Saturday, May 4, 2024

అరణ్య రోదన

- Advertisement -
- Advertisement -

covid 19 second wave in india చెప్పుకున్న గొప్పలన్నీ ఉత్తుత్తివేనని నిరూపణ అయిపోయి దేశ ముఖ చిత్రం అత్యంత దయనీయంగా మారిపోయింది. తీక్షణమైన అగ్గికి మాడిపోతున్న శలభాన్ని తలపిస్తున్నది. కొవిడ్ సెకండ్ వేవ్ సోకుతున్న కొత్త కేసులు రోజుకు 4 లక్షలకు చేరుకున్నాయి, ఆసుపత్రులు చాలడం లేదు. ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ల కొరత పట్టిపీడిస్తున్నది. చుక్కలు లెక్కపెట్టడం ఎంత కష్టమో ఈసారి మరణాలను లెక్కించడం అంత కష్టతరంగా మారిపోయింది. అధికారిక సంఖ్య కంటే అనేక రెట్లు ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. స్మశానాల్లో దహన క్రియలు జరపడానికి కట్టెలు ప్రియమైపోయి శవాలను నదుల్లో విడుస్తున్నారు. గంగా నదిలో 70కి పైగా మృతదేహాలు తేలాయి. పై నుంచి ఇంకా తేలివస్తున్నాయని వార్తలు చెబుతున్నాయి. బెంగళూరులో, ఆ పరిసరాల్లో గల స్మశానాలు చాలక ప్రభుత్వం మూడు చోట్ల తాత్కాలిక దహన వాటికలను నెలకొల్పింది. ఒక్కొక్క చోట రోజుకి 42 మృతదేహాలు వస్తున్నాయని, దహనాలకు కట్టెలు లభ్యం కాని పరిస్థితి పొంచి ఉందని అధికారులే చెబుతున్నారు.

ఎక్కడికక్కడ లాక్డౌన్లు విరుచుకుపడడంతో వలస కార్మికుల సమస్య మళ్లీ తీవ్రమవుతున్నది. ఉపాధులు, ఉద్యోగాలు కొడిగట్టిపోయాయి. పటిష్ఠమైన జాతీయ స్థాయి వ్యూహంతో దేశాన్ని వీలైనంత త్వరగా ఈ మహా విపత్తు నుంచి కాపాడవలసి ఉంది. ఆక్సిజన్ లభ్యత, సరఫరాలను పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు 12 మందితో టాస్క్ఫోర్స్ను నెలకొల్పగా దానికి కేంద్రం సవినయంగానే సహాయ నిరాకరణ తెలిసిన సంగతి తెలిసిందే. పాలకుల స్వయంకృతాపరాధం వల్లనే భారత దేశం సెకండ్ వేవ్కు దొరికిపోయి శవాల దిబ్బగా మారిపోతున్నదని అంతర్జాతీయ మీడియా పతాక శీర్షికలలోనే చీల్చి చెండాడింది. ఉన్న పరిస్థితిని నిజాయితీతో అంగీకరించి ఇప్పటికైనా బాధ్యతతో వ్యవహరించాల్సిన ప్రధాని మోడీ ప్రభుత్వం అహం దెబ్బ తిన్నందువల్లనో, మరే కారణంగానో అటువంటి మెలకువను ప్రదర్శించడం లేదు. టీకాలు ఉచితంగా వేయించడం వగైరా బాధ్యతలను స్వయంగా తానే స్వీకరించవలసిన అవసరాన్ని గుర్తించడం లేదు.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు చేసిన కరోనా టెస్టుల్లో 21 శాతం మందిలో పాజిటివ్ నిర్ధారణ అయ్యిందన్న సమాచారం ఆందోళనకరమైనది. ఇంకా పరీక్షలు జరగవలసిన కోట్లాది మందిలో ఇంకెన్ని పాజిటివ్లు బయటపడతాయో వేచి చూడాలి. ఇలా దేశమంతా ఒక మహా ఆరోగ్య విపత్తును ఎదుర్కొన్నప్పటికీ కేంద్ర పాలకులలో తగినంత చలనం లేకపోడం భయం కలిగిస్తున్నది. ఈ పరిస్థితుల్లో 12 ప్రధాన ప్రతిపక్షాలు కలిసి తక్షణ కార్యాచరణ వ్యూహాన్ని సూచిస్తూ కేంద్రానికి లేఖ రాయడం హర్షించవలసిన పరిణామం. సాధారణ సమయాల్లో పాటించే తేడాలను, విభేదాలను పక్కన బెట్టి అన్ని రాజకీయ పక్షాలు ఒక్క త్రాటి మీదికి వచ్చి ఒక్క మాట మీద నడుచుకొని పూనికతో వ్యవహరించవలసిన సమయం ఇది. ప్రతిపక్షాలు కేంద్రానికి ఇలా లేఖ రాయడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని, దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకా అందించాలని కోరుతూ ఈ నెల 3వ తేదీన ఒక లేఖ రాశాయి. తాజా ఉత్తరంపై బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్ ముఖ్యమంత్రులు, సోనియా గాంధీ, దేవెగౌడ, శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్, ఫారూక్ అబ్దుల్లా, తేజస్వియాదవ్, డి రాజా, సీతారామ్ ఏచూరి సంతకం చేశారు.

