Thursday, May 2, 2024

పరిహారంపై ఇదేం పరిహాసం

- Advertisement -
- Advertisement -

 జిఎస్‌టి చెల్లింపుల్లో కోత విధింపు సరికాదు
 కేంద్రం నిర్ణయం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం
 చట్ట ప్రకారం రెండు నెలలకు ఒకసారి బకాయిలు చెల్లించండి
 ఆదాయం తగ్గడంతో వేతనాలు, ఖర్చుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది
 ఆదుకోవాల్సింది పోయి అప్పులు తెచ్చుకొమ్మనడం సమంజసం కాదు
 జాతీయ ప్రయోజనాల దృష్టా జిఎస్‌టిని సమర్థించాం, తొలి తీర్మానం చేసింది కూడా తెలంగాణ అసెంబ్లీనే
 ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ లేఖ

CM KCR Orders to CID probe into Srisailam accident

మన తెలంగాణ/హైదరాబాద్: జిఎస్‌టి పరిహారాన్ని తగ్గించడం సమంజసం కాదని, కేంద్రమే అప్పు తీసుకుని రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. జిఎస్‌టి పరిహారం కోసం రాష్ట్రాలే అప్పులు తీసుకోవాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రధానమంత్రికి లేఖ రాశారు. రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలన్న ప్రతిపాదన ఏమాత్రం సబబు కాదని స్పష్టం చేశారు. జిఎస్‌టితో కొంతకాలం రాష్ట్రం నష్టపోతుందని తెలిసినా దేశ, రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ జిఎస్‌టికి సంపూర్ణ మద్ధతును ప్రకటించిందని గుర్తు చేశారు. యూపిఎ హయాంలోనూ సిఎస్‌టి (కమర్షియల్ టాక్స్) బకాయిల విషయంలో తెలంగాణ రూ.3800 కోట్లు నష్టపోయిందని తెలిపారు. అందులో భాగంగానే జిఎస్‌టి చట్టం చేసే సమయంలో పరిహారాన్ని కూడా చట్టం చేయాలని పట్టుబట్టినట్లు వివరించారు. పార్లమెంట్‌లో చేసిన చట్టం ప్రకారం రెండు నెలలకోసారి జిఎస్‌టి పరిహారం చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమవుతోందన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ పరిహారం ఇంకా అందలేదని లేఖలో వివరించారు. కరోనా, లాక్‌డౌన్ వల్ల ఏప్రిల్ నెలలో రాష్ట్ర ఆదాయం 83 శాతం పడిపోయిందని అదే సందర్భంలో కొవిడ్ సంబంధిత వ్యయం పెరిగిందని తెలిపారు. రాష్ట్ర ఆదాయం తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వేతనాలు, ఇతర ఖర్చుల కోసం అప్పులపై ఆధారపడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. వేస్ అండ్ మీన్స్, మార్కెట్ రుణాలు, ఒవర్ డ్రాప్ట్ వంటివి వినియోగించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాలు మార్కెట్‌లో అప్పులు చేసుకునేందుకు కూడా కేంద్రంపైనే ఆధారపడాల్సి వస్తోందన్నారు. కేంద్రానికి 3.5 శాతం అప్పులు తీసుకునే వెసులుబాటు ఉంటే రాష్ట్రాలకు మూడు శాతం మాత్రమే ఉండటం రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కేంద్రం అప్పులు తీసుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న వాదన సరికాదని, రాష్ట్రాలు అప్పులు తీసుకున్నా అదే పరిస్థితులు ఉంటాయని తెలిపారు.
కేంద్రానికే వనరులెక్కువ.. పరిహారం తగ్గిస్తే నిబంధనలకు అర్థం లేదు
