Saturday, April 27, 2024

విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు

- Advertisement -
- Advertisement -

Central Govt bring New Education Policy

 

5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన
10+2 స్థానంలో 5+3+3+4 విధానం
ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్
డిగ్రీలో ఎప్పుడు ఎగ్జిట్ అయినా సర్టిఫికెట్
విద్యార్థులు సాధించిన క్రెడిట్లను ఎప్పుడైనా వినియోగించుకునే వెసులుబాటు కల్పన
ఎంఫిల్ రద్దు, సంస్కరణలు నైపుణ్యతకు పెద్దపీట
నూతన జాతీయ విద్యావిధానానికి ఆమోదం
కేంద్ర మంత్రి మండలి కీలక నిర్ణయం
హెచ్‌ఆర్‌డి ఇక కేంద్ర విద్యామంత్రిత్వశాఖ

మన తెలంగాణ/న్యూఢిల్లీ/హైదరాబాద్: ఉన్నత విద్యలో ప్రధాన సంస్కరణలు తీసుకువచ్చేందుకు తెచ్చిన జాతీయ నూతన విద్యా విధానం 2020కి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ (హెచ్‌ఆర్‌డి) శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చే ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇస్రో మాజీ చీఫ్ కె.కస్తూరిరంగన్ సారథ్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ తొలుత మంత్రిత్వ శాఖ పేరు మార్చాలని సిఫార్సు చేసిం ది. నూతన విద్యా విధానం డ్రాఫ్ట్‌లో ఇది కీలక సిఫార్సు కావడంతో పేరు మార్పునకు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. 1985 సెప్టెంబర్‌లో విద్యాశాఖను మానవ వనరుల శాఖగా మారుస్తూ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆ తర్వాత 1992లో దాన్ని సవరించారు. తాజాగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు 21వ శాతాబ్దపు జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి)కు కేంద్ర మంత్రి వర్గం ఆమో దం తెలిపిందని కేంద్ర ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో 21వ శతాబ్దానికి నూతన విధానానికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. నూతన విద్యా విధానాన్ని మొత్తం సమాజం, దేశం, ప్రపంచ విద్యావేత్తలు స్వాగతిస్తారని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. 34 ఏళ్లుగా విద్యా విధానంలో ఎలాంటి మార్పులు జరుగలేదని గుర్తు చేశారు.

2035 నాటికి 50 జిఇఆర్ సాధిస్తాం
నూతన విద్యా విధానం, సంస్కరణల అనంతరం 2035 నాటికి 50 శాతం గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (జిఇఆర్)ను సాధిస్తామని విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖరే పేర్కొన్నారు. ఇది చరిత్రాత్మకమైన రోజని, 34 ఏళ్ల తర్వాత దేశంలో నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) వచ్చిందని ఉన్నత తెలిపారు. ఎన్‌ఇసిలో సంస్థల కోసం గ్రేడింగ్ చేయబడ్డ విద్యా, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్ స్వయం ప్రతిపత్తి ఉంటుందని తెలిపారు. ఉన్నత కోసం ఒకే రెగ్యులేటరీ, అనేక తనిఖీల స్థానంలో అనుమతుల కోసం స్వీయ వెల్లడి ఆధారిత పారదర్శక వ్యవస్థ కింద పని చేస్తున్నట్లు చెప్పారు. మన దేశంలో 45 వేల అనుబంధ కళాశాలలు ఉన్నాయని, గ్రేడెడ్ స్వయం ప్రతిపత్తి కింద, అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్ స్వయం ప్రతిపత్తి వారి అక్రిడిటేషన్ స్టేటస్ ఆధారంగా కళాశాలలకు ఇవ్వబడుతుందని అన్నారు. ప్రాంతీయ భాషల్లో ఇ-కోర్సులు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. వర్చువల్ ల్యాబ్‌లను అభివృద్ధి చేసి నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం (నెట్ ఎఫ్) రూపొందిస్తున్నట్లు ఖరే వివరించారు. ఎన్‌ఇపి 2020 రూపకల్పనలో విస్తృత సంప్రదింపులు జరిపామని తెలిపారు. మొత్తం 2.5 లక్షల గ్రామ పంచాయతీలను ఆన్‌లైన్ వేదిక ద్వారా సంప్రదించామని, ప్రభుత్వాలు, డిపార్ట్‌మెంట్లు, విద్యావేత్తలు, సామాన్య ప్రజల అభిప్రాయాలు స్వీకరించామని పేర్కొన్నారు.

మూడేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు నిర్భంధ విద్య
నూతన విద్యా విధానంలో భాగంగా మూడేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు విద్యను కేంద్రం తప్పనిసరి చేసింది. విద్యార్థులపై కరికులమ్ భారం తగ్గించాలనేది నూతన విధానం ఉద్దేశమని స్పష్టం చేసింది. 2030 నాటికి అందరీకి విద్య అందించాలనేది తమ లక్ష్యమని పేర్కొంది. బహుభాషల బోధన దిశగా నూతన విద్యా విధానం ఉండనున్నట్టు తెలిపింది. ఇకపై ఆర్ట్స్, సైన్స్ కోర్సుల విద్యా బోధనలో పెద్దగా తేడాలు ఉండవని వెల్లడించింది. అలాగే ప్రస్తుతం ఉన్న విధానంలో కేంద్రం భారీ మార్పులు తీసుకువచ్చింది.

కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రస్తుతం ఉన్న 10+2(పదవ తరగతి, ఇంటర్) విధానాన్ని 5+3+3+4 మార్చారు. ఇందులో మూడేళ్ల ప్రీ స్కూలింగ్, అంగన్‌వాడితోపాటుగా 12 ఏళ్ల పాఠశాల విద్య ఉండనుంది. ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్ అమలు చేయనున్నారు. ఆరవ తరగతి నుంచే విద్యార్థులకు కోడింగ్, ప్రోగామింగ్ కరికులమ్ ప్రవేశపెట్టనున్నారు. ఆరవ తరగతి నుంచే ఒకేషనల్ కోర్సులను తీసుకురానున్నారు. విద్యార్థులపై పాఠ్యాంశాల భారం తగ్గించి కాన్సెప్ట్ నేర్పే ప్రయత్నం చేయనున్నారు.

మాతృభాషలో ప్రాథమిక విద్య
నూతన విద్యా విధానంలో భాగంగా పిల్లల సంరక్షణ, వారి విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. పిల్లలు ప్రాథమిక దశ నుంచే మాతృభాషతో పాటు వివిధ భాషలు నేర్చుకునే విధానం పొందుపరిచారు. ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించేలా ప్రోత్సహించాలని పేర్కొన్నట్లు హెచ్‌ఆర్‌డి మంత్రి తెలిపారు. సాధ్యమైనంత వరకు ఐదవ తరగతి వరకు విద్యను మాతృభాషలో తప్పనిసరిగా ప్రోత్సహించడంతో పాటు వీలైతే ఎనిమిదవ తరగతి వరకు మాతృభాషలో బోధన సాగించాలని పేర్కొన్నారు. విద్యార్థులు తమ సొంత భాషలో సులభంగా నేర్చుకు నాణ్యమైన పాఠ్యపుస్తకాలను మాతృభాషలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

డిగ్రీలో ఎగ్జిట్ ఆప్షన్
నూతన విద్యా విధానం ద్వారా డిగ్రీ విద్యలో కీలక మార్పులు తీసుకువచ్చారు. డిగ్రీలో ఎగ్జిట్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఎన్‌ఇపి వివరాలు వెల్లడిస్తూ ట్వీట్లు చేశారు. అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్‌ను ఏర్పాటు చేసి విద్యార్థులు సంవత్సరాల వారీగా పొందిన క్రెడిట్లను డిజిటల్ విధానంలో స్టోర్ చేస్తారు. డిగ్రీలో చేరిన తర్వాత ఎప్పుడైనా ఎగ్జిట్ అయి, మళ్లీ ఎప్పుడైనా తర్వాత కోర్సును పూర్తి చేసేలా అవకాశం కల్పించనున్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ సర్టిఫికెట్, రెండవ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులకు అడ్వాన్స్ డిప్లొమా సర్టిఫికెట్, మూడవ సంవత్సరం పూర్తి చేసిన వారికి బ్యాచ్‌లర్ డిగ్రీ సర్టిఫికెట్‌ను ఇవ్వనున్నారు.దాంతోపాటు డిగ్రీ నాలుగవ సంవత్సరం చదివిన విద్యార్థులకు బ్యాచ్‌లర్ డిగ్రీ విత్ రీసెర్చ్ అని సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. ఎం.ఫిల్ కోర్సును పూర్తిగా రద్దు చేశారు.