దేశంలో, అంతర్జాతీయంగా ఎక్కడ లభ్యమైతే అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వమే టీకాలను సేకరించి వాటి ఉచిత పంపిణీని సత్వరమే ప్రారంభించాలని అవి కోరాయి. దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిని బాగా పెంచడానికి తప్పనిసరి లైసెన్సింగ్ విధానాన్ని అమల్లోకి తేవాలని సూచించాయి. వ్యాక్సిన్ల కోసం బడ్జెట్లో కేటాయించిన రూ. 35 వేల కోట్లలో ఇంతవరకు రూ. 5 వేల కోట్లే ఖర్చు పెట్టారని మిగతా మొత్తాన్ని అంతటినీ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాయి. భారీ వ్యయంతో తలపెట్టిన దేశ రాజధానిలోని సెంట్రల్ విస్టా భవన సముదాయ నిర్మాణాన్ని నిలిపివేసి ఆ సొమ్మును కూడా టీకా కొనుగోలుకు మళ్లించాలని, లెక్కలు చూపని పిఎం కేర్స్ నిధిలో గల సొమ్మునంతటినీ వినియోగంలోకి తేవాలని, వ్యాక్సిన్లు, మందులపై జిఎస్టి రద్దు చేయాలని, ఉపాధులు కోల్పోయిన కుటుంబాలకు నెలకు రూ.6000 భృతి చెల్లించాలని సూచించాయి. కేంద్ర గిడ్డంగులలోని దాదాపు కోటి టన్నుల ఆహార ధాన్యాలను పేదలకు పంచాలని, కొత్త రైతు చట్టాలను రద్దు చేయాలని కోరాయి. ఈ సూచనల మీద కేంద్రం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో అమలు సాధ్యమైనవేవో, కానివేవో చర్చించవచ్చు. కాని అధికార పక్షం అహం దెబ్బతిన్నట్టు స్పష్టపడుతున్నది. అందుకే ఈ లేఖకు అటునుంచి ఎటువంటి స్పందనా లేదు. అయితే ప్రతిపక్షం జాతీయ స్థాయిలో ఇలా ఏకమై లేఖ రాయడమే సంతోషించవలసిన పరిణామం. తనకు తానుగానైనా మరింత మెరుగైన కార్యాచరణ పథకాన్ని రూపొందించుకొని దేశాన్ని ఆదుకోవలసిన అవసరాన్ని పాలక పక్షం ఇప్పటికైనా గుర్తించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News