Friday, May 3, 2024

యుపి ఎన్నికలు లేకుంటే సాగు చట్టాల రద్దు జరిగేది కాదు

- Advertisement -
- Advertisement -

Centre wouldn’t repealed farm laws if no polls in UP: Pawar

బిజెపికి ఓటమి భయం పట్టుకుంది
అందుకే సాగు చట్టాల రద్దు నిర్ణయం
మహారాష్ట్రలో పూర్తికాలం అధికారంలో ఉంటాం
ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ వ్యాఖ్యలు

పుణె: ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్‌తోపాటు ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు మరి కొన్ని నెలల్లో లేనట్లయితే మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఉండేది కాదని ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని సతారా జిల్లా మహాబలేశ్వర్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి(ఎంవిఎ) ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కూటమి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన గురించి విలేకరులు ప్రస్తావించగా ఉత్తర్ ప్రదేశ్, మరి కొన్ని రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ ప్రకటన చేశారని పవార్ వ్యాఖ్యానించారు.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో అధికారంలో ఉన్న వారు ఇటీవల కొన్ని గ్రామాలను సందర్శించినపుడు స్థానికుల నుంచి ఎదురైన స్పందనను చూసి కంగుతిన్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రేపు ఓట్ల కోసం ప్రజల ముందుకు వెళ్లినపుడు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయంతోనే వారు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రాలలో సమీప భవిష్యత్తులో ఎన్నికలు ఉండని పక్షంలో ఈ నిర్ణయం తీసుకుని ఉండేవారు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు ఉంటుందంటూ మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రశ్నించగా రెండేళ్ల క్రితం తమ కూటమి ప్రభుత్వం ఏర్పడినపుడు 15 రోజుల్లో ఇది కూలిపోతుందని ప్రతిపక్ష బిజెపి చెప్పిన జోస్యాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత నెల రోజులు, రెండు నెలలు, మూడు నెలలు అంటూ జోస్యం చెప్పుకుంటూ పోయారని, పాటిల్‌కు చేతి నిండా ఖాళీ సమయం ఉంది కాబట్టి జ్యోతిషంపై కసరత్తు చేస్తున్నట్లు కనపడుతోందని, అందుకే ఆయన జాతకం చెబుతూ టైంపాస్ చేస్తున్నారని పవార్ ఎద్దేవా చేశారు.

మహారాష్ట్రలో కేంద్ర దర్యాప్తు సంస్థలు చేపడుతున్న చర్యల గురించి ప్రశ్నించగా ఇదేమీ కొత్త విషయం కాదని పవార్ వ్యాఖ్యానించారు. ఇటీవల తాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలసినపుడు తన ప్రభుత్వంలోని ఆరేడు మంది మంత్రులను కేంద్ర దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నట్లు ఆమె తనకు చెప్పారని, మరి కొన్ని రోజుల్లో ఆమెతో తాను ముంబైలో సమావేశం కానున్నానని ఆయన తెలిపారు. బిజెపియేతర రాష్ట్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా వేధించాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కంకణం కట్టుకుందని, మహారాష్ట్రలో కూడా ఇదే కనపడుతోందని పవార్ అన్నారు. ఎన్ని దర్యాప్తులనైనా వారిని చేసుకోనివ్వండి.. ఏమీ జరిగేది లేదు..అధికారంలో ఉన్న వారి అధికార దుర్వినియోగానికి ఇదే చక్కని ఉదాహరణ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో తన ప్రాణానికి ముప్పు ఉందంటూ తన న్యాయవాది ద్వారా ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ గురించి ప్రశ్నించగా ఈ వార్త చదివి తాను కూడా దిగ్భ్రాంతి చెందానని పవార్ అన్నారు. మహారాష్ట్ర పోలీసు శాఖలో అనేక కీలక పదవులు నిర్వహించిన వ్యక్తే తన సహచర పోలీసుల పట్ల అంత భయపడితే ఏమి చెబుతామని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News