Sunday, April 28, 2024

రేపు 4 రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తరువాత ఆదివారం (నేడు) వీటిలో నాలుగు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఓటర్ల నాడి ఏమిటనేది ఇప్పుడు అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతతో కౌంటింగ్ ప్రక్రియ క్రమంలో ఆదివారం మధ్యాహ్నానికి తేలనుంది. ఐదు రాష్ట్రాలలో గోవా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును వాయిదా వేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో అధికారికంగా ఎనిమిది గంటల ప్రాంతంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ మేరకు ఈ రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నడుమ చర్యలు చేపట్టారు. ఎగ్జిట్ ఫలితాల సంగతి పక్కన పెడితే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ పవర్ అత్యంత కీలకం అయింది. మధ్యప్రదేశ్‌లో బిజెపి, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. తెలంగాణలో బిఆర్‌ఎస్( పూర్వపు టిఆర్‌ఎస్) పవర్‌లో ఉంది.

మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 230 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది. కాగా రాజస్థాన్‌లో 199 సీట్లు, తెలంగాణలో 119 , ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 3 ఆదివారం ఓట్ల లెక్కింపు వెంటనే రాత్రి వరకూ ఫలితాల ప్రకటన జరుగుతుంది. విజేతలు ఎవరనేది పూర్తిగా స్పష్టంగా కానీ, మిశ్రిత ఫలితాలు ఉంటే అస్పష్టంగాఅయినా తేలుతుంది. రాజస్థాన్‌లో ఒక అభ్యర్థి మరణంతో ఒకచోట పోలింగ్ నిలిచిపోయింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఘట్టాన్ని సమర్ధవంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘం కౌంటింగ్ ప్రక్రియకు కూడా తగు విధమైన పద్ధతులు ఎంచుకుంది. మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కేవలం అర్హమైన పాస్‌లు ఇతర గుర్తింపు కార్డులు ఉన్నవారినే కౌంటింగ్ సెంటర్స్‌కు అనుమతిస్తారని అధికారులు తెలిపారు. కర్నాటకలో విజయం తరువాత కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాలలో విజయం లేదా బలోపేతానికి ఈ ఎన్నికలను వినియోగించుకుంది. కాగా బిజెపి ఓ వైపు మధ్యప్రదేశ్‌ను నిలబెట్టుకుంటూనే , రాజస్థాన్‌లో పాగాకు దిగింది. ఇక ఛత్తీస్‌గఢ్ , తెలంగాణ ఎన్నికల ఫలితాలు కూడా జాతీయ స్థాయి ప్రాధాన్యతను సంతరించకున్నాయి.

ఐదు రాష్ట్రాల ఫలితాలు ఇటు ఎన్‌డిఎకు అటు ఇండియాకు కీలకం అయ్యాయి. మధ్యప్రదేశ్‌లో 1988 నుంచి బిజెపి అధికారంలో ఉంటూ వచ్చింది, అంతకు ముందు కాంగ్రెస్‌కు పట్టు ఉన్న మధ్యప్రదేశ్‌ను చేజిక్కించుకున్న తరువాత నాలుగుసార్లు సిఎంఅయిన శివరాజ్‌సింగ్ చౌహాన్ తిరిగి తమదే హవాపై ధీమాతో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ విజయానికి బాధ్యతలు తీసుకున్న సీనియర్ నేత కమల్‌నాథ్ విజయంపై విశ్వాసం ఉందన్నారు. రాజస్థాన్‌ను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పూర్తిస్థాయి కసరత్తు చేస్తూ వచ్చింది. అయితే ఇప్పటికీ కొలిక్కిరాని అంతర్గత విభేదాలు ఫలితాలను ప్రభావితం చేస్తాయా? అనే అంశం వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌ను మరోసారి దక్కించుకుంటామని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో కెసిఆర్ సారధ్యపు బిఆర్‌ఎస్ మూడోసారి విజయంతో హ్యాట్రిక్‌కు రంగంలోకి దిగింది. ఇక్కడ కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్‌ల మధ్య త్రిముఖ పోటీ ఉంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల నినాదాలతో బిజెపి ఎక్కువగా ప్రచారం సాగించింది.

