదలు అందరూ ఐక్యమై నైజాం నవాబుకి, జమీందార్లకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టి, పది లక్షల ఎకరాలు భూమి పంపిణీ చేసుకుని ఫ్యూడల్ వర్గాలు పట్నాలకు పరుగులు పెట్టేలా చేసి, అన్ని వర్గాల పేదలు తల ఎత్తుకు తిరిగేలా చేసిన వర్గ పోరాటాల ద్వారానే కుల సమస్యకు పరిష్కారం ఉందనే వాస్తవం వెల్లడించింది. ఇలాంటి పోరాటాలు జరిగిన ప్రాంతాల్లో పేదల మధ్య కుల అంతరాలు తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో దళితుల్లో ఏర్పడిన రాజకీయ చైతన్యం వర్గఉద్యమాల ద్వారా వచ్చిందే.
భారత సామాజిక వ్యవస్థ అర్ధ వలస, అర్ధ ఫ్యూడల్ వ్యవస్థ, గ్రామీణ ప్రాంతంలో నేటికీ ఫ్యూడల్ సంబంధాలు బలంగా ఉన్నాయి. వివక్షకు ఎక్కువగా గురవుతున్నది ఇక్కడే.

పాలకవర్గాలు కుల వైరుధ్యాలను పెంచుతూ నేటి వ్యవస్థను కాపాడుతూ వస్తున్నారు. అందువలన అర్ధ ఫ్యూడల్ వ్యవస్థను కూలద్రోసి దున్నేవానికే భూమి సాధించుకున్నప్పుడే కుల వివక్ష ఆగుతుంది. అంబేడ్కర్ వాదులుగా ప్రచారం చేసుకునే కొందరు కుల పోరాటాన్ని ముందుకు తెస్తున్నారు. దీని అర్ధం అగ్ర కులాల, దళిత కులాల మధ్య జరిగే పోరాటంలో ఎవరో ఒకరు విజయం సాధించాలి. ఇది పరస్పర మారణకాండకు దారి తీస్తుంది. ఇది కుల సమస్యకు పరిష్కారమే కాదు. అంబేడ్కర్ ఇలాంటి కుల పోరాటం చేయాలని చెప్పలేదు. లాల్, నీల్ జండాలు ఐక్యం కావాలనే నినాదం కొందరు ముందుకు తెచ్చారు. ఇందులో సిపిఐ, సిపియం పార్టీలు గొంతు కలపటమే ఆశ్చర్యంగా ఉంది.
కుల సమస్యతో పాటు దేశ సమస్యలు పరిష్కారం కావాలంటే మార్క్సిజానికి, అంబేడ్కరిజాన్ని జత చేయాలని, అందుకు లాల్, నీల్ శక్తులు ఐక్యం కావాలంటున్నారు. మార్క్సిజం, అంబేడ్కరిజం పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలు. భావపరంగా వీటి మధ్య ఐక్యత సాధ్యం కాదు. వ్యవస్థ వ్యతిరేక పోరాటంలో కలిసివచ్చే శక్తులతో కమ్యూనిస్టు పార్టీ ఐక్యసంఘటన నిర్మిస్తుంది. ఇందులో నీల్ శక్తులు కూడా భాగస్వామ్యం కావచ్చు.

ఐక్యతకు, ఐక్య కార్యాచరణకు మధ్య తేడా ఇది. దీనికి సిపిఐ, సిపిఐ (యం) పార్టీలు ఏమి చెబుతాయి. లాల్, నీల్ ఐక్యత అంటే మార్క్సిజం సిద్ధాంతం ఒక్కటే దేశ సమస్యలకు, కుల సమస్యకు పరిష్కారం కాదని చెప్పటమే గదా! అంటే మార్క్సిజం సిద్ధాంతంపై సిపిఐ, సిపియం పార్టీలకు పూర్తి విశ్వాసం లేకపోవటమే గదా. సరైన దిశలో వర్గ పోరాటాలు జరిగినప్పుడు కుల సమస్యపై మార్క్సిస్టు వ్యతిరేక ధోరణులు ముందుకు రాలేదు. వర్గ పోరాటాల నుండి కమ్యూనిస్టు పార్టీ దూరం కావటం వలనే కుల సమస్యపై కమ్యూనిస్టు వ్యతిరేక ధోరణులు ముందుకు వస్తున్నాయి. ఈ ధోరణులకు అడ్డుకట్ట వేయాలంటే వర్గ ఉద్యమ నిర్మాణం జరగాలి. భారత కమ్యూనిస్టు ఉద్యమంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి.

బొల్లిముంత సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News