Friday, April 26, 2024

ధాన్యంపై కేంద్రంతో ఇక యుద్ధమే

- Advertisement -
- Advertisement -
CM KCR Warning to Bandi Sanjay and BJP Leaders
వారం రోజుల్లో సానుకూల నిర్ణయం ప్రకటించకపోతే ఢిల్లీలో ఉద్యమం
రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పింది
ఢిల్లీ బిజెపిది ఒక మాట, ఇక్కడి సిల్లీ బిజెపిది మరో మాట
అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా ఆడుకుంటూ ఉంటే కేంద్రం చోద్యం చూస్తోందా?
గెలుపోటములు సహజమే, ఉప ఎన్నికల్లో బిజెపి 30చోట్ల ఓడిపోయింది
నేనున్నంత కాలం దళితబంధు ఉంటుంది
సంజయ్ ఖబడ్దార్!
బిడ్డా…. కెసిఆర్‌ని జైలుకి పంపుతావా?..
టచ్ చేసి చూడు, బతికి బట్ట
కడుతావా?, అడ్డగోలుగా మాట్లాడితే
చీల్చి చెండాడుతా.. నాలుక చీరుస్తా
కేంద్రానికి చుక్కలు చూపిస్తా, నిద్ర
పోనివ్వను, ఓపికకూ ఓ హద్దుంటుంది,
మెడలు వంచడం కాదు, ముక్కలు చేస్తా
ఎక్కడ అగ్గిపెట్టాలో నాకు తెలుసు
సంజయ్‌కి నెత్తి లేదు.. కత్తి లేదు
కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి హోదాలో
హుందాగా మాట్లాడాలి

ధాన్యం సేకరణ, నిల్వ, ఎగుమతి కేంద్రం పరిధిలోనివే ఆహార కొరత రాకుండా చూసుకునే బాధ్యతను రాజ్యాంగం కేంద్రంపైనే పెట్టింది ఈ ఏడాది ఎంత ధాన్యం తీసుకుంటామనే దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు, ఎంత తీసుకుంటారో ఈరోజు వరకు చెప్పడం లేదు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది
పెట్రోల్‌పైనా దొంగ నాటకమే, యుపిఎ హయాంలో బ్యారల్ క్రూడాయిల్ 120 డాలర్లు ఉండేది.. ఇప్పుడు 80 డాలర్లుంది, కేంద్రం అడ్డగోలుగా ధరలు పెంచుతోంది
మేం వ్యాట్‌ను ఒక్కసారి కూడా పెంచలేదు
నాలుగు రాష్ట్రాల ఎన్నికలున్నాయని కంటితుడుపుగా పెట్రోల్ ధరలు తగ్గించారు
మతపరమైన భావోద్వేగాలను, అంతర్జాతీయ సరిహద్దుల విషయంలో ద్వేషాలను రెచ్చగొట్టడమే బిజెపి విధానం, సాగుచట్టాలు రద్దు చేయాల్సిందే, ఉత్తరాది రైతులకు నా మద్దతు
రైతులతో ఆడుకుంటే ఊరుకుంటానా?

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రం నుంచి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిని, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడి ధోరణిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగా దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లపై వారం రోజుల్లో సానుకూల నిర్ణయం తీసుకోకపోతే టిఆర్‌ఎస్ మంత్రులు, ఎంఎల్‌ఎలతో, వేలాది మందితో ఢిల్లీలో ఆందోళన చేపడుతామని కేంద్రాన్ని హెచ్చరించారు. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రప్రభుత్వ మోసపూరిత విధానాన్ని చెరిగి వదిలిపెట్టారు. యాసంగిలోనూ వరి పండించాలంటూ రాష్ట్రంలోని రైతులను తప్పుదోవ పట్టిస్తున్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఫైర్ అయ్యారు. ఇంతకాలం నెమ్మది వహించిన తాము ఇకముందు ఊరుకోబోమని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర బిజెపికి పట్టపగలే చుక్కలు చూపిస్తామని, కంటిమీద కునుకులేకుండా చేస్తామని తీవ్రస్వరంతో ప్రకటించారు. ఆదివారం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి సర్కార్‌పై ధ్వజమెత్తారు. అలాగే రాష్ట్రంలోని బిజెపి నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

