Tuesday, May 21, 2024

జనంతో మమేకం

- Advertisement -
- Advertisement -

CM KCR visits districts from 19th

19 నుంచి సిఎం కెసిఆర్ జిల్లాల పర్యటన

17 మ.2గం.కు తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన పార్టీ ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, జడ్‌పి చైర్‌పర్సన్లు, డిసిఎంఎస్, డిసిసిబి అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల ప్రెసిడెంట్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గంతో కూడిన భారీ సమావేశం

18న ప్రగతిభవన్‌లో దళితబంధు తదితర అంశాలపై మంత్రులు, కలెక్టర్లతో సిఎం భేటీ

19న వనపర్తితో జిల్లాల పర్యటనకు శ్రీకారం

20న జనగామ జిల్లా పర్యటన

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ పార్టీ హయాంలో రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో, సంక్షేమ పథకాలతో ప్రజలతో మమేకం కావాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సమస్యలను ఆకళింపు చేసుకునే దిశగా ఆయన కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. అనధికారిక కార్యక్రమాలతో పాటుగా, పార్టీకి సంబంధించిన అంశాలపై సిఎం కెసిఆర్ తన పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. దీనికోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. పార్టీని పటిష్టంగా నిర్మించడం కోసం కెసిఆర్ జిల్లాల పర్యటన సాగనుంది. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.

ఇందులో భాగంగా ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన.. టిఆర్‌ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ, శాసనమండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిఎంఎస్ అధ్యక్షులు, డిసిసిబి అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో కూడిన సంయుక్త సమావేశం జరగనుంది. అదే విధంగా ఈ నెల 18న దళితబంధు, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్, సీనియర్ అధికారులు పాల్గొంటారు. ఈ సమావేశంలో దళితబంధు అమలుపై సమీక్షించనున్నారు. హుజూరాబాద్ సహా ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాలలో అమలులోకి వచ్చిన దళితబంధు పథకాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రకటించిన పద్ధతిలో మార్చిలోపు అమలు చేసే అంశంపై సిఎం కెసిఆర్ సమీక్షించనున్నారు.

19 నుంచి జిల్లాల పర్యటనకు సిఎం

ఇక 19వ తేదీనుంచి సిఎం కెసిఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. 19వ తేది(ఆదివారం)న వనపర్తి జిల్లాలో సిఎం కెసిఆర్ పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అదే విధంగా మెడికల్ కాలేజి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అదే విధంగా 20వ తేదీ(సోమవారం)న సిఎం కెసిఆర్ జనగామ జిల్లాలో పర్యటిస్తారు. జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వీటితో పాటు సిఎం కెసిఆర్ త్వరలోనే మరికొన్ని జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా అచ్చంపేట నియోజకవర్గం పర్యటన చేపడతారు. ఆ సందర్బంగా నియోజకవర్గ పరిథిలోని ఉమామహేశ్వర లిఫ్టు, రిజర్వాయర్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభిస్తారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే సందర్భంలో జిల్లాల పర్యటనలో భాగంగా ఆయా జిల్లాల టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలను ఆయన ప్రారంభిస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News