Saturday, May 4, 2024

ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబును కలిసిన దుబాయ్ కేర్స్ సిఇవో

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును దుబాయ్ కేర్స్ సంస్థ సిఇవో, వైస్ చైర్మన్ తారిఖ్ అల్ గర్గ్ సోమవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా భారత విద్యా రంగానికి సంబంధించి కీలక చర్చలు జరిపారు. ప్రపంచ విద్యా వ్యవస్థ పురోగమనానికి తాము చేపడుతున్న చర్యల గురించి తారిఖ్ గర్గ్ రాష్ట్ర మంత్రికి వివరించారు. ఆయా దేశాల్లో విద్యాభివృద్ధి కోసం తమ సంస్థ సహాయ సహకారాలు అందిస్తోందని, వివిధ దేశాల ప్రభుత్వాలతో భాగస్వామ్య మై పనిచేస్తున్నామన్నారు.

మొదటి దశలో భాగంగా భారత్ తో సహా 10 దేశాల్లో విద్యా రంగం వేగవంతంగా పురోగమించడం కోసం గ్లోబల్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ యాక్సిలరేటర్ (జీఈఎస్‌ఈ)ను మొదలుపెట్టామని తారిఖ్ గర్గ్ వివరించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి సాధికారత కల్పించడం తమ లక్ష్యంగా పేర్కొన్నారు. అదే విధంగా కాప్28 క్లైమెట్ ఎజెండాలో విద్యా ప్రాముఖ్యతను కేంద్ర స్థానంలో చేర్పించామని, క్లైమెట్ (వాతావరణం )విద్యా రంగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…. విద్యా రంగం మార్పుల కోసం పనిచేస్తున్న దుబాయ్ కేర్స్ సంస్థ సీఈఓను కలుసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతల గురించి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తే ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News