Friday, May 3, 2024

కాంగ్రెస్ రెండు జాబితాల్లో బిసిలకు అన్యాయం

- Advertisement -
- Advertisement -

కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నా …
చట్టసభల్లో బిసి రిజర్వేషన్ బిల్లుకు అడ్డంకి ఏది ?
ప్రత్యేక మంత్రిత్వశాఖ, మహిళా బిల్లులో బిసిల వాటా ఏది ?
బిసి ముఖ్యమంత్రి పదవేకాదు… బిసి బిల్లు ముఖ్యం
జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ మొదటి,- రెండవ జాబితాల్లో బిసిలకు 20 టికెట్లు మాత్రమే కేటాయించిందని, ఇది చాలా అన్యాయమని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి ఆర్. కృష్ణయ్య అన్నారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 50 శాతం జనాభా గల బిసిలకు 20 శాతం టికెట్లు కేటాయించి అన్యాయం చేశారని విమర్శించారు. అంగబలం – అర్ధ బలం ఉన్న సమర్థులైన బిసి నాయకులు చాలా నియోజకవర్గాలలో ఉన్నప్పటికీ వారికి టికెట్లు కేటాయించకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. బిఆర్‌ఎస్ కేవలం 23 సీట్లు కేటాయించి అన్యాయం చేసిందని బిసిలు గగ్గోలు పెడుతుంటే కాంగ్రెస్ అడుగు ముందుకేసి కేవలం 20 సీట్లు కేటాయించి ఘోరంగా అవమానపరిచిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ – ప్రతి పార్లమెంటు, నియోజకవర్గంలో రెండు సీట్లు కేటాయిస్తామని బిసిలను ఊరించి – ఆశాభంగం కలిగించిందన్నారు. బిసిలు ఈ పార్టీలకు గుణపాఠం చెబుతాయని హెచ్చరించారు.
బిసిలకు ముఖ్యమంత్రి పదవే కాదు – బిసి బిల్లు ముఖ్యం
బిజెపి పార్టీ బిసిలకు ముఖ్యమంత్రి పదవి ప్రకటించడంతో సరిపోదని, పార్లమెంటులో బిసి బిల్లు పెట్టి చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బిసిలకు రిజర్వేషన్లు కల్పిస్తే 50 శాతం అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు బిసిలకు రిజర్వు అవుతాయని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీల దయ – దాక్షిణ్యాల మీద ఆధారపడడం ఉండదని అన్నారు. బిసిలకు ఎక్కువ సీట్లు బిజెపి కేటాయించిందని, సీట్ల ప్రకటన శాశ్వత పరిష్కారం కాదని కృష్ణయ్య అన్నారు. పార్లమెంటులో బిసి బిల్లు పెట్టి, జనాభా ప్రకారం చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా బిల్లు పెట్టిన విధంగా బిసి బిల్లు పెట్టాలని కోరారు. ఎక్కువ సీట్లు కేటాయించడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని, బిసి బిల్లు పెట్టడమే శాశ్వత పరిష్కారమని ఆయనన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి బిసి బిల్లు పెట్టడానికి అవరోధం ఏంటని ఆయన ప్రశ్నించారు. నిజంగా బిజెపికి బిసిల పట్ల చిత్తశుద్ధి ఉంటే బిసి బిల్లు పార్లమెంటులో పెట్టాలని కోరారు. బిసిలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, ఏటా రెండు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలని కోరారు. మహిళా బిల్లు పెట్టినట్లు బిసి బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.

బిసిలకు 50 శాతం టికెట్లు కేటాయించాలని గత 30 సంవత్సరాలుగా బిసి సంఘాలు, బిసి నేతలు పోరాటం చేస్తున్నా అన్ని పార్టీలు బిసిలకు 20 శాతం టికెట్లు కూడా ఇవ్వడం లేదు. కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రాజకీయ పార్టీ గెలుపు కోసం అంగం బలం – అర్ధ బలం కోణం నుంచి చూసి ఏదో ఒక సాకుతో బిసిలకు మొండి చెయ్యి చూపుతున్నారని ఆరోపించారు. పార్లమెంటులో బిసి బిల్లు పెట్టాలని గత 30 సంవత్సరాలుగా బిసి సంఘాలు హైదరాబాద్ లో, పార్లమెంట్ వద్ద 900 సార్లు ధర్నాలు ప్రదర్శనలు చేస్తూ వచ్చామని కృష్ణయ్య తెలిపారు. పార్లమెంటు ఆమోదించిన మహిళా బిల్లులో బిసి మహిళలకు సబ్ కోటా పెట్టాలని డిమాండ్ చేశారు. బిసి సంఘాలు, – బిసిలంధరు పార్టీలకు అతీతంగా బిసి బిల్లుకై పోరాటం చేద్దామని కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, జాతీయ ప్రధాన కార్యదర్శి కోల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News