పరిశోధనల కోసం ఎన్‌ఆర్‌ఎఫ్ ఏర్పాటు
యూనివర్సిటీలు, పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్లలో పరిశోధనల కోసం పార్లమెంట్ చట్టం ద్వారా కేంద్ర నేషనల రీసెర్చ్ ఫౌండేషన్(ఎన్‌ఆర్‌ఎఫ్)ను ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోఖ్రియల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సైన్సెస్, టెక్నాలజి, సోషల్ సైన్సెస్, ఆర్ట్ అండ్ హ్యుమానిటీస్‌లో పరిశోధనలు ప్రోత్సహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే లింగ సమానత్వం పెంపొందించేందుకు జెండర్ ఇంక్లూజన్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళలు, ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు వారికి సమాన విద్యావకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యకు నాణ్యమైన ఉపాధ్యాయ శిక్షణ అవసరమని ఇంటిగ్రేటెడ్ బి.ఎడ్ డిగ్రీ కోర్సు విధానం అందుబాటులోకి రానుంది. అలాగే ఉపాధ్యాయ నియామకాలు పారదర్శక విధానంలో చేపట్టనున్నారు.

ఉన్నత విద్యా సంస్థల్లో ఎన్‌టిఎ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష
నూతన విద్యా విధానంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. అఫిలియేషన్ వ్యవస్థను వచ్చే 15 సంవత్సరాల నాటికి దశలవారీగా తొలగించడంతో పాటు మార్గదర్శకత్వం కోసం నేషనల్ మిషన్ ఆన్ మెంటరింగ్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. న్యాయ, వైద్య విద్య సహా ఉన్నత విద్య మొత్తానికి ఒకే నియంత్రణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

12వ తరగతి వరకు కెజిబివిలు
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 12వ తరగతి వరకు విద్యా బోధన చేయనున్నట్లు కేంద్ర వెల్లడించింది. ప్రధానమైన విషయాలకే పాఠ్యప్రణాళికలు పరిమితం చేయడంతో పాటు 6వ తరగతి నుంచి ఒకేషనల్ విద్యను అందుబాటులోకి తీసుకురానున్నారు. పాఠశాలలు, టీచర్లు, విద్యార్థులను డిజిటల్ మాధ్యమాలకు సిద్ధం చేయాలని నిర్ణయించారు. నూతన విద్యా విధానంలో 5+3+3+4ను అమలు చేయనున్నారు.

ఈ విధానంలో మొదటి ఐదేళ్లను ఫౌండేషన్ కోర్సుగా, ఆ తర్వాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్, గ్రేడ్1, గ్రేడ్ 2గా పరిగణించనున్నారు. ఐదేళ్ల ఫౌండేషన్ కోర్సులో మొదటి మూడు సంవత్సరాలు 3 నుంచి 6 ఏళ్ల వయసు వారికి, తర్వాత రెండేళ్లు 6 నుంచి 8 ఏళ్ల వయసు వారికి ఒకటి, రెండు తరగతుల విద్యను అందించనున్నారు. తర్వాత 8 ఏళ్ల నుంచి 11 ఏళ్ల వయసు వారికి 9 నుంచి 12 తరగతులు నిర్వహించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టు కార్డులు మార్కుల ఆధారంగా కాకుండా నైపుణ్యాలు, సామర్థాల నివేదికగా ఉండాలని పేర్కొన్నారు.

సాంకేతిక విద్యకు పెద్దపీట

నూతన విద్యా వ్యవస్థలో కేంద్రం సాంకేతికతకు పెద్ద పీట వేసింది. ప్రాంతీయ భాషల్లో ఈ- కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. డిప్లొమా కోర్సు రెండేళ్లు, వృత్తి విద్యా కోర్సు వ్యవధి ఏడాదిగా నిర్ణయించారు. జాతీయ విద్యా సాంకేతిక ఫోరంను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. విద్య ప్రణాళిక- బోధన, అభ్యాసం, పరీక్షలు(అసెస్‌మెంట్)- పరిపాలనా నిర్వహణలో సాంకేతికత జోడించడం, నియంత్రణ సంబంధిత అంశాల్లో మానవ జోక్యాన్ని తగ్గించడం, వెనకబడిన సమూహాలకు సాంకేతిక అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. జాతీయ విద్యా సాంకేతిక ఫోరం(ఎన్‌ఇటిఎఫ్) ఏర్పాటు చేసి ప్రాంతీయ భాషల్లో ఈ-కంటెంట్, వర్చువల్ ల్యాబ్‌ల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

Central Govt bring New Education Policy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News