Friday, April 26, 2024

మోగిన ‘చావు’ డప్పులు

- Advertisement -
- Advertisement -

Center discriminates against Telangana Farmer

కేంద్రంపై కదంతొక్కిన కర్షకలోకం

ధాన్యం నిరసనలతో దద్దరిల్లిన పల్లె, పట్నం

దిష్టిబొమ్మల దహనాలతో హోరెత్తిన కూడళ్లు

పండిన ప్రతి గింజను కొనాలని కేంద్రానికి
టిఆర్‌ఎస్, రైతుల హెచ్చరిక న్యాయం
జరిగేవరకూ ఎంత దూరమైనా వెళ్లి పోరాడుతాం..
ఎవరినీ వదిలిపెట్టం బిజెపి నేతలు రోడ్లపైకి
రాలేరు రైతులు బాగుపడాలంటే మోడీ గద్దె
దిగాల్సిందే ధాన్యం కొనుగోలుపై ఎన్నిసార్లు
చెప్పినా పట్టించుకోకపోవడం సిగ్గుచేటు పంటలు
పండించడమే రాష్ట్రం బాధ్యత.. కొనడం కేంద్రానిదే
కేంద్ర మంత్రి పచ్చి అబద్ధాలు
రైతులపై ప్రేమ ఉంటే ప్రధానిని ఒప్పించాలి
కేంద్రం కుట్రకు రైతులు బలి కావొద్దు :
నిరసనల్లో పాల్గొన్న మంత్రులు, ఎంపిలు,
ఎంఎల్‌ఎలు, నేతలు
రైతులను ఆగంజేసి ఆ కోపం
టిఆర్‌ఎస్‌పైకి వస్తే రాజకీయంగా
లబ్ధి పొందాలని బిజెపి కుట్ర :
హరీశ్‌రావు

‘ధాన్యం కొంటరా.. కొనరా’ ఏదో ఒక్క మాట చెప్పండి అని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని తెలంగాణలోని ప్రతి పల్లె నిలదీసింది. పండించిన పంటను పెంట పాల్జేయాల్నా? అని ప్రశ్నించింది. పండించిన ప్రతి ధాన్యం గింజను కొన కుండా తెలంగాణ రైతుపై కేంద్రం వివక్ష చూపుతోందని కన్నెర్రజేశారు. రాష్ట్రంలో పసిడి పంటలు పండుతుంటే బాధ్యతగా కొనాల్సింది పోయి కొర్రీలు వేస్తారా అని మండిపడ్డారు. సోమవారం తెలంగాణ టిఆర్‌ఎస్ నాయ కత్వంలో చావుడప్పులు, ధర్నాలతో దద్దరిల్లింది. నాలుగు కూడళ్లలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మల కు రైతులు అగ్గిపెట్టారు. ఇప్పటికైనా మోడీ తమ నిరసనలు చూసి కళ్లు తెరవాలని హితవుపలికా రు. యాసంగి బియ్యం తీసుకోబోమని రైతులను రాశిరంపాన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పల్లెలో నల్లజెండాలు చేతబట్టుకుని, చావు డప్పులు మోగిస్తూ వేల సంఖ్యలో చౌరస్తాల వద్దకు కదిలారు. రైతులను రాజకీయంగా వాడుకోవద్దని, టిఆర్‌ఎస్‌కు వాళ్లను దూరం చేసే కుట్రలకు పాల్పడవద్దని కేంద్రాన్ని హెచ్చరించా రు. కార్పొరేట్లకు మోడీ ప్రభుత్వం ఊడిగం చేయ డం మానుకొని చేయాలని నినదించా రు. ‘ఊరూరా చావు డప్పు’ పేరిట నిర్వహించిన ఈ ఆందోళనల్లో మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎ లు, టిఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వరి కంకులు చేతపట్టకుని, ధాన్యం బస్తాలను నెత్తిన పెట్టుకుని ఎండ్ల బండ్ల ర్యాలీలు తీస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

మన తెలంగాణ/హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనుసరిస్తున్న తీరును గర్హిస్తూ చావుడప్పుల నిరసనలతో రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్ పార్టీ హోరెత్తించింది. రైతుల పట్ల మోడీ సర్కార్ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో భగ్గుమంది. ఇందుకు నిరసనగా ‘ఊరూరా చావు డప్పు’ పేరుతో నిర్వహించిన నిరసనల్లో రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భం గా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. పలుచోట్ల ప్రధాని కేంద్రం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పలు గ్రామాల్లో కేంద్రం శవయాత్రను నిర్వహించింది. ధాన్యాన్ని రోడ్డు మీద పోసి తగులపెట్టింది. పలువురు పార్టీ కార్యకర్తలు గుండ్లు గీయించుకుని కేంద్రం పట్ల వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. పలు చోట్ల నల్ల జెండాలను ఎగురవేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిపై నిరసనగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పిలుపు మేరకు టిఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సోమవారం పెద్దసంఖ్యలో రోడ్లపైకి వచ్చారు.

