Monday, May 13, 2024

బిఎస్పీ గూటికి కాంగ్రెస్ తిరుగుబాటు నేతలు?

- Advertisement -
- Advertisement -

తొలి జాబితాలో టికెట్ దక్కని నాయకులు పార్టీ మారేందుకు ప్లాన్
హస్తం పార్టీ వీడనున్న 9 నియోజకవర్గాల ఆశావాహులు
బిఎస్పీ టికెటు హామీ ఇస్తే దసరా తరువాత చేరేందుకు సిద్ధం
టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి దూకుడుకు కళ్లెం వేస్తామని సవాల్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. వచ్చే నెల 30న ఎన్నికల సమరం జరుగుతుండటంతో అభ్యర్థుల జాబితాను ఆయా పార్టీల పెద్దలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా నాలుగు రోజుల కితం కాంగ్రెస్ పార్టీ 55 మందితో కూడిన తొలి జాబితా ప్రకటించింది. దీంతో ఆపార్టీలో ఇప్పటివరకు టికెట్లు వస్తుందని భావించిన ఆశావాహులకు మొండి చేయి ఇవ్వడంతో వారంతా మరోపార్టీ నుంచి ఎన్నికల సమరంలో తలపడేందుకు కాలు దువ్వుతున్నారు.

ప్రధాన పార్టీల్లో ఎక్కువ టికెట్ల పోటీ ఉండటంతో వారంతా బిఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆపార్టీ చీప్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో మంతనాలు జరిగేందుకు సిద్దమైతున్నారు. ఇప్పటికే బిఎస్పీ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయవతి ఆదేశాలతో 20 మంది అభ్యర్థులను ప్రకటించారు. మిగతా జాబితా త్వరలో ప్రకటించేందుకు సిద్దం చేస్తున్నారు. ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ మొదటి జాబితాలో టికెట్లు నాయకులంతా బిఎస్పీలో చేరేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వారి అనుచరులు చెబుతున్నారు.

కాంగ్రెస్ నుంచి పార్టీ మారేందుకు గద్వాల్, కొల్లాపూర్, నకిరేకల్, అలేరు, మేడ్చల్, ఉప్పల్, సనత్‌నగర్, నల్లగొండ, గోషామహల్ నియోజకవర్గాలకు చెందిన నాయకులు బిఎస్పీతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నాయని, రెండుసార్లు అధికారానికి దూరంగా ఉన్న అధిపత్యం కోసం నాయకుల మధ్య పోరాటం జరుగుతుందని, ఈ విబేదాలతో ఈసారి కాంగ్రెస్‌పార్టీ అడ్రస్సు గల్లంతైతుందని విమర్శిస్తున్నారు.

పార్టీ కోసం పనిచేసేవారికి సీట్లు ఇవ్వకుండా రాత్రికి రాత్రికి పార్టీలో చేరి కోట్లాది రూపాయలు ఇచ్చిన నేతలకే ప్రాధాన్యత ఇస్తూ భిపామ్‌లను అమ్ముకుంటున్నారని మండిపడుతున్నారు. కష్టకాలంలో పార్టీకోసం శ్రమించిన వారిని పార్టీలో ఉండకుండా కుట్రలు చేస్తున్నారని, టిపిసిసి చీప్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరువాత కాంగ్రెస్ పార్టీ స్వరూపమే మారిందని, సొంత ఏజెండా అమలు చేసేందుకు ఎత్తులు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొదటి లిస్టులో చోటు దక్కినవారంతా గెలిచిన తరువాత మరోపార్టీకి వెళ్లి అక్రమాలకు పాల్పడుతారని, డిసెంబర్ ఎన్నికల ఫలితాల తరువాత గాంధీభవన్‌కు తాళం వేయక తప్పదని ఎద్దేవా చేస్తున్నారు. తామంతా బిఎస్పీ నుంచి పోటీ చేసి బహుజన రాజ్యాధికారం కోస పోరాటం చేస్తామని చెబుతున్నారు. అణగారిన కులాలకు అధికారం కేవలం బిఎస్పీ పార్టీతోనే సాధ్యమంటున్నారు. దసరా తరువాత ఆపార్టీ కండువాలు ధరిస్తామని, కుట్రలతో రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ఎన్నికల్లో డిపాజిట్ దక్కదని పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News