తనదైన శైలిలో విమర్శనాస్త్రాలను సంధించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలన్న ఏకైక లక్షంతో ఏడేళ్లుగా కేంద్రానికి ఎంతో సహకరించామన్నారు. అయినా కేంద్రంలో మార్పురావడం లేదన్నారు. రాష్టంపై వివక్ష చూపుతూనే ఉందన్నారు. ఇకపై సహించేది లేదు…కేంద్రం తప్పులను ఊపేక్షించబోమన్నారు. వారి అసమర్థ పాలనపై ఇక ఉగ్రరూపం చూపిస్తామన్నారు. కేంద్రంలోని బిజెపి పెద్దలకు, రాష్ట్రంలోని ఆ పార్టీ సిల్లీ, గల్లీ గాళ్లకు ఇకపై తామంటే ఏమిటో రుచి చూపిస్తామన్నారు. దేశంలో ఎక్కడ అగ్గిపెట్టాలో తమకు తెలుసన్నారు. రాష్ట్రంలో పండించిన ధాన్యంపై వారం రోజుల్లో తగు నిర్ణయం రాకుంటే…. ఎలాంటి ఫలితాలను చవిచూడాల్సి వస్తుందన్నది కేంద్రం పెద్దలకు తెలిసివచ్చేలా చేస్తామని హెచ్చరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగకపోయినా కేంద్రం ఇష్టానుసారంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచుకుంటుపోయిందన్నారు.

పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై కేంద్రం విధించిన సెస్‌ను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. వీటిపై కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపంలో పన్నులను వసూలు చేసుకుంటూ రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయాన్ని కూడా కేంద్రం పూర్తిగా గండికొడుతోందని సిఎం కెసిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా వ్యాట్ పన్నును పెంచలేదన్నారు. అలాంటప్పుడు పెట్రోలియం ఉత్పత్తుల ధరలను ఎలా తగ్గిస్తామని సిఎం ప్రశ్నించారు. ధరలను పెంచింది కేంద్రమే…వాటిని తగ్గించాల్సింది కూడా కేంద్రం ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ధాన్యం ఎగుమతి చేయాలన్న- విత్తనాల మార్పు చేయాలన్నా కేంద్రంపైనే బాధ్యత ఉందన్నారు. దీనిపై కేంద్రం పూర్తిగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని తీవ్ర ఆసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను బతికి ఉన్నంత కాలం దళితబంధు పథకం రాష్ట్రమంతటా అమలు చేస్తామన్నారు.