నల్ల బ్యాడ్జీలు ధరించి ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టారు. ప్రధాన కూడళ్ల వద్ద వివిధ రకాల ఆందోళనలను నిర్వహించారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ విషయంలో మోడీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై నిప్పులు గక్కారు. సందర్భంగా పలు చోట్ల జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొని కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గుండెల్లో గుణపం గుచ్చుతున్న మోడీకి బుద్ధిచెప్పే రోజులు దగ్గరపడ్డాయని ధ్వజమెత్తారు. రైతులను ఆగం చేస్తున్న మోడీ సర్కార్‌కు రాజకీయంగా చావు దెబ్బతీస్తామన్నారు. టిఆర్‌ఎస్ దెబ్బ ఎలా ఉంటుందో మోడీ ప్రభుత్వానికి తెలిసివచ్చేలా చేస్తామని రాష్ట్ర ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు హెచ్చరించారు. కార్పొరేట్ సంస్థల కనుసైగల్లో పాలన చేస్తున్న మోడీ ప్రభుత్వానికి ఒక రోజు కూడా అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. కేంద్రం, రాష్ట్రంలోని బిజెపి నాయకులు కలిసి రైతులను రోడ్ల మీదకు తీసుకొచ్చారని మండిపడ్డారు.

వారి మాటలను నమ్మి రైతులు పెద్దఎత్తున వరిని పండించి మోసపోయారని వారు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. వారికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం అం డగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేంద్రం మెడలు వచ్చి రైతులకు న్యాయం చేస్తామన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నది కెసిఆర్ అన్న విషయాన్ని బిజెపి నేతలు గుర్తుపెట్టుకోవాలన్నారు. అసాధ్యమనుకున్న రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర కెసిఆర్‌దేనని అన్నారు. అలాంటి నేతతో పెట్టుకున్న పార్టీలకు…నేతలకు రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా మారిన ఘటనలు అనేక ఉన్నాయన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం దిగి వచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. లేని పక్షంలో రాష్ట్రంలోని బిజెపి నేతలు ఎవరూ రోడ్లపైకి రాలేరని చాలా ఘాటుగా హెచ్చరించారు. రైతులకు న్యాయం జరగడం కోసం ఎంత దూరమైనా పోతామన్నారు.

ఎవరిని వదిలిపెట్టమన్నారు. ఇందులో మోడీయే కాదు…. మరెవ్వరితోనైనా ఢీ కొట్టేందుకు టిఆర్‌ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. అక్కడక్కడ నిరసనలు జరుగుతున్న ప్రాంతంలో టిఆర్‌ఎస్, బిజెపి నేతల మధ్య పరస్పరం తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ప్రధానంగా కరీంనగర్ జమ్మికుంట గాంధీ చౌక్ వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే పోలీసులు సకాలంలో అక్కడకు చేరుకుని వెనువెంటనే తగు చర్యలు తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

రైతు బాగుపడాలంటే బిజెపి గద్దె దిగాల్సిందే

దేశానికి అన్నం పెట్టే రైతులు చల్లగా ఉండాలంటే కేంద్రంలోని బిజెపి సర్కార్ వెంటనే గద్దె దిగాల్సిందేనని రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆందోళన కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేట్‌లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడు తూ…కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. రైతులు పండించిన ధ్యా న్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని కేంద్రానికి పలుమార్లు కెసిఆర్ విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. రైతులను పట్టించుకోని ప్రభు త్వం ఈ దేశానికి అవసరామా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి దేశ రక్షణ, విదేశీ విధానంతో పాటు ఆహారభద్రత అత్యంత కీలకమైన బాధ్యతలు ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో రైతులు పంటలు పండిన చోట ధాన్యాన్ని కొని, పండని చోట, ప్రకృతి విలయాలు ఏర్పిడన చోట ప్రజలకు అవసరమైన ధాన్యాన్ని అందుబాటులో ఉంచడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన విధి అని అన్నారు.

