Monday, April 29, 2024

మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

లే ఔట్ల క్రమబద్ధ్దీకరణకు మరో గోల్డెన్ ఛాన్స్
గత నెల 26 వరకు అభివృద్ధి చేసిన లేఔట్లు, ఫ్లాట్లు మాత్రమే రెగ్యులరైజ్
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని వారి ఫ్లాట్లపై నిషేధం
దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 15, అంతా ఆన్‌లైన్‌లోనే ప్రక్రియ
 రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రకటించింది. ప్లాట్లు, లే ఔట్ల క్రమబద్దీకరణకు మరోమారు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీనికి సంబంధించి పురపాలక శాఖ (జీఓ 131, తేదీఈ 31.08.2020) కింద ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్‌ఎండిఏ సహా కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు పురపాలిక సంఘాలు, గ్రామ పంచాయతీల్లోని ప్లాట్లు ఎల్‌ఆర్‌ఎస్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. గత నెల 26వ తేదీ వరకు అభివృద్ధి చేసిన లే ఔట్లు, విక్రయించిన ప్లాట్లను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ జీఓను సద్వినియోగం చేసుకొని వారి ప్లాట్ల క్రయ, విక్రయాలపై నిషేధం కొనసాగుతుందని, దీంతోపాటు ఆ ప్లాట్లలో భవన నిర్మాణాలకు అనుమతులు ఉండవని ప్రభుత్వం తేల్చిచెప్పింది. వారంరోజుల క్రితం అక్రమ లే ఔట్లు, అక్రమ నిర్మాణాల రిజిస్ట్రేషన్‌లను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నిలిపివేస్తూ మెమో జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పురపాలక శాఖ జారీ చేసిన ఈ జిఓతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఊరట లభించినట్టయ్యింది. ఈ క్రమబద్ధీకరణతో సుమారుగా ప్రభుత్వానికి రూ.5 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జిఓతో రానున్న రోజుల్లో ఎవరూ అక్రమ లే ఔట్లు చేయకుండా నిరోధించే అవకాశం కూడా ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఫీజుల ఖరారు….
టిఎస్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు ఈ ఎల్‌ఆర్‌ఎస్ వర్తించనుంది. సేల్ డీడ్ లేదా టైటిల్ డీడ్ ఉన్న ప్లాట్లకు, లే ఔట్లకు మాత్రమే ఈ జిఓ వర్తిస్తుందని, జిపిఓ డీడ్‌లకు ఇది వర్తించదని ప్రభుత్వం తెలిపింది. ఆన్‌లైన్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 15వ తేదీ చివరితేదీ అని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనికి సంబంధించి ఫీజులను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది.
500 చ.మీలు కన్నా ఎక్కువగా ఉన్న ప్లాట్లకు రూ.750ల ఫీజు
ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకునే వారు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1,000లను, లే ఔట్‌ల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఫీజు కింద రూ.10వేలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెగ్యులరైజేషన్ కింద 100 చదరపు మీటర్లు ఉన్న ప్లాట్‌లకు (ఒక్క చదరపు మీటర్‌కు రూ.200లుగా చెల్లించాలని), 101 నుంచి 300 చ.మీ.లు ఉంటే (చదరపు మీటర్‌కు రూ.400లను), 301 చ.మీ.ల నుంచి 600 వరకు ( చదరపు మీటర్‌కు రూ.600లను), 500 చ.మీలు పైన ఉంటే ప్రతి చ.మీకు రూ.750లను రెగ్యులరైజేషన్ కింద చార్జీలను చెల్లించాలని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో తెలిపింది. మురికివాడల్లో చ.మీ.లకు క్రమబద్ధీకరణ రుసుం కింద రూ.5లను చెల్లించాలని పేర్కొంది.
దరఖాస్తులు, చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే…
గత నెల ఆగష్టు 26వ తేదీ లోపు చేసిన లే ఔట్లు చేసిన ఓనర్లకు, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ల యజమానులు ఈ ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి మున్సిపల్ శాఖ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలకు లోబడే లే ఔట్లను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈసేవ, మీసేవ, మున్సిపాలిటీ వెబ్‌సైట్‌లలో ఎల్‌ఆర్‌ఎస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఫీజులను సైతం ఆన్‌లైన్ చెల్లించాలని ప్రభుత్వం ఈ జిఓలో పేర్కొంది. జనవరి 31వ తేదీ లోపు ప్లాట్ల రెగ్యులరైజ్‌కు సంబంధించి పూర్తి స్థాయి రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని మున్సిపల్ శాఖ ఈ జిఓలో తెలిపింది.
లే ఔట్లకు సంబంధించి మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు ఇలా…
1.నాలాకు 2 మీటర్ల దూరం ఉండాలి.
2.వాగుకు 9 మీటర్ల దూరం, 10 హెక్టార్లలోపు ఉన్న చెరువుకు 9 మీటర్ల దూరం ఉండాలి.
3.10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువుకు 3.0 మీటర్ల దూరం ఉండాలి.
4.ఎయిర్‌పోర్టు, డిఫెన్స్ స్థలానికి 500 మీటర్ల దూరం ఉండాలి.
5.లే ఔట్లలో 10 శాతం ఓపెన్‌స్పేస్ లేని ప్లాట్లకు అదనంగా 14 శాతం అపరాధ రుసుమును చెలించాలని మున్సిపల్ శాఖ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది.
3 వేల గజాల లోపు ఉన్న ప్లాట్లకు క్రమబద్ధీకరణ కింద 25 శాతం చార్జీ
ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద 3 వేల గజాల లోపు ఉన్న ప్లాట్లకు క్రమబద్ధీకరణ కింద 25 శాతం చార్జీలను, 3001 నుంచి 5వేల గజాలలోపు ఉన్న ప్లాట్లకు 50 శాతం, 5001 నుంచి 10వేల గజాలలోపు ఉన్న ప్లాట్లకు 75 శాతం, 10,001 పైగా గజాలలోపు ఉన్న ప్లాట్లకు 100 శాతం క్రమబద్ధీకరణ కింద చార్జీలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తిరస్కరించబడే దరఖాస్తులు ఇలా…
నీటి వనరుల చెంతన చేసిన లే ఔట్లలోని ప్లాట్ల దరఖాస్తులు తిరస్కరించబడుతాయని ప్రభుత్వం తెలిపింది. ఎఫ్‌టిఎల్ పరిధిలోకి వచ్చే లే ఔట్లతో పాటు శిఖం భూముల్లో పరిధిలో ఉన్న ప్లాట్లకు దరఖాస్తు చేసుకోవద్దని ఈ జీఓలో ప్రభుత్వం పేర్కొంది. వీటితోపాటు ఇండస్ట్రీయల్, మాన్యుప్రాక్చరింగ్, టిఎస్‌ఐఐసికి కేటాయించిన భూములతో పాటు హెచ్‌ఎండిఏ మాస్టర్ ప్లాన్‌లోని ఓపెన్‌స్పేస్‌లో (పార్కుల కోసం) కొనుగోలు చేసిన ప్లాట్లను కూడా క్రమబద్ధీకరించమని ప్రభుత్వం తెలిపింది.

Another chance to layouts streamline in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News