Friday, March 29, 2024

ఎయిర్‌పోర్టుకు మెట్రో

- Advertisement -
- Advertisement -

డిసెంబర్ 9న శంకుస్థాపన మైండ్‌స్పేస్ నుంచి శంషాబాద్ వరకు..
రూ.6,250 కోట్ల వ్యయం.. 31కి.మీ మేర నిర్మాణం ప్రతి 5కి.మీలకు
ఒక స్టేషన్ మెట్రో రాకతో తగ్గనున్న ప్రయాణ సమయం

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. మెట్రోరైల్ ప్రాజెక్టు రెండో దశ పనులను నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రూ.6,250 కోట్ల నిధులతో చేపట్టాలని తలపెట్టింది. మెట్రోరైల్ మొదటి దశ పనులను పిపిపి మోడల్ తరహాలో చేపట్టిన ప్రభుత్వం.. రెండో దశ పనులను మాత్రం పూర్తిగా ప్రభుత్వం నిధులతోనే చేపట్టనుంది. కాగా రెండవ దశ పనులను మైండ్ స్పేస్ జంక్షన్‌ వద్ద గల మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు చేపట్టనుంది.

ఈ పనులను డిసెంబర్ 9న సిఎం కెసిఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనుంది. రెండో దశ మార్గం బయో డైవర్సిటీ జంక్షన్ కాజాగూడా రోడ్డు ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గల నానక్‌రామ్ గూడ జంక్షన్‌ను తాకుతూ వెలుతుంది. విమానాశ్రయం నుంచి ప్రత్యేక మార్గం ద్వారా మె ట్రో రైలు నడుస్తుంది. ఈ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. రెండో విస్తరణకు సంబంధించి ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్టుగా తెలిసింది. మొత్తం 31కిలో మీటర్ల పొడవుతో కూడిన ఈ మెట్రో మార్గం వెంట ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను నిర్మించుకుంటున్నాయి.

భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని
విశ్వ నగరంగా మారిన హైదరాబాద్ నగర భవిష్యత్తు రవాణా అవసరాలను తీర్చిదిద్దుతూ, నగరంలోని ఏ మూల నుంచైనా శంషాబాద్ విమానాశ్రయానికి అతి తక్కువ సమయంలో చేరుకునేలా మెట్రో ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేయడం జరిగింది. ప్రపంచంలోని ప్రముఖ మెట్రో నగరాలన్నింటిలోనూ కూడా ఎయిర్ పోర్టుకు మెట్రో రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్న సిఎం కెసిఆర్ దార్శనికత నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణలతో కూడిన ఈ మెట్రో ప్రాజెక్టుకి రూపకల్పన చేయడం జరిగింది.

ప్రపంచ స్థాయి పెట్టుబడులతో భారీగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో మెట్రోను విమానాశ్రయం వరకు అనుసంధానించడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. మెట్రో ప్రాజెక్ట్ వలన మరిన్ని పెట్టుబడులకు హైదరాబాద్ గమ్య స్థానం గా మారబోతున్నది. హైదరాబాద్ నగరంలో రోజు రోజుకూ పెరుగుతున్న రద్దీని తట్టుకునే ఉద్దేశంతో ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇప్పటికే సిఎం దిశా నిర్దేశంతో, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ కృషితో పెద్ద ఎత్తున రవాణా మౌలిక వసతులను కల్పిస్తున్నది. అనేక ప్రాజెక్టులను, ఫ్లై ఓవర్లను, లింక్ రోడ్లను, ఇతర రహదారి వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోంది.

ఈ మెట్రో నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే మైండ్‌స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు కేవలం 25 నిమిషాల్లో విమానాశ్రయానికి చేరుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అయితే దీంతోపాటు బిహెచ్‌ఈఎల్ నుంచి లక్డీకాపూల్ 26 కిలోమీటర్లతో పాటు నాగోల్ నుంచి ఎల్‌బినగర్ వరకు 5 కి.మీ.ల మేర పెండింగ్‌లో ఉన్న మెట్రో విస్తరణకు కేంద్రం నుంచి సాయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి గాను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్‌లను సమర్పించింది.

రోడ్డు మార్గంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లాలంటే 50 నిమిషాలు
ప్రస్తుతం హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న మెట్రో కారిడార్ల నుంచి విమానాశ్రయానికి కనెక్టివిటీ లేదు. ప్రస్తుతం నగరంలో ఎల్బీనగర్ టు -మియాపూర్, జేబిఎస్, -ఎంజీబిఎస్, నాగోల్- టు రాయదుర్గం రూట్లలో 69.1 కి.మీ మేర మెట్రో రైలు సదుపాయం ఉంది. ఈ నేపథ్యంలో రాయదుర్గం నుంచి రోడ్డు మార్గంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లాలంటే సుమారు 50 నిమిషాల సమయం పడుతోంది. అందులో భాగంగా ఐటి ఉద్యోగులతో పాటు ఎయిర్‌పోర్టు వెళ్లే వారికి రెండోవిడత మెట్రో రైలు మార్గం కనెక్టివిటీగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

5 కి.మీలకు ఒక స్టేషన్..
విమానాశ్రయ మార్గంలో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఓ మెట్రో స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిసింది. ఈ స్టేషన్లకు అనుసంధానంగా రవాణా ఆధారిత ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేషన్‌ల ఏర్పాటులో భాగంగా ఫిల్లర్ల ఏర్పాటుకు వీలుగా ఇప్పటికే మట్టి నాణ్యత పరీక్షలు చేసినట్టుగా తెలిసింది. మొత్తం 31 కి.మీల పరిధిలో ఏడు లేదా ఎనిమిది స్టేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఈ మెట్రో బయో డైవర్శిటీ జంక్షన్ ఖాజాగూడ రోడ్డు ద్వారా ఔటర్‌రింగ్‌రోడ్డు వద్ద ఉన్న నానక్‌రాంగూడ జంక్షన్‌ను ఆనుకొని నిర్మాణం జరుగనుంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో అంతర్జాతీయ సంస్థలను తమ కార్యాలయాలను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మెట్రో పూర్తయితే వాటి కార్యకలాపాలు మరింత సజావుగా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

మూడున్నరేళ్ల క్రితం ప్రతిపాదనలు
మెట్రోరైలు రెండో దశలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కి.మీ.ల మేర మెట్రోని తెలంగాణ ప్రభుత్వం మూడున్నరేళ్ల క్రితం ప్రతిపాదించడంతో పాటు ఈ మార్గం అభివృద్ధి, నిర్మాణం, నిర్వహణ, కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ను సైతం ఏర్పాటు చేసింది.
ఏప్రిల్ వరకు రూ.3వేల కోట్ల నష్టం
కరోనాకు ముందు మెట్రో రైళ్లల్లో రోజుకు సగటున 4లక్షల మంది ప్రయాణించేవారు. కరోనా తరువాత రెండు సంవత్సరాలు మెట్రోకు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయి కేవలం 2.7లక్షల మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.3వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఈ సంవత్సరం ఏప్రిల్‌లో మెట్రోరైల్ ఎండి పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య పెరగడంతో మెట్రో రెండోదశ పనులను చేపట్టాలని మెట్రోతో పాటు ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.

CM KCR to lay foundation stone for Metro Phase-II

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News