Friday, July 19, 2024

అసంఖ్యాక ఆశావహులు

- Advertisement -
- Advertisement -

CM-KCR

ఆచితూచి బి ఫారాలివ్వండి

ఆరేళ్ల టిఆర్‌ఎస్ పాలన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది
అందుకే మున్సిపోల్స్‌లో పార్టీ అభ్యర్థిత్వాల కోసం ఈ డిమాండ్

 ప్రతిపక్షాలు మన దరిదాపుల్లో లేవు
గెలిచే సత్తా గలవారు చాలా మంది ఉంటారు
అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి
లోపాలను క్షమించే ప్రసక్తి లేదు, బాధ్యత ఎంఎల్‌ఎలదే : తెలంగాణ భవన్‌లో పార్టీ ఎ,బి ఫారాలను అందజేస్తూ కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు తిరుగులేదని విపక్షాలు దరిదాపుల్లో లేవని టిఆర్‌ఎస్ అధినేత, రాష్ట్రముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు ఎక్కడికక్కడ సమన్వయం చేస్తూ బి ఫారాలు ఇవ్వాలని ఆదేశించారు. సమన్వయలోపం ఉంటే పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని ఆయన హెచ్చరించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇన్‌ఛార్జీలు బాధ్యతాయుతంగా వ్యవహరించి పోటీఅధికంగా ఉన్న ప్రాంతాల్లో సర్దుబాటు చేయాలని చెప్పారు. ప్రజల సేవలో నిమగ్నమై,పార్టీలో నిరంతరం శ్రమిస్తున్న గెలిచే గుర్రాలను పోటీలో నిలిపి అపూర్వ విజయం సాధించాలని ఆయన నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు.

గత ఆరుసంవత్సరాలనుంచి రాష్ట్రాభివృద్ధికోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుండటంతో ప్రజల్లో చెక్కు చెదరని అభిమానం ఉంది,దానితో పార్టీ అభ్యర్థిత్వం కోసం డిమాండ్ విశేషంగా పెరిగిందన్నారు. ఆపోటీ బాగా పెరిగినందున అభిమానంతో ఎంతో మంది అభ్యర్థులు పార్టీ నుంచి పోటీ చేస్తే సంపూర్ణ విజయం సాధిస్తామనే ఆలోచనలు ఉండటం సహజమని చెప్పారు. అయితే అందులో గెలిచేవారు ఉన్నప్పటికీ నిబంధనలు,రిజర్వేషన్లు, సీనియార్టీ, గత రాజకీయ చరిత్ర, స్థానికంగా ఉన్న బలాన్ని అంచనావేసి అభ్యర్థులను పార్టీ ఎంపిక చేసిందనే విషయాన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు ఎక్కడికక్కడ వివరించాలని సిఎం కెసిఆర్ సూచించారు.

ఎక్కడ రెబల్స్ లేకుండా సహనంతో వ్యవహరించాలని చెప్పారు. భవిష్యత్‌లో పార్టీ పరంగా ఏర్పడే అవకాశాలను సన్నాహక సమావేశాల్లో వెల్లడించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. గురువారం టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మున్సిపాలిటీ, కార్పొరేషన్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ ఇచ్చే బిఫారాల గురుంచి ఆయన వివరించారు. బి ఫారాలతో ఎ ఫారాలను కొంతమంది నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలకు సిఎం అందించారు. మిగతావారు టిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యుడు ఎం.శ్రీనివాస్ రెడ్డి నుంచి ఎంఎల్‌ఎలు, ఇన్‌ఛార్జీలు తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు దాదాపు కొలిక్కి వచ్చిందని చెప్పారు.

అయితే అత్యధికంగా పోటీ ఉన్న స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో సున్నితంగా వ్యవహరించాలని నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలను ఆదేశించారు. శుక్రవారం సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ ఆదేశాల మేరకు అభ్యర్థులను ప్రకటించాలని చెప్పారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థికి స్థానిక శాసన సభ్యుడు లేదా నియోజక వర్గం ఇన్‌ఛార్జీ బి ఫారం అందించాలని తెలిపారు. టిక్కెట్ ఆశించినవారితోను, టిక్కెట్ పొందిన అభ్యర్థితోను, స్థానిక నాయకులతోను ఇన్‌ఛార్జీలు సమన్వయం చేసుకుని ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార సామగ్రిని సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఎన్నికలప్రచారంలో పండుగకూడా వస్తున్న నేపథ్యంలో అందుకు అనుకూలంగా ప్రచార ప్రణాళికలను రూపొందించుకోవాలని కెసిఆర్ సూచించారు.

ఓటర్ల జాబితాల్లో పేర్లు ఉన్నవారు ఇతరప్రాంతాల్లో బతుకు దెరువుకోసం వెళ్లిన, ఇతరపనుల ద్వారా వెళ్లిన వారిని స్వచ్ఛందంగా పోలింగ్ తేదీనాటికి వచ్చేవిధంగా స్థానిక నాయకులు కృషిచేయాలని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో సామాజిక మాధ్యమాలు వినియోగం అధికంగా ఉన్న నేపథ్యంలో వాటిపైకూడా దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు.