ఏనుగు వెళ్తుంటే…కుక్కలు మొరుగుతాయ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, బండి సంజయ్ చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఘాటుగా స్పందించారు. ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరుగుంటాయని ఊరుకున్నానన్నారు. చాలా రోజులుగా బండి సంజయ్ అతిగా మాట్లాడుతున్నారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకోలేదన్నారు. ఆయనది తన స్థాయి కాదు కాబట్టే సహనంతో ఊరుకున్నానని అన్నారు. కానీ బండి తన స్థాయిని మరిచి అడ్డుపొడువునా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇకపై అలాగే మాట్లాడితే నాలుక చీరేస్తానని హెచ్చరించారు. ఆయనకు ఒక ఎంపిగా కొనసాగుతు కూడా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితమన్నారు. వరి కొనుగోళ్లపై కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం రాష్ట్రాల దగ్గర లేదన్నాన్నారు. కేంద్రం కావాలనే మెలికలు పెడుతోందన్నారు. ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకునే బాధ్యతను రాజ్యాంగం కేంద్రంపై పెట్టిందని.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందని సిఎం అన్నారు.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం రోజుకో మాట చెబుతోందని విమర్శించారు. ధాన్యం విదేశాలకు ఎగుమతి చేసే అధికారం రాష్ట్రాలకు లేదని.. ధాన్యం సేకరణ, నిల్వ, ఎగుమతి వంటి అంశాలు కేంద్రం పరిధిలో ఉన్నాయన్నారు. రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పిందన్నారు. అనవసరమైన రాజకీయాల కోసం రైతుల జీవితాలను పణంగా పెడుతుంటే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. కేంద్రం తీసుకొన్ని నూతన వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తుంటే… కేంద్రమంత్రులు కార్లు ఎక్కించి రైతులను చంపుతున్నారన్నారు. అలాగే బిజెపి పాలిత – రాష్ట్ర ముఖ్యమంత్రులు బాధ్యత లేకుండా లేకుండా మాట్లాడుతున్నారని సిఎం మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులను ఆగం చేయడానికే బండి సంజయ్ వరి పంటను వేయాలని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఒక గింజ కూడా కొనుగోలు చేయమని ఒకవైపు చెబుతుంటే బండి మాత్రం వరి పంటలను వేయాలని ఎలా చెబుతారన్నారు. కేంద్ర, రాష్ట్రంలో బిజెపి నాయకులంతా కలిసి రైతులను ఆగం చేసే పనులు చేస్తున్నారని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. కానీ కెసిఆర్ ఉన్నంత బతికున్నం కాలం వాటి ఆటలు సాగినివ్వనని అన్నారు. రైతులను ఆగం కానివ్వనని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని సాధించిన ఒక ఉద్యమకారుడిగా…వ్యవసాయన్ని ఎంతో అభివృద్ధి చేశానని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

అద్భుతమైన రీతిలో కేంద్రం అబద్ధం చెప్పింది

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం అద్భుతమైన పద్ధతిలో అబద్ధం చెప్పిందని సిఎం కెసిఆర్ విమర్శించారు. 2014లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధర 105 డాలర్లకు మించలేదన్నారు. ఓసారి చమురు ధరలు కుప్పకూలి 30 డాలర్లకు కూడా పడిపోయిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫలితంగా బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదన్నారు. రష్యాలోనూ అలాంటి పరిస్థితే వచ్చిందని సిఎం వివరించారు. కానీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయంగా ధర పెరిగిందని అబద్ధాలు చెప్పిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రాల వాటా ఎగ్గొట్టేందుకు ట్యాక్సులు పెంచకుండా, దాన్ని సెస్ రూపంలోకి మార్చారని వివరించారు. ఈ విధంగా లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొడుతున్నారన్నారు. దీనిపై ఎపి ముఖ్యమంత్రి ఏకంగా ఒక పత్రికా ప్రకటన ఇచ్చారని వెల్లడించారు. నాడు పెట్రోల్ ధర రూ.77 ఉంటే దానిని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రూ.114 చేశారన్నారు. డీజిల్ ధర రూ.68 ఉంటే దానిని రూ.107లకు పెంచారన్నారు.

ఈ పెరుగుదల మొత్తం కేంద్రమే తీసుకుంటోందన్నారు. సెస్ రూపంలో రాష్ట్రాల నోరుకొడుతున్నదన్నారు. ప్రజలకు అబద్ధాలు చెబుతూ, మోసం చేస్తూ పన్నుల భారం మోపుతున్నదన్నారు. దానికితోడు రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఎగ్గొడుతున్నారు. ఇప్పుడు పలు రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో కంటితుడుపు చర్య కింద ఎక్సైజ్ సుంకం ఓ పది రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఇదే ఓ ఘనకార్యం అన్నట్టు బిజెపి నాయకులు చెప్పుకుంటున్నారని కెసిఆర్ మండిపడ్డారు. పెంచింది కొండంత అయితే తగ్గించింది పిసరంత! అని సిఎం కెసిఆర్ వ్యాఖానించారు. చేయాల్సినంత మోసం చేసి, ఇప్పుడు రాష్ట్రాలు కూడా తగ్గించాలని చెబుతున్నారన్నారు. తగ్గించకపోతే ధర్నాలు చేస్తామని బిజెపి వాళ్లు అంటున్నారని…అసలు ఎవరు ధర్నాలు చేయాలి? మీరా? మేమా? అని సిఎం ప్రశ్నించారు. ఇప్పుడు మేం డిమాండ్ చేస్తున్నాం…. చమురు ధరలపై మొత్తం సెస్ ను కేంద్రం ఉపసంహరించుకోవాలన్నారు. ప్రజల మీద అంత ప్రేమే ఉంటే 2014 నాటి ధర రూ.77కే ఇవాళ కూడా ఇవ్వొచ్చు అని స్పష్టం చేశారు.