పంటలు పండించడమే రాష్ట్రం బాధ్యత అని…దానిని పూర్తిగా కొనే బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. అయినప్పటికీ కేంద్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సిఎంగా కెసిఆర్ బాధ్యతలు చేపట్టిన తరువాతనే రైతులకు 24 గంటల ఉచిత కరెంటు సరఫరా అవుతోందన్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతనే పెట్టుబడి సాయంగా రైతులకు ఇప్పటికే రూ. 50వేల కోట్లు నగదుగా అందజేశామన్నారు. ఉచిత కరెంటు కోసం రాష్ట్ర ప్రభుత్వం యేటా రూ.45 వేల కోట్ల వెచ్చిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలకు తాగునీరు…రైతులకు సాగునీరు వస్తుండడంతో పెద్దఎత్తున వరి పండిందన్నారు. పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్రానికి ఉన్న అభ్యంతరం ఏమిటని ఆయన నిలదీశారు. ఈ విషయంలో రాష్ట్రం నుంచి కేంద్రంలో ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కిషన్‌రెడ్డి కూడా పచ్చి అబద్దాలు ఆడుతున్నారని హరీశ్‌రావు తీవ్ర స్థాయి లో ఆగ్రహం వ్యక్తం చేశా రు. కిషన్‌రెడ్డి రోజుకొక వి ధంగా మాట్లాడుతూ…సొల్లు పురాణం చెబుతున్నారని విమర్శించారు. నిజంగా ఆయనకు రైతుల మీద ప్రేమ ఉంటే ప్రధానిని ఒప్పించి యాసంగిలో వడ్లు కొంటరా? కొనరా? అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ఉసురు పోసుకుని కార్పొరేట్ వర్గాలకు కేంద్రం లాభం చేస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

కేంద్రం కుట్రలో రైతులు బలికావొద్దు

కేంద్ర ప్రభుత్వం పన్నే కుట్రలో బలికాకుండా రైతులను కాపాడాలన్నదే సిఎం కెసిఆర్ లక్షమమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.నిరసన కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జిల్లా కేంద్రంలోని జెడ్‌పి మైదానం నుండి వేలాదిమంది రైతులతో ర్యాలీగా బయలుదేరి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక పోకడలపై చావు డప్పులు మ్రోగించారు. అనంతరం అక్కడి చౌరస్తాలో కేంద్రం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వేలాదిగా తరలివచ్చారు.

చావు డప్పు మోగించిన మంత్రులు

రైతులు తలెత్తుకునేలా ముఖ్యమంత్రి కెసిఆర్ పథకాలు తీసుకొస్తుంటే…. కేంద్రం మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ విమర్శించారు. రాష్ట్రం పట్ల కేంద్రం పూర్తిగాకక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నిరసన కార్యక్రమంలో భాగం గా ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో నిరసనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చావు డప్పును ఆయన మోగించారు. అలాగే మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా ఘటేకేసర్ మండలం ఎదులాబాద్‌లో మంత్రి మల్లారెడ్డి , నిర్మల్‌లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.

దున్నపోతు మీద వర్షం పడిన చందంగా కేంద్రం తీరు

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేఖ నిరసన ర్యాలీలో రాష్ట్ర శాసన మండలి మాజీ ఛైర్మన్, ఎంఎల్‌సి గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు.ధాన్యాన్ని కొనే విషయంలో రైతులు, రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేసినా కేంద్రం తీరు మారడం లేదన్నారు. రైతు ఉద్యమాల కారణంగా రద్దయిన మూడు రైతు వ్యతిరేక చట్టాలతో పాటు కరెంటు బిల్లుల పెంపు, వ్యవసాయ మోటర్లకు మీటర్ల బిగింపు చట్టాలను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

నిరసన ర్యాలీలు

ఎంఎల్‌సి శంభీపూర్ రాజు, ఎంఎల్‌సి వివేకానంద్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ గండిమైసమ్మ చౌరస్తాలో టిఆర్‌ఎస్ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి చావు డప్పుతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బిజెపినీచ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.

రైతులను ఆగం చేస్తున్న కేంద్రం

కేంద్రం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ హన్మకొండ జిల్లా కేంద్రంలో టిఆర్‌ఎస్ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు వినయ్‌భాస్కర్ పాల్గొన్నారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ రైతులను ఒకవైపు బాగు చేస్తుంటే కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ వారిని ఆగం చేసేందుకు యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని గ్రామగ్రామాన ఎండగడతామని హెచ్చరించారు. అలాగే జగిత్యాలలో ఎంఎల్‌ఎ విద్యాసాగర్‌రావు, ఖిలా వరంగల్‌లో స్థానిక శాసనసభ్యుడు నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు.

కాగా సత్తుపల్లిలో స్థానిక ఎంఎల్‌ఎ సండ్ర వెంకట వీరయ్య రైతులతో కలిసి.. సండ్ర నిరసన ప్రదర్శన చేపట్టారు. అలాగే కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిరసనలో స్వల్పఉద్రిక్తత చోటు చేసుకొంది. గాంధీ చౌక్ వద్ద జెడ్‌పి ఛైర్ పర్సన్ విజయ, మున్సిపల్ ఛైర్మన్ రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో ధర్నా చేస్తుండగా బిజెపి కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. గాంధీ చౌక్ వద్ద బైఠాయించి ఇరువర్గాలు పరస్పర నినాదాలు చేసుకున్నాయి. పోలీసులు అడ్డుకుని, భాజపా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్‌లో మేయర్ జి. విజయలక్ష్మీ, ఉప్పల్‌లో ఎంఎల్‌ఎ భేతి సుభాష్ రెడ్డి తదితరులు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News