Sunday, April 28, 2024

థర్డ్‌వేవ్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

Corona thirdwave threat in mid-September-October

సెప్టెంబర్‌అక్టోబర్ మధ్య ఎప్పుడైనా రావొచ్చు

పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపొచ్చు
వైద్య సదుపాయాలన్నింటినీ మెరుగు
పర్చాలి ఇప్పుడున్నవి చాలావు
లేకుంటే 6 లక్షల కేసులు వచ్చే
ప్రమాదం పిఎంఒకి నిపుణుల నివేదిక

న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గుముఖం పడుతున్నప్పటికీ కరోనా ముప్పు ఇంకా తొలగి పోలేదని, త్వరలో థర్డ్ వేవ్ రానున్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్- అక్టోబర్ మధ్య కాలంలో ఎప్పుడైనా థర్డ్ వేవ్ గరిష్ఠ స్థాయికి చేరుతుందని, ఇది పెద్దలతోపాటు పిల్లలపై ప్రభావం చూపనుందని కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జాతీయ విపత్తు నిర్వహణ పంస్థ (ఎన్‌ఐడిఎం) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ హెచ్చరించింది. ఈమేరకు ప్రధాన మంత్రి కార్యాలయా( పిఎంఒ)నికి నివేదిక అందజేసింది. ఇక థర్డ్ వేవ్‌లో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. థర్డ్‌వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ వసతులను భారీగా పెంచాల్సిన అవసరం ఉందని, డాక్టర్లు, సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సుల వంటి వాటిని మెరుగు పర్చాలని వివరించింది. ప్రస్తుతం ఉన్న సదుపాయాలు అవసరానికి దరి దాపుల్లో లేవని స్పష్టం చేసింది. థర్డ్‌వేవ్ ప్రిపేర్డ్‌నెస్ , చిల్డ్రన్ వల్నరబిలిటీ అండ్ రికవరీ శీర్షికన వెలువడిన ఈ నివేదిక అందుబాటులో ఉన్న సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

చికిత్స సమయంలో వైరస్ సోకిన పిల్లలతో ఉండే సంరక్షకులు సురక్షితంగా ఉండేలా కొవిడ్ వార్డుల నిర్మాణం ఉండాలని ప్రతిపాదించింది. అలాగే ప్రత్యేక అవసరాలున్న పిల్లలు, ఇతర వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు టీకా వేయాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసింది.దేశ జనాభాలో కేవలం 7.6 శాతం (10.4 కోట్ల మంది ) మంది మాత్రమే పూర్తిగా టీకా పొందగలిగారని, ఈ వ్యాక్సినేషన్ రేటును పెంచకుంటే వచ్చే వేవ్‌లో రోజుకు 6 లక్షల కరోనా కేసులు బయటపడవచ్చని హెచ్చరించింది. ఇన్‌ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ వల్ల మనం హెర్డ్ ఇమ్యూనిటీ సాధించేవరకు ఈ కేసులు ఉధృతంగా పెరిగి, చివరకు కరోనా అంటువ్యాధిలా మారే ప్రమాదం ఉందని నిపుణుల కమిటీ హెచ్చరించింది. ఈ సందర్భంగా ఎన్‌ఐడిఎం నివేదిక ఐఐటి కాన్పూర్‌కు చెందిన నిపుణుల అంచనాలను నివేదికలో ఉదహరించింది. ఐఐటి కాన్పూర్ నిపుణుల కమిటీ ఆంక్షల సడలింపు స్థాయి ఆధారంగా మూడు అంశాలను థర్డ్‌వేవ్‌కు సంబంధించి సూచించింది. ఒకటో అంశంలో అక్టోబర్‌లో థర్డ్‌వేవ్ గరిష్ఠ స్థాయికి చేరి రోజుకు 3.2 లక్షల వరకు పాజిటివ్ కేసులు బయటపడవచ్చని వివరించింది. రెండో అంశంలో కొత్తగా పుట్టుకొచ్చే అనేక వేరియంట్ల సెప్టెంబర్‌లో థర్డ్‌వేవ్ గరిష్ఠ స్థాయికి చేరవచ్చని సూచించింది.

మూడో అంశంలో అక్టోబర్ ఆఖరి వారంలో థర్డ్‌వేవ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని, రోజుకు 2 లక్షల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావచ్చని నిపుణులు అంచనా వేశారు. ఈ నివేదిక ప్రకారం జనాభాలో 67 శాతం మంది రోగనిరోధక శక్తివంతులైతే హెర్డ్ ఇమ్యూనిటీని సాధించ గలుగుతామని పేర్కొంది. కానీ కొత్తగా వ్యాపించే వేరియంట్లు అనేక మార్పులతో ఇమ్యునిటీ నుంచి, వ్యాక్సిన్ల నుంచి తప్పించుకుంటున్నందున హెర్డ్ ఇమ్యూనిటీ సంక్లిష్టమౌతోందని నివేదిక అభిప్రాయపడింది. దీంతో 80 నుంచి 90 శాతం వరకు హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలన్నది లక్షంగా ప్రస్తుతం ఎదురైనట్టు నివేదిక పేర్కొంది. అందువల్ల మన ఆరోగ్యవ్యవస్థ , వ్యాక్సిన్లు వైరస్‌కు వ్యతిరేకంగా పరుగుపందెంలో ఉంటున్నాయని వివరించింది. థర్డ్‌వేవ్‌లో అత్యధిక శాతం మంది పిల్లలకు కరోనా తీవ్రంగా సోకుతుందని భయపడడానికి ఎలాంటి తగినంత డేటా లేదని, అయినప్పటికీ కరోనా వైరస్ కొనసాగుతున్నందున పిల్లల విషయంలో దేశంలో అనుమతి పొందిన వ్యాక్సిన్ ఇంతవరకు లేనందున ఇది పెద్ద సవాలుగా మారిందని నివేదిక పేర్కొంది.

కొవిడ్ సోకిన పిల్లలు చాలామంది అసింప్టొమేటిక్ లేదా తేలిక పాటి లక్షణాలతో ఉంటున్నారని , అయితే ఈ పరిస్థితుల్లో ఇతర వ్యాధులేవైనా వారికి జత గూడితే పిల్లల విషయంలో ఆందోళన చెందవలసిన పరిస్థితి ఎదురౌతుందని నివేదిక వివరించింది. కొవిడ్ బాధితులై ఆస్పత్రుల్లో చేరిన పిల్లల్లో 60 నుంచి 70 శాతం మందికి ఇతర వ్యాధులు సోకినట్టు తేలిందని, అలాగే మరికొంతమందిలో ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉందని బయటపడిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది. దేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 82 శాతం శిశు వైద్యుల కొరత ఉండగా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 63 శాతం వరకు ఖాళీలు ఉన్నట్టు ఎన్‌ఐడిఎం నివేదిక వెల్లడించింది. ఈ ఖాళీల భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రతి 100 వైరస్ పాజిటివ్ కేసుల్లో 23 మందికి ఆస్పత్రిలో వైద్యసేవలు అందేలా సన్నాహాలు చేయాలని నీతి ఆయోగ్ ప్రభుత్వానికి సూచించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News