Monday, April 29, 2024

పోటీ ‘సింగపూర్‌తోనే’

- Advertisement -
- Advertisement -

తెలంగాణ పోటీ బెంగళూరుతోనే కాదు
సింగపూర్, మలేసియాలతోనే
హైదరాబాద్ వేగంగా మరింత అభివృద్ధి చెందుతున్నది
ఆఫీసు స్పేస్ లీజులో బెంగళూరును దాటిపోయింది
ఐటిలోనే కాక అనేక రంగాల్లో అభివృద్ధి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు అభివృద్ధి విస్తరణ : మై హోం ట్విట్జాలో రెండు కొత్త సంస్థల ఆఫీసులను ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పోటీ బెంగుళూరుతో కాదనీ, సింగపూర్, మలేసియా దేశాలతోనే అని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో అద్భుతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్ రాయదుర్గంలో మైహోం ట్విట్జాలో కొలియర్స్, ష్యూరిఫై సంస్థల నూతన కార్యాలయాలను మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మం త్రి కెటిఆర్ మాట్లాడుతూ భాగ్యగనరంలో కొవిడ్ వల్ల హైబ్రిడ్ విధానంలో పనిచేస్తున్నా ఫలితాలు మాత్రం ఎక్కడా తగ్గట్లేదని కెటిఆర్ అన్నారు. ఐటి కార్యకలాపాలు హైదరాబాద్‌కే పరిమితం కాదని టైర్-2 సిటీలో కూడా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొలియర్స్ కంపెనీ కూడా టైర్-2 సిటీల్లో ఏ ర్పాటు చేయడంపై దృష్టి సారించాలని కెటిఆర్ ఆ సం స్థ ప్రతినిధులను కోరారు. ఏడేళ్ల క్రితం ష్యూరిఫై సంస్థలో ఒక ఉద్యోగి మాత్రమే ఉంటే ఇప్పుడు 200 మంది ఉన్నారని ఆయన తెలిపారు.

అందరూ సంప్రదాయ దుస్తు ల్లో కనిపిస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. పరి శ్రమలు నెలకొల్పడానికి హైదరాబాద్ మహానగరం దేశంలోకెల్లా సౌకర్యవంతమైన నగరమని కెటిఆర్ పేర్కొన్నారు. మన ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడే మన ఎదుగుదల ఉన్నతంగా ఉంటుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఆఫీస్ స్పేస్ లీజు విషయంలో హైదరాబాద్ నగరం బెంగుళూరును దాటిపోయిందన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణ సృష్టి, వ్యాపార అనుకూల విధానాలను నిరంతరం కొనసాగించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. హైదరాబాద్‌లో 2012, -13 సంవత్సరంలో రెండు మిలియన్ల చదరపు అడుగుల పైచిలుకు కమర్షియల్ లీజ్ స్పేస్ ఉందని, గతేడాది 11 మిలియన్ చదరపు అడుగుల లీజ్ స్పేస్‌కు అది చేరుకుందని ఆయన తెలిపారు. దీనిని బట్టి హైదరాబాద్ ఎంత వేగంగా, ఎంత బలంగా అభివృద్ధివైపు దూసుకుపోతుందో అర్ధం చేసుకోవచ్చన్నారు.

ఐటిలోనే కాకుండా అనేక రంగాల్లో అభివృద్ధి

హైదరాబాద్ నగరం ఒక ఐటిలోనే కాకుండా అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఐటితోపాటు జీవశాస్త్రాలు, ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర రంగాల్లో ఎంతగానో పురోగతి సాధించినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ పరంగా పరిశ్రమలు, పెట్టుబడిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో, అంతే వేగంగా తాము అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో నేడు విద్యుత్ కోతలు లేవని మంత్రి కెటిఆర్ గుర్తుచేశారు.

ఇతర ప్రాంతాలకు అభివృద్ధి విస్తరణ…

ఎక్కువమంది హైదరాబాద్ పశ్చిమం వైపునే దృష్టి కేంద్రీకరిస్తున్నారని, పశ్చిమం వైపునే కాకుండా ఇతర ప్రాంతాల వైపు కూడా ఎదుగుదలకు అవకాశాలున్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇటీవలే ఉత్తరం వైపు ఐటి గేట్‌వే పార్కును ప్రారంభించినట్లు, తూర్పు వైపున కూడా కంపెనీల ఏర్పాటునకు అనేక అవకాశాలున్నాయన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కంపెనీలు తూర్పు వైపునకు వస్తున్నాయన్నారు. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కాకుండా నగరం నలువైపులా అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. కంపెనీలు ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా ఎక్కడినుంచైనా కార్యకలాపాలు సాగించవచ్చని కొవిడ్ వల్ల అర్థమయ్యిందన్నారు.

ఎనిమిదేళ్లలోనే సింగపూర్ స్థాయికి హైదరాబాద్…. మంత్రి జగదీశ్ రెడ్డి

ఎనిమిదేళ్లలోనే సింగపూర్ స్థాయికి హైదరాబాద్‌ను తీసుకురావడంలో మంత్రి కెటిఆర్ పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి కెటిఆర్ ముందు చూపు వల్లే భాగ్యనగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఎనిమిదేళ్ల క్రితం ఇక్కడ ఎలాంటి స్టార్టప్ ఎకో సిస్టమ్ లేదని, సిఎం కెసిఆర్ ముందు చూపు, మంత్రి కెటిఆర్ తెలివి వల్లే భాగ్యనగరం అద్భుతంగా ఉందని ఆయన కితాబునిచ్చారు.

పెట్టుబడుల ఘనత సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లదే…

ప్రముఖ పారిశ్రామికవేత్త బివి ఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో స్టార్టప్‌ల పర్యావరణ వ్యవస్థ లేదని, కొత్త పెట్టుబడుల రాక అసలు ఉండేది కాదని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో ఐటి రంగ అభివృద్ధి, పెట్టుబడులను రాబడుతున్న ఘనత సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌కే దక్కుతుందన్నారు. ష్యూరిఫై సీఈఓ డస్టిన్ మాట్లాడుతూ ఏడేళ్ల క్రితం అమీర్‌పేట్‌లో ఒక వ్యక్తితో కార్యాలయాన్ని ప్రారంభించామని, ఇప్పుడు హైటెక్ సిటీలో రెండో కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. అమెరికా సహా తన మూడు కంపెనీల్లో 320మంది పనిచేస్తుండగా, అందులో 220మంది హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో వ్యాపార అనుకూలత ఉందని, ముఖ్యంగా మంత్రి కెటిఆర్ సహకారం ఎంతో ఉందని ఆయన కొనియాడారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎమ్మెల్యే బాల్క సుమన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News