రాష్టంలో వ్యవసాయ స్థిరీకరణ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పడు రైతుల ఆత్మహత్యలు, వలసలతో రాష్ట్రం కకావికలమైన పరిస్థితి ఉండేదని సిఎం కెసిఆర్ అన్నారు. కానీ టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థిరమైన లక్ష్యంతో, నిర్ణయాత్మక పద్ధతిలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం బలమైన అడుగులు వేసిందన్నారు. ఆ ప్రక్రియలో మొదటి దశగా భూగర్భ జలాలను పెంచేందుకు మిషన్ కాకతీయలో భాగంగా చెరువులను అభివృద్ధి చేశామన్నారు. ఆ తర్వాత నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేశామన్నారు. ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.10వేలు ఇచ్చామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతులు చనిపోతే ఆ కుటుంబాలు రోడ్డున పడతాయని రూ.1,400 కోట్లు వెచ్చించి.. రైతు బీమా పథకం ద్వారా రైతుల ప్రీమియం కూడా చెల్లిస్తున్నామన్నారు. అప్పట్లో విత్తనాలు కూడా సక్రమంగా దొరికేవి కావన్నారు… కల్తీ విత్తనాలు అమ్మేవారని గుర్తు చేశారు.

కేంద్రంతో పోరాడి, ఒప్పంచి కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పిడి యాక్టు తెచ్చామన్నారు. ఎరువులను పోలీస్ స్టేషన్లలో పెట్టి అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎరువుల వినియోగం 3 రెట్లు పెరిగిందన్నారు. అయినా ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చేశామన్నారు. ఇలా అనేక చర్యలు చేపట్టామన్నారు. దీంతో అద్భుతమైన వ్యవసాయ స్థిరీకరణ జరిగిందని సిఎం కెసిఆర్ వివరించారు. కరోనా విపత్తు కాలంలో నెలల తరబడి రాష్ట్రంలో పండిన ధాన్యం సంపూర్ణంగా కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతోందన్నారు. బాయిల్ రైసు కొనుగోలు చేసేది లేదని కేంద్రం ఖరాఖండిగా చెప్పిందన్నారు. ఇవన్నీ తెలియకుండా బండి సంజయ్ అన్ని అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు బండి సంజయ్ చెప్పాలి…ఎవరి మెడలు వంచుతారో అని సిఎం వ్యాఖ్యానించారు. ధాన్యం కొనేది లేదని చెప్పిన కేంద్రం మెడలు వంచుతారా అని నిలదీశారు. బండి సంజయ్ తనను వ్యక్తిగతంగా దుషించినా ఇన్నాళ్లు క్షమించానన్నారు. ఇకపై మాత్రం అలా ఉండదని హెచ్చరించారు.

ధాన్యం కొనుగోలుపై రోజుకో మాట

రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పిందని సిఎం వెల్లడించారు. ఈ నేపథ్యంలో యాసంగిలో ఎలాంటి పంటలు వేయాలో శాస్త్రవేత్తలతో చర్చించి, అందుకు అనువైన విత్తనాలు కూడా తెప్పించామన్నారు. అయితే యాసంగి ధాన్యంలో తాలు, నూకలు ఎక్కువగా వస్తాయని, యాసంగి ధాన్యం నాణ్యంగా ఉండడంలేదని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) చెబుతోందన్నారు. యాసంగిలో రా రైస్ మాత్రమే కొంటామని, బాయిల్ రైస్ కొనలేమని చెబుతోందని వివరించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనేక అభ్యంతరాలు పెడుతోందని సిఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాయిల్ రైస్ కొనుగోలు చేసేది లేదని కేంద్రం ఖరాఖండిగా చెబుతోందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం రోజుకోమాట చెబుతోందని మండిపడ్డారు.

