Wednesday, May 1, 2024

‘నారద’ లీల!

- Advertisement -
- Advertisement -

CBI arrests four TMC leaders in Narada case

 

పశ్చిమ బెంగాల్ ప్రజలకు తమ బతుకు తాము బతుక్కునే సందు ఇవ్వకుండా వరుస రాజకీయ రణ రంగాలు వచ్చిపడుతున్నాయి. తృణమూల్ బిజెపిల మధ్య హోరాహోరీ ఎన్నికల ప్రచార యుద్ధకాండతో ఉడుకెత్తిపోయిన ఆ రాష్ట్రానికి ఫలితాల ప్రకటనతో కొంత విశ్రాంతి లభించింది. ఇంతలోనే ఐదేళ్ల నాటి ‘నారద’ శీల శోధన (స్టింగ్ ఆపరేషన్) కేసులో ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ మంత్రులు, ఒక ఎంఎల్‌ఎ, మరొకరిని సిబిఐ అరెస్టు చేసిన ఘటన సంచలనం సృష్టించింది. సోమవారం నాడు కోల్‌కతాలో జరిగిన ఈ అరెస్టులకు ఇప్పుడిప్పుడే కాళ్లూనుకుంటున్న మమతా బెనర్జీ కొత్త ప్రభుత్వం ఉలిక్కి పడింది. ఆమె ఈ సవాలును ఆషామాషీగా తీసుకోలేదు. అసలే ఆమె డీ అంటే డీ అనే దీదీ. అరెస్టులకు సిబిఐ పాల్పడగానే సోమవారం ఉదయం 11 గం. కే కోల్‌కతాలోని ఆ సంస్థ కార్యాలయం వద్దకు ఆమె సపరివారంగా చేరుకున్నారు. తనను కూడా అరెస్టు చేయాలంటూ సాయంత్రం 5 గం. వరకు ధర్నా నిర్వహించారు. వందలాది మంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడకు వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు చేశారు. కొన్ని హింసాత్మక ఘటనలు కూడా జరిగాయి.

రాష్ట్రమంతటా గల ఆ పార్టీ శ్రేణులు రోడ్ల మీదికి వచ్చి ఆగ్రహ పూరిత ప్రదర్శనలు నిర్వహించారు. ఇలా ఎక్కడికక్కడ గుంపులు గుమిగూడడం వల్ల ఆ రాష్ట్రంలో కరోనా మరింత విజృంభించే అవకాశాలను ఊహించవచ్చు. ఈ ఘటనలను పరిశీలించిన గవర్నర్ జగదీప్ ధన్‌కర్ రాష్ట్రంలో రాజ్యాంగ పాలనకు విఘాతం కలుగుతున్నదంటూ మమతను ట్విట్టర్‌లో హెచ్చరించారు. వీరి అరెస్టుకు గత పది రోజుల క్రితం ఆయనే సిబిఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు చెబుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు హామీగా ఉండవలసిన రాజ్యాంగ అధినేతగా గవర్నర్ సమయం, సందర్భం చూసుకోకుండా తొందరపడ్డారని అనిపించడం సహజం. చట్టం తన పని తాను చేసుకోడాన్ని ఎవరూ ఆక్షేపించడానికి వీల్లేదు. కాని అది ఎవరో చెప్పినట్టు నడచుకుంటున్నదని, ఎవరి చెప్పుచేతల్లోనో అడుగులు వేస్తున్నదని అనిపించేలా పరిణామాలు చోటు చేసుకున్నప్పుడే ఆందోళన చెందవలసి ఉంటుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన బిజెపి ఆ అసంతృప్తిని చల్లార్చుకోడానికి, ఆ కక్ష తీర్చుకోడానికే ఈ అరెస్టులకు సిబిఐని ఉసిగొల్పిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది.

నాలుగేళ్లు ఆగిన సిబిఐ మరి నాలుగు రోజులు ఆగి కొవిడ్ ముప్పు తప్పిన తర్వాత ఈ చర్య తీసుకుని ఉంటే ఈ ఆరోపణను ఎదుర్కోవలసిన పరిస్థితి బిజెపికి కలిగేది కాదు. అరెస్టు చేసిన వారిలో ఇద్దరు మంత్రులు, ఒక ఎంఎల్‌ఎ ఉన్నారు. వారిని అరెస్టు చేయడానికి ముందు తన అనుమతి తీసుకోకపోడాన్ని అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ ఆక్షేపించారు. స్టింగ్ ఆపరేషన్ సందర్భంగా ఒక ఐపిఎస్ అధికారికి డబ్బు అప్పజెప్పవలసిందిగా సూచిస్తూ వీడియోలో కనిపించిన రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్‌ని ఎందుకు అరెస్టు చేయలేదని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడొకరు ప్రశ్నించారు. తృణమూల్ నుంచి బిజెపిలోకి మొన్నటి ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ మీద పోటీ చేసిన సువేందు అధికారి కూడా తమ స్టింగ్ వీడియోలో ఉన్నారని ఆయనను ఎందుకు వదిలిపెట్టారని ‘నారద’ న్యూస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రశ్నించారు. ఆయనకు కూడా తాను డబ్బు ఇచ్చానని చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన శీల శోధన ఉదంతం 2014లో జరగ్గా 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ వీడియోను ‘నారద’ బహిర్గతం చేసింది.

ఒక కల్పిత కార్పొరేట్ కంపెనీకి పనులు చేసి పెట్టడం కోసం ‘నారద’ ప్రతినిధులు ఇచ్చిన లంచం తీసుకుంటూ టిఎంసికి చెందిన వీరందరూ కెమెరాకు దొరికిపోయారు. ఈ కేసును 2017లో సిబిఐకి అప్పగించారు. అది ఇంత కాలం ఏమి చేసిందనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అయితే ఇప్పటికైనా కదిలి ఈ అరెస్టులు చేసినందుకు సంతోషించాల్సిందే. కాని అరెస్టులు జరిగిన విధానం కేంద్ర పాలక పక్షం రాష్ట్రంలో ఇటీవలే తనను ఘోర పరాజయం పాలు చేసి అఖండ విజయాలతో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వానికి తడాఖా చూపించే ఉద్దేశంతో జరిపించిన అరెస్టులుగా కనిపించడమే బాధాకరం. గతంలో తెహల్కా ఆధ్వర్యంలో జరిగిన శీల శోధనకు దొరికిపోయి ప్రముఖ బిజెపి దళిత నేత ఒకరు ఆ పార్టీ అధ్యక్ష పదవి కోల్పోయారు.

జైలు శిక్ష అనుభవించారు. 2002 గుజరాత్ నరోడా పాటియా నరమేధం కేసులో ఆ ఊచకోతను తాను ప్రోత్సహించానని అంగీకరిస్తూ భజరంగ్ దళ్ నాయకుడు బాబూ బాయ్ పటేల్ తెహల్కా స్టింగ్ కెమెరాకు దొరికిపోయాడు. 2005 డిసెంబర్‌లో సభలో ప్రశ్నలడగడానికి స్టింగ్ లంచాన్ని తీసుకున్న 11 మంది ఎంపిలను సభ్యత్వం నుంచి పార్లమెంటు తొలగించిన ఉదంతం సంచలనం సృష్టించింది. అవినీతి ఏ రూపంలో, ఏ స్థాయి లో జరిగినా బాధ్యులపై విచారణ జరిపి శిక్షించాల్సిందే. కాని అందులో అయిన వారిని వదిలేసి ప్రత్యర్థులపై పగపడుతున్నారని అనిపించడం ఎంతమాత్రం మంచిది కాదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News