నాలుగు రాష్ట్రాలలో విశేషాలు
మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలకు మొత్తం2533 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధాన పోటీ కాంగ్రెస్, బిజెపి మధ్యనే ఉంది. ఇక్కడ కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తే కూడా బిజెపి తరఫున బరిలో ఉన్నారు. బిజెపి ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వ్రాగియా ఇండోర్ 1 నుంచి నిలిచారు. ముగ్గురు బిజెపి ఎంపీలు కూడా బరిలో దిగారు. రాజస్థాన్‌లో మొత్తం 1800 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ , బిజెపిల నడుమ పవర్ దోబూచులాట పరిస్థితి ఇప్పుడు కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత, సిఎం అశోక్ గెహ్లోట్ అపార అనుభవం పార్టీని గట్టెక్కిస్తుందని భావిస్తున్నారు. అయితే అంతర్గతంగా ఇతర నేతలు ప్రత్యేకించి సచిన్ పైలెట్ మద్దతు ఏ మేరకు ఉందనేది కూడా కీలకం అయింది. బిజెపి ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకునేందుకు భారీ స్థాయిలో పావులు కదిపింది. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ సమస్య నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియకు తగు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 1698 మంది మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు.

సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి రీనా బాబా సాహేబ్ కంగలే తెలిపారు. కీలక పోటీదార్లుగా సిఎం భూపేష్ బఘేల్, ఉప ముఖ్యమంత్రి టిఎస్ సింగ్ దేవ్ కాంగ్రెస్ ఉన్నారు. బిజెపి నుంచి మాజీ సిఎం రమణ్ సింగ్ బరిలో నిలిచారు. పటాన్ నియోజకవర్గం నుంచి అమిత్ జోగీ (జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ అధ్యక్షులు) బరిలో నిలిచారు. ఆయన రాష్ట్ర మాజీ సిఎం దివంగత నేత అజిత్ జోగీ కుమారుడు . తెలంగాణలో మొత్తం 2290 పోటీలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంది. బిజెపి కీలక ఓట్ల చీలిక పాత్ర స్థాయిలో ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చి పలు వినూత్న పథకాల ఘనతతో ముందుకు సాగుతున్నామని పేర్కొంటూ కెసిఆర్ తమ ప్రచారం సాగించారు. హ్యాట్రిక్‌కు పట్టుదలతో సాగారు. కాంగ్రెస్ ఇక్కడ పట్టుకోసం ముందుకు సాగింది. బరిలో కెసిఆర్ , కెటిఆర్, హరీష్‌రావు, బండి సంజయ్, రేవంత్ రెడ్డి. డి అర్వింద్, జానా రెడ్డి వంటి వారు ఉన్నారు. మార్పా? మునుపటి తీర్పా అనేది తెలంగాణ ముఖచిత్రాన్ని తేల్చనుంది. ఎంఐఎం ఈసారి 9 స్థానాల్లో నిలిచి ఇవన్నీతమవే అని ధీమాతోఉంది.

బిజెపి జనసేనతో పొత్తుతో అభ్యర్థులను రంగంలోకి దింపింది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రచారం సాగించింది. రాహుల్ , ప్రియాంకల సుడిగాలి పర్యటనలు ఇతరత్రా అంశాలను ప్రాతిపదికగా చేసుకుంది. అయితే పలు చోట్ల ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొనడం అధికార పార్టీకి తిరిగి పవర్‌కు దారితీస్తుందనే విశ్లేషణలు వెలువడ్డాయి. బిఆర్‌ఎస్ మొత్తం 119 స్థానాలలో నిలిచింది. కాగా కాంగ్రెస్ ఒక్క సీటును సిపిఐకి వదిలి మిగిలిన స్థానాలకు రంగంలోకి దిగింది. కెసిఆర్ గజ్వేల్, కామారెడ్డిల నుంచి పోటీలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ కాదు ఎగ్జాట్ పోల్స్ నిజమైన నిజాలను చెపుతాయని కౌంటింగ్ దశలో కెటిఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో 60 సీట్ల మ్యాజిక్ ఫిగర్ గురించి పెద్ద ఎత్తున విశ్లేషణలు వెలువడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News