Friday, May 3, 2024

ఎంపి ల్యాడ్ ఫండ్స్ పునరుద్ధరణ

- Advertisement -
- Advertisement -
Union Cabinet decides to restore MPLAD Scheme
కేంద్ర మంత్రి మండలి నిర్ణయం

న్యూఢిల్లీ : కొవిడ్ నేపథ్యంలో నిలిచిపోయిన ఎంపి ల్యాడ్ ఫండ్స్ పథకాన్ని కేంద్రం పునరుద్ధరించింది. సంబంధిత అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఆమోదముద్ర లభించింది. స్థానిక ప్రాంతాల అభివృద్ధిపనులకు ఎంపిలు నిధులు మంజూరు చేసే పథకం తిరిగి అమలులోకి వస్తుందనే విషయాన్ని మంత్రిమండలి భేటీ తరువాత సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు. 202122 ఆర్థిక సంవత్సరం మిగిలిన భాగానికి ఈ స్కీం పునరుద్ధరణ అయిందని, ఇది 202526 వరకూ కొనసాగుతుందని వివరించారు. ప్రతి ఎంపికి రెండు కోట్ల రూపాయల చొప్పున మిగిలిన కాలానికి ఒకే వాయిదాగా మంజూరు చేస్తారు.

కరోనా కష్టకాలంలో ఆర్థిక స్థితిపై పడ్డ ప్రభావం చివరికి ఎంపి ల్యాడ్స్‌పై కూడా పడింది. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో ఈ స్కీం పునరుద్ధరణ జరిగింది. ఇక 202223 నుంచి 202526 వరకూ ఎంపిలకు ప్రతి ఏటా రూ 5 కోట్లను రెండు వాయిదాలలో అంటే రెండున్నర కోట్ల చొప్పున చెల్లిస్తారు. ఇక గత ఏడాది ఎప్రిల్‌లో నిలిపివేసిన ఎంపిల్యాడ్ ఫండ్స్ సంబంధిత సొమ్మును దేశంలో ఆరోగ్య సేవలు, కొవిడ్‌తో తలెత్తిన పరిస్థితుల నిర్వహణకు వినియోగిస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. ల్యాడ్ ఫండ్స్ స్కీం పరిధిలో ఎంపిలు తమ నియోజకవర్గాల పరిధిలో ప్రతి ఏటా రూ 5 కోట్ల విలువైన పనులకు సిఫార్సు చేసే అధికారం ఉంది.

పత్తి సేకరణకు రూ 17,409 కోట్లు

పత్తి సేకరణకు సంబంధించి ప్రకటిత ధరకు మద్దతు పరిధిలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సిసిఐ)కు కేంద్రం రూ 17,408.85 కోట్లు చెల్లిస్తుంది. సంబంధిత అంశానికి బుధవారం జరిగిన కేంద్ర మండలి భేటీలో ఆమోదం తెలిపారు. 201415 నుంచి 202021 వరకూ ఏడు పత్తి పంట కాలాలకు సంబంధించి ఈ మొత్తాన్ని లెక్కకట్టి కార్పొరేషన్‌కు చెల్లిస్తారు. ఈ దశలో పత్తి సాగు దశలో సిసిఐ సంబంధిత కనీస మద్ధతు ధరలతో తలెత్తిన నష్టాల భర్తీ వ్యయాన్ని సమకూర్చడానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడటమే కీలక అంశం అని, ఈ దిశలో ఇంతకాలం సిసిఐ రైతుల నుంచి భారీ స్థాయిలో పత్తి కొనుగోళ్లు చేసిందని , దీనిని పరిగణనలోకి తీసుకున్నామని ఈ మేరకు సిసిఐకి నిధుల చెల్లింపుపై ఆమోదం తెలిపారని మంత్రి తెలిపారు.

జవుళి సంచులలోనే ఆహారధాన్యాలు
ప్యాక్ కోటాల ఖరారు

దేశంలో పర్యావరణ పరిరక్షణ, దేశీయ జవుళి పరిశ్రమ ప్రోత్సాహానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 202122 జ్యూట్ ఇయర్‌కు సంబంధించి జ్యూట్ ప్యాకేజింగ్ మెటిరియల్ వాడకపు కోటాను ఖరారు చేసింది. దీని పరిధిలో ఈ జ్యూట్ ఇయర్‌లో వందశాతం ఆహారధాన్యాలను, 20 శాతం వరకూ చక్కెరను కేవలం జనపనార సంబంధిత బ్యాగులలోనే సమకూరుస్తారు. ఈ నిర్ణయంతో జవుళి సంచుల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ విధంగా 3,70,000 మంది జవుళి కార్మికులకు, అనుబంధంగా పనిచేసే వారికి ప్రయోజనం కల్గుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News