ఇక 2020-21లో జిఎస్‌టి ఆదాయ అంతరాన్ని తగ్గించేందుకు 10 శాతం వృద్దిని పరిగణనలోకి తీసుకోవడం ఏమాత్రం సబబు కాదన్నారు. జిఎస్‌టి ఆదాయంలో తగ్గుదల, కొవిడ్ కారణంగా రాష్ట్రాలకు ఇచ్చే పరిహారాన్ని తగ్గించడం సరికాదన్నారు. పరిహారాన్ని తగ్గించడం జిఎస్‌టి చట్టానికి విరుద్ధమని స్పష్టం చేశారు. అలా చేస్తే జిఎస్‌టి పరిహార నిబంధనలకు అర్థం ఉండదని తెలిపారు. జిఎస్‌టిలో రాష్ట్రాలకు పెద్దగా ఆదాయం లేకుండా పోయిందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రాలకు అండగా నిలవాలని, అందుకు విరుద్ధంగా రాష్ట్రాల న్యాయపరమైన హక్కులను హరించడం సరైంది కాదన్నారు. పరిహారం కోసం రాష్ట్రాలే అప్పులు తీసుకోవలని చెప్పడం అన్యాయం చేయడమేనని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం కంటే కేంద్రానికే ఎక్కువ వెసులుబాటుతో పాటు వనరులు ఉన్నాయన్నారు. ఆదాయపు పన్ను, కార్పొరేషన్ పన్ను, కస్టమ్స్ సుంకాలు వంటి సులభ మార్గాలు ఉన్నాయని తెలిపారు. అదనంగా ఆర్‌బిఐ, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ నుంచి డివిడెంట్ వంటి పన్నేతర ఆదాయాలకు కేంద్రానికి అవకాశం ఉందన్నారు.
ఆదాయమైతే జమ.. పరిహారమైతే అప్పులా!
పెట్రోల్, డీజిల్ ధరలను రూ.13 వరకు పెంచారని, దీంతో కేంద్రానికి ఏడాదికి రూ.2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని సిఎం ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. కరోనాపై పోరాడుతున్న రాష్ట్రాలకు కేంద్రం మరింత ఆర్థిక చేయూత ఇవ్వాల్సి ఉంటుందన్నారు. 201718, 201819 ఆర్థిక సంవత్సరాల్లో జిఎస్‌టి పరిహార నిధిలో మిగులు ఉన్నపుడు కన్సాలిడేటెడ్ ఫండ్‌కు జమ చేసిన కేంద్రం.. తగ్గుదల ఉన్నపుడు రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలని చెప్పడం నిబంధనల ఉల్లంఘనే అవుతుందన్నారు. ఈ పరిస్థితులన్నింటి దృష్టిలో పెట్టుకుని తగ్గే పరిహారం మొత్తానికి రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిఎం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు. తగ్గే మొత్తాన్ని కేంద్రమే అప్పుగా తీసుకుని జిఎస్‌టి సెస్ నుంచే అసలు, వడ్డీ చెల్లించాలని ప్రతిపాదించారు. సెస్ వసూలు గడువును 2022 తరువాత కూడా పొడగించే విషయంలో జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం తీసుకోవచ్చునని తెలిపారు.
రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి
కరోనా మహమ్మారిని తరిమికొట్టి, ఆర్థిక స్థితిని గాడిలో పెట్టాలంటే కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా సమాఖ్యస్పూర్తితో వెళితెనే బలమైన దేశంగా ఎదిగేందుకు అస్కారం ఉంటుందన్నారు. రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని పేర్కొన్నారు. బలమైనే రాష్ట్రాలే దేశాన్ని అభివృద్ధి చేస్తాయని తెలిపారు. జిఎస్‌టి కౌన్సిల్ ఇప్పటి వరకు అన్నీ ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకుందని, ఇక ముందు కూడా అదే సంప్రదాయం కొనసాగేలా చూడాలని సిఎం ప్రధానిని కోరారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తాను ప్రతిపాదించిన ప్రత్యామ్నాయాన్ని ప్రధాన మంత్రి సానుకూలంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు సిఎం కెసిఆర్ తెలిపారు.

CM KCR Writes to PM Modi on GST Arrears

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News