Sunday, April 28, 2024

ఆకలి కేకలు వినిపించొద్దు

- Advertisement -
- Advertisement -

cm-kcr

 

లాక్‌డౌన్‌తో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దు

హైదరాబాద్‌లోనే అధికంగా కరోనా ప్రబలుతోంది
కంటైన్మెంట్ నిర్వహణ కఠినంగా జరగాలి
ఎక్కడికక్కడ వ్యూహాల అమలు, అనుమానితులను గుర్తించి ఎంతమందికైనా పరీక్షలు నిర్వహించాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించాలి
ప్రగతిభవన్ సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్

లాకా..బ్రేకా?

కేంద్రం సడలింపులను రాష్ట్రంలో అమలు చేద్దామా.. వద్దా? అన్న దానిపై కీలక నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర మంత్రివర్గం
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో
నేడు జరగబోయే కేబినెట్ భేటీకి ప్రాధాన్యత

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అమలు చేస్తున్న పద్ధతులను యథావిధిగా అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. లాక్ డౌన్ వల్ల ఏ ఒక్కరు ఆకలితో అలమటించే పరిస్థితి రాకుండా చూడాలన్నారు. వైరస్ వ్యాప్తి నివారణ, రోగులకు అందుతున్న చికిత్స, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ప్రగతి భవన్‌లో శనివారం సిఎం సమీక్ష నిర్వహించారు. ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలను చర్చించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు శాంత కుమారి, నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, కాళోజి హెల్త్ యూనివర్సిటీ విసి కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి జరగుతూనే ఉందన్నారు.

ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా మరింత అప్రమత్తంగా ఉండాన్నారు. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. కరోనా వైరస్ కేసుల్లో హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నందున అక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. కంటైన్మెంట్ల నిర్వహణ బాగా జరగాలని సిఎం ఆదేశించారు. ఆ ప్రాంతాల్లో ఎవరినీ ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానీయవద్దు అని అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారు నివసిస్తున్న ఇతర ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఎక్కడికక్కడ వ్యూహం రూపొందిచుకోవాలన్నారు. వైరస్ సోకిన వారి ద్వారా ఇంకా ఎవరికి సోకవచ్చు అనే విషయాలను ఖచ్చితంగా నిర్థారించి పరీక్షలు జరపాలన్నారు. ఎంత మందికైనా పరీక్షలు జరపడానికి, ఎంత మందికైనా చికిత్స చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే లాక్‌డౌన్ వల్ల పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దన్నారు.

అందుకే ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు దారులకు నగదు, బియ్యం ఉచితంగా పంపిణీ చేసిందన్నారు. వలస కూలీలు, రోజు వారి కార్మికులు ఇంకా ఎవరైనా మిగిలినా సరే, వారిని గుర్తించి తగిన సహాయం అందించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. వ్యవసాయ కార్యక్రమాలు యథావిధిగా జరిగేట్లు చూడాలని ఆయన పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ సమయంలో ఎవరికి ఏ ఆపద, ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించే విధంగా ప్రభుత్వంలోని అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు.

నేడు మంత్రివర్గ సమావేశం
లాక్‌డౌన్‌ను యథావిథిగా కొనసాగించడమా? లేక కేంద్రం ఇచ్చిన విధంగా రాష్ట్రంలోనూ సడలింపులను ఇవ్వాలా? తదితర అంశాలపై ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో సిఎం కెసిఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రం 20వ తేదీ నుంచి కొన్ని రంగాలకు ఆంక్షలతో కూడిన సడలింపులు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రం కూడా సండలింపులను ఇవ్వాల్సి వస్తే…. కరోనాను కట్టడి చేసేందుకు ఈ మేరకు అవకాశం ఉంటుంది? దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న విషయాలపై మంత్రివర్గ సమావేశంలో విపులంగా చర్చిస్తారు. మరోవైపు రాష్ట్రంలో వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.

కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్షల సడలింపు ఇవ్వడం ప్రస్తుత తరుణంలో మంచిదేనా? కాదా? అన్న దానిపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. వైరస్ చాలా స్పీడ్‌గా ప్రబలుతుండడంతో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించి, ఆయా ప్రాంతాల్లో లాకౌడౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తోంది. కంటైన్మెంట్ ప్రాంతాల్లోని ప్రజలకు పెద్దఎత్తువ వైద్య పరీక్షలు చేస్తోంది. ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రాకుండా పెద్దఎత్తున పోలీసులు పహారాను కూడా ఏర్పాటు చేస్తోంది. అయినప్పటికీ పాజిటవ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో లాక్‌డౌన్‌పై కూలంకషంగా చర్చించి దానిని యథావిధిగా కొనసాగించడమా? లేక ఆంక్షలతో కొన్ని సడలింపులు ఇవ్వాలన్న అంశంపై సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

 

CM KCR review on Coronavirus
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News