అభివృద్ధి సంక్షేమకార్యక్రమాలే పార్టీ ఎజెండా

ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్ శ్రేణులు దూసుకుపోవాలని టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఆరు సంవత్సరాల్లో దేశానికి ఆదర్శంగా ముందుకు వెళ్లుతుందన్నారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమంకోసం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాము, కోటీ 25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే లక్షంలో భాగంగా కాళేశ్వరం నిర్మించాము. మహిళ,శిశు సంక్షేమంకోసం గర్భస్థ శిశువు నుంచి సంక్షేమ పథకాలను అమలు చేసున్నట్లు తెలిపారు. ఆసరా పెన్షన్, ఒంటరి మహిళలకు పెన్షన్, కెసిఆర్ కిట్ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. టిఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధి, చేయనున్న అభివృద్ధిని ఓటర్లకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేయాలన్నారు. సమయపాలన పాటించాలని చెప్పారు. స్థానకంగా వార్డులు, డివిజన్ల వారిగా చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తే అత్యధిక మెజారిటీతో టిఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుస్తారనే ధీమా వ్యక్తం చేశారు.

బి,ఎ ఫారాల పంపిణీ

టిఆర్‌ఎస్ అభ్యర్థిగా గుర్తిస్తూ ఎన్నికల అధికారికి సమర్పించేది బి ఫారం. ఈ ఫారం ఎవరిపేరుతో ఉంటే వారికే ఎన్నికల సంఘం టిఆర్‌ఎస్ పార్టీ గుర్తును కేటాయిస్తుంది. ఎన్నికల్లో ఎంతో ప్రాధాన్యత ఉన్న బి ఫారాల వివరాలను తెలియచేస్తూ నియోజక వర్గాల ఇన్‌ఛార్జీలకు, శాసన సభ్యులకు సిఎ ం కెసిఆర్ బి ఫారాలు ఇచ్చారు. బి ఫారాలను పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులకు నియోజకవర్గాల వారిగా పోటీలో ఉన్న కార్పొరేటర్, వార్డు మెంబర్లకు వ్యక్తిగతంగా శాన సభ్యులు అందివ్వాలని ఆదేశించారు. స్థానిక సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులకు బిఫారాలు ఇవ్వాలని చెప్పారు. ఒక స్థానం నుంచి అనేక మంది టిఆర్‌ఎస్ నాయకులు పోటీచేసేందుకు నామినేషన్ వేసినప్పటికీ బి ఫాం ఎన్నికల సంఘానికి సమర్పించిన వారే పార్టీ అభ్యర్థి అనేఅంశాన్ని గుర్తించాలని చెప్పారు. బి ఫాం పొందిన అభ్యర్థి మినహా ఇతరులు నామినేషన్లు వేస్తే అవి ఉపసంహరించుకునే విధంగా స్థానికంగా నాయకులు వ్యవహరించాలని చెప్పారు.

నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలకు ఎ ఫారాలు

పార్టీ అభ్యర్థిగా గుర్తించి పూర్తి వివరాలతో ఇచ్చే ఎ ఫారాలు తొలుత అభ్యర్థులకు నేరుగా పార్టీ అధిష్టానం ఇవ్వాలని భావించినప్పటికీ సమయ సరిపోకపోవడంతో నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలకు, శానసభ్యులకు నేరుగా టిఆర్‌ఎస్ పార్టీ అధినేత సిఎం కెసిఆర్ సంతంకం చేసి అందించారు. ఎ ఫారాలతో ఇన్‌ఛార్జీలు తమపరిధిలో ఉన్న అభ్యర్థులకు బి ఫారాలు ఇచ్చే అధికారాలు సంక్రమించాయి. ఎ ఫారాలు శాసనసభ్యలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు జిల్లాకలెక్టర్ లేదా ఎన్నికల అధికారులకు సమర్పిస్తారు. బి ఫాం పై సంతకం చేసే అధికారాలను తమకు పార్టీ అప్పగించిందని వివరిస్తారు. ఎ ఫారాలను పొందిన శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలకు మున్సిపాలిటీ, కార్పొరేషన్‌కు పోటీలో నిలిచిన అభ్యర్థులకు పార్టీపరంగా బి ఫారాలు ఇస్తారు.

టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో వివరించాలి

మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో పోటీ చేసేందుకు ఆశించిన వారందరికి అవకాశాలు అందవు. పార్టీ అనేక నివేదికలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో టిక్కెట్టు ఎందుకు ఇవ్వలేకపోయామో ఆశావాహులకు నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు వివరించి చెప్పాలని ఈ సమావేశంలో సిఎం కెసిఆర్ చెప్పారు. స్థానిక ఎన్నికల్లో టిక్కెట్ ఆశించడం కార్యకర్తల హక్కని, వారు ఆందోళన చేయడంలో తప్పులేదన్నారు. అయితే పార్టీ నాయకులు వారికి సర్దిచెప్పి పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు. టిక్కెట్ ఆశించిన వారిపై కోపగించుకోవద్దు, కసురుకోవద్దు, సంయమనం పాటించాలన్నారు. పరిస్థితులను వివరిస్తూ భవిష్యత్‌లో పార్టీపరంగా ఎర్పడే పదవులను తెలపాలని చెప్పారు. మార్కెట్ కమిటీలు, దేవాలయ పదవులు, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులతో పాటు అనేకం ఉన్నాయని టిఆర్‌ఎస్ ఆశావాహులకు వివరించడంతో పాటు వారికి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నించాలని నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు.

