Tuesday, May 7, 2024

ఎన్నికలు వస్తున్నాయనే కాంగ్రెస్ కొత్త పల్లవి

- Advertisement -
- Advertisement -

దళిత డిక్లరేషన్ పై మంత్రి కొప్పుల ఆగ్రహం

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ దళిత గిరిజన డిక్లరేషన్ పచ్చి మోసమని ఎస్‌సి అభివృద్ధి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అధికారంలో ఉన్నంత కాలం ఏమి ఒరగబెట్టారని ఇప్పుడు డిక్లరేషన్‌లు ప్రకటిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఏనాడు ప్రజల బాగోగులు పట్టించు కోని వాళ్లంతా ఎన్నికలు వస్తున్నాయని కొత్త పల్లవి ఎత్తు కుంటున్నారని విమర్శించారు. నిజంగా దళితులు గిరిజనులపై ప్రేమ ఉంటే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఈ డిక్లరేషన్‌లు అమలు చేయడం లేదని మంత్రి ప్రశ్నించారు.

తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలతో ప్రజలు సంతృప్తి గా ఉన్నారని చెప్పారు. ప్రజల్లో బిఆర్‌ఎస్ పట్ల ఉన్న ఆదరణ చూసి తట్టుకోలేక కాంగ్రెస్ నేతలు మాయ మాటలు, గారడీలతో మభ్య పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. గత రెండు ఎన్నికల్లో ప్రజలు తిప్పి కొట్టారని, అయినా ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వస్తున్నారని ఎద్దెవా చేశారు. ముందుగా కర్ణాటకలో డిక్లరేషన్ అమలు చేసిన తర్వాతే తెలంగాణ లో డిక్లరేషన్ ప్రకటించాలన్నారు. కర్ణాటక, ఛత్తీస్‌గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండి ప్రజలకు మేలు చేయడం లేదని విమర్శించారు. జాతీయ పార్టీ అనిచెప్పుకుంటున్న కాంగ్రెస్ చెప్పేదొకటి, చేసేదొకటి అని దుయ్యబట్టారు. ప్రతి ఎన్నికకో నీతి, రాష్ట్రానికో నీతి అన్న చందాన వ్యవహారిస్తున్నారన్నారు. అధికారమే లక్ష్యంగా హామీలు ఇస్తున్నా ప్రజలు గమనిస్తున్నారని, దళితులను, గిరిజనులను దశాబ్దాలుగా అణగదొక్కిన కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ తో ఆయా వర్గాలను అణచి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కాపీ కొట్టి వాటి పేర్లు మార్చడం తప్ప అందులో కొత్తదేమిలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అందిస్తున్న ఆసరా పింఛన్లను రూ. 4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చినట్టుగానే ఇప్పుడు దళితబంధు సాయాన్ని రూ. 12 లక్షలు చేస్తామని ప్రకటించినంత మాత్రనా అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ లక్ష్యం అన్నారు. దళితులు, వికలాంగుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశ్యమని అన్నారు. ఎన్నికల్లో ప్రకటించని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కు దక్కుతుందన్నారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, మాయ మాటలు చెప్పినా వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారకంలోకి వచ్చేది తామే నని కొప్పుల ఈశ్వర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News