పంటల మార్పిడితోనే రైతులకు మేలు

ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు చెబుతున్నామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ప్రధానంగా వేరుశనగ, చిరుధాన్యాలతో మంచి లాభాలు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉంటే బండి సంజయ్ మాత్రం అత్యంత బాధ్యతా రాహిత్యంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మీరు వరి పంటనే వేయండి ప్రభుత్వం మెడలు వంచి పంటను కొనిపిస్తాం…అంటూ రైతులను బజారుకీడ్చే మాటలు చెబుతున్నాడన్నారు. ఆయన ఒక ఎంపిగా కొనసాగుతూ కూడా చాలా రోజులుగా రైతులను మోసం చేసే విధంగా ప్రకటనలు చేస్తుండడం సిగ్గుచేటన్నారు. ఏడేళ్లుగా మేం రైతుల కోసం చేస్తున్న కృషిని దెబ్బతీసేలా, రైతులను తప్పుదోవపట్టించేలా వ్యవహరిస్తుండడంతోనే తాను ఇప్పుడు స్పందించాల్సి వస్తోందన్నారు. రైతులు బండి చెప్పిన పనికి మాలిన మాటలు నమ్మి వరి పంట వేస్తే చాలా కష్టంమన్నారు. వరి కొనబోమని కేంద్రం తెగేసి చెబుతోందన్నారు. రైతులను కాపాడుకునే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. బండి సంజయ్ సొల్లు కబుర్లు నమ్మకండని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మరోమారు విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్‌కి నెత్తి లేదు… కత్తి లేదన్నారు.

బిజెపిది అసమర్థపాలన

కేంద్రంలోని బిజెపి సర్కార్ అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని సిఎం కెసిఆర్ ఆరోపించారు. ఎన్నికలు వచినప్పుడు దేశ సరిహద్దు గొడవులను, మత విద్వేషాలను రెచ్చగొచ్చడమే ఆ పార్టీ నేతలుకు తెలుసున్నారు. అంతే తప్ప దేశ ప్రజల భవిష్యత్ గురించి ఏడు సంవత్సరాల్లో ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. తెలంగాణ, ఎపి రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వాటాలపై సెక్షన్-3 కింద తేల్చమంటే ఇప్పటి వరకు కేంద్రం పరిష్కరించలేదని విమర్శించారు. నవోదయ పాఠశాలల చట్టం కింద రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వమంటే ఒక్కటి ఇవ్వలేదన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా 105 మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే అందులో ఒక్కటి కూడా రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే బిజెపి నాయకులు ఎక్కడ పడుకున్నారని ప్రశ్నించారు. కేంద్రం అడ్డం పొడవు ఎట్లా వీలైతే అట్లా మాట్లాడుతోందన్నారు.

దేశానికి చేసిన ఒక్క మంచి పని కూడా కేంద్రం చేసింది లేదన్నారు. కేవలం మతాలను రెచ్చగొట్టి- రాజకీయ ప్రయోజనాలను పొందడమే బిజెపికి తెలిసిన విద్య అని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కూడా కేంద్రం ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. బయ్యారంఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోజ్ ఫ్యాక్టరీకి కేంద్రం నో అన్నదన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తే చూస్తూ ఉరుకోమన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తప్పులు మాట్లాడుతున్నారన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో చైనా దేశం ఊర్లకు ఊర్లె కడుతుందని ఆరోపించారు. దేశ సరిహద్దు కాపాడటంలో బిజెపి సర్కార్ ఘోరంగా వైఫలం చెందిన్నారు. కేంద్రం అసమర్ధత కారణంగానే గంగానదిలో శవాలు తేలాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News