ట్రెండ్ ద్వారా ఓటింగ్ జరగదు

ప్రస్తుతం జరగనున్న ఎన్నికలు స్థానికమైనవి కావడంతో ట్రెం డ్ ద్వారా ఓటింగ్ జరగదని నాయకులు గుర్తించాలని సిఎం కెసిఆర్ చెప్పారు. స్థానికంగా ప్రతి ఓటరును కలిసి ఓటు అగడంతో పాటు చేసిన అభివృద్ధి, చేయాల్సిన అభివృద్ధిని వివరించాలని తెలిపారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ప్రభుత్వ లబ్ధ్దిదారులను ఖచ్చితంగా కలుస్తూ ఎన్నికల ప్రచారం చేయాలని సూ చించారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే మరిన్ని సంక్షేమపథకాలను అమలుచేయవచ్చని ప్రజలకు హామీలు ఇవ్వాలని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లు తక్కువగా ఉంటాయి, ప్రతి ఓటు విలువైంది. కచ్చితంగా ప్రతి ఓటరును కలవాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.శుక్రవారం సాయంత్రం నామినేషన్‌కు చివరి గడువనే విషయాన్ని మర్చిపోవద్దని నొక్కి చెప్పారు.

పట్టణప్రగతిపై ప్రచారం

పల్లెప్రగతి కార్యక్రమాలు పల్లెల రూపురేఖలను మార్చుతున్నాయి. అద్భతమైన ఫలితాలు వస్తున్నాయి.గ్రామ పంచాయితీలకు నెలకు రూ. 339 కోట్లు ఇస్తున్నట్లు గానే ఎన్నికల అనంతరం పట్టణాల అభివృద్దికి కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వనుంది. పరిశుభ్రత, పచ్చదనంతో పట్టణాల రూపు రేఖలు మారనున్నాయన్నారు. ఇప్పటికే పట్టణాల్లోని నీటి సమస్య, కరెంటు సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వం పట్టణాభివృద్ధికోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు పూర్తికాగానే పట్టణాభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు సిఎం కెసిఆర్ చెప్పారు.

వెనక్కితగ్గని నేతలపై నివేదకలు

నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు చెప్పినా వినకుండా నామినేషన్లు దాఖలు చేసి ఉపసంహరించుకోని అభ్యర్థుల వివరాలను ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి పంపివ్వాలని టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ ఆదేశించారు. కార్యకర్తనుంచి నాయకులవరకు క్రమశిక్షణతో ఉండాలని చెప్పారు. తిరుగుబాటులను పార్టీ సహించదని హెచ్చరించారు. అవకాశాలురాని స్థానిక నాయకులకు భవిష్యత్‌లో అవకాశాలు కల్పిస్తామని చెప్పినప్పటికీ టిఆర్‌ఎస్ అభ్యర్థిపై మరో టిఆర్‌నాయకుడు పోటీలో నిలిస్తే పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. అవకాశాలను ఉపయోగించుకుని అధిక మెజారిటీతో అభ్యర్థులు విజయం సాధించేవిధంగా నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు వ్యవహరించాలన్నారు. ఎన్నికలు అయ్యేంతవరకు నియోజకవర్గాల్లోనే స్థానిక నాయకులు, పార్టీ ఇన్‌ఛార్జీలు ఉండాలని చెప్పారు.

ఆలస్యంగా వచ్చిన మంత్రులుపై ఆగ్రహం

టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం అత్యవసర సమావేశం ఉంది. ఉదయం 10 గంటలవరకు పార్టీ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆలస్యంగా వచ్చిన మంత్రులపై సిఎం కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులతో పాటు కొందరు శాసనసభ్యులు కూడా ఆలస్యంగా రావడంతో కెసిఆర్ మందలించారు. ముందురోజు రాత్రి సమాచారం అందించినప్పటికీ ఆలస్యంగా ఎందుకు వచ్చారని ఆయన ప్రశ్నించారు. స్థానిక సమావేశాలను ముగించుకుని వచ్చేసరి ఆలస్యం అయిందని మంత్రులు వివరణ ఇచ్చిన సిఎం కెసిఆర్ సంతృప్తి చెందలేదు. ఆలస్యంగా వచ్చిన మంత్రుల్లో ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి ఉన్నారు. ఎన్నికల వేళ సమావేశాలకు ఆలస్యంగా వస్తే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని సిఎం మందలించారు. ఇకనుంచైనా క్రమశిక్షణతో సమయానికి సమావేశాలకు రావాలని చెప్పారు.

CM KCR distributed B Forms At Telangana Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News