Sunday, April 28, 2024

తెలంగాణ, ఎపి హైకోర్టుల్లో న్యాయమూర్తుల బదిలీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో పని చేస్తున్న 16 మంది న్యాయమూర్తుల బదిలీలకు సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. బదిలీ అయిన వారిలో తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్ మున్నూరి లక్ష్మణ్, జస్టిస్ అనుపమా చక్రవర్తిలను బదిలీ చేశారు. జస్టిస్ మున్నూరి లక్ష్మణ్ రాజస్థాన్ హైకోర్టుకు, జస్టిస్ అనుపమా చక్రవర్తికి పట్నా హైకోర్టుకు బదిలీ చేశారు. ఎపి హైకోర్టు నుంచి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ దుప్పల వెంకట రమణ ఉన్నారు. వీరిలో జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గుజరాత్ హైకోర్టుకు,

జస్టిస్ దుప్పల వెంకట రమణను మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ బదిలీలను సుప్రీంకోర్టు కొలీజియం గత ఆగస్టులోనే కేంద్రానికి సిఫారసు చేసింది. వాటిని ఇప్పుడు ఆమోదించింది. నిజానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 6గురు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇందులో తెలంగాణ హైకోర్టుకు చెందిన నలుగురు, ఎపి హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా 8 హైకోర్టుల నుంచి 23 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు సిజెతో కూడిన కొలీజియం నిర్ణయించింది. కేంద్రానికి ఆ సిఫార్సులను పంపింది.

గత ఆగస్టులో తెలంగాణ హైకోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తులను ఇతర హైకోర్టులకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్ ఎం.సుధీర్‌కుమార్‌ను మద్రాస్, జస్టిస్ మున్నూరి లక్ష్మణ్‌ను రాజస్థాన్, జస్టిస్ సి.సుమలతను కర్ణాటక, జస్టిస్ అనుపమా చక్రవర్తిని పట్నా హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించామని వెల్లడించింది. కాగా, జస్టిస్ సుధీర్ కుమార్‌ను కోల్‌కతా హైకోర్టుకు పంపాలని భావించామని, ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లేదా మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారని తెలిపింది. మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించామని స్పష్టం చేసింది. జస్టిస్ సుమలత ఎపి లేదా కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారని, దానిని పరిశీలించి గుజరాత్ హైకోర్టుకు బదులు కర్ణాటకకు బదిలీ చేయాలని నిర్ణయించామని వెల్లడించింది.

బదిలీని వాయిదా వేయాలని లేదా విరమించుకోవాలని లేదా కర్ణాటక హైకోర్టుకు పంపాలని జస్టిస్ మున్నూరి లక్షణ్ కోరారని, కానీ రాజస్థాన్ హైకోర్టుకే బదిలీ చేయాలని మరోసారి స్పష్టం చేస్తున్నామని పేర్కొంది. ఎపి హైకోర్టు జస్టిస్ సి.మానవేంద్ర రాయ్‌ను గుజరాత్‌కు, జస్టిస్ దుప్పల వెంకటరమణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. జస్టిస్ మానవేంద్రరాయ్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ కోరినా అందులో మెరిట్ లేదని భావించి గుజరాత్‌కు పంపాలన్న నిర్ణయాన్ని పునరుద్ఘాటిస్తున్నామని స్పష్టపర్చింది. జస్టిస్ దుప్పల వెంకటరమణ కర్ణాటక హైకోర్టుకు బదిలీకి విజ్ఞప్తి చేశారని, కానీ, ఆయన వినతిలో మెరిట్ లేదని భావించి మధ్యప్రదేశ్‌కు కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఎపి హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించిన జస్టిస్ జి నరేందర్ కర్ణాటక హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి.

సీనియార్టీ పరంగా రెండో స్థానంలో ఉన్నారు. 1989 ఆగస్టు 23న తమిళనాడు బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1989 నుంచి 1992 వరకు మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేసారు. 2015 జనవరి 2న కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2017 డిసెంబర్ 30న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. కొలీజియం తొలుత ఈయన్ను ఒడిశా హైకోర్టు బదిలీ చేయాలని ప్రతిపాదించినా, ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని తీర్మానించింది. కేంద్రం ఆమోదించడంతో బదిలీలు అమల్లోకి వచ్చినట్లయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News