Thursday, May 2, 2024

ఆపదలో మేధోహక్కుల ఆధిపత్యమా?

- Advertisement -
- Advertisement -

India to seek EU support on vaccine patent waiver

కరోనా మహమ్మారిని కడతేర్చడానికి కావలసిన ఆయుధం వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ తయారీకి ప్రతిబంధకమవుతున్న పేటెంట్ హక్కులను తాత్కాలికంగా ఎత్తివేయాలన్న భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ మద్దతు పలకడం ప్రపంచ ఆరోగ్య అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రమే అని చెప్పవచ్చు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లుటిఒ) ముందున్న ఈ ప్రతిపాదనకు అమెరికా పాలనాయంత్రాంగం లోని కొన్ని వర్గాలతో పాటు అనేక ధనిక దేశాల నుంచి ప్రతిఘటన ఎదురౌతోంది. కరోనా విలయంలో కూడా మేథోహక్కుల రక్షణ కావాలని ధనిక దేశాలు పట్టుపట్టడం వారి గుత్తాధిపత్యానికి పరాకాష్టగా చెప్పవచ్చు. మేథోహక్కులను తాత్కాలికంగా మాఫీ చేయాలన్న ప్రతిపాదనపై ప్రపంచ వాణిజ్య సంస్థ సమక్షంలో జూన్లో జరగనున్న చర్చకు అమెరికా ఎంతవరకు ఏకాభిప్రాయం కూడగట్టగలుగుతుందో చూడాలి. హక్కుల తాత్కాలిక ఎత్తివేతకు ఫ్రాన్స్, రష్యా మద్దతు ప్రకటించగా, జర్మనీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది వరకు ఈ ప్రతిపాదనపై డబ్లుటిఒ వద్ద చర్చ జరిగినప్పుడు దీనిపై స్పందనలో చీలిక కనిపించింది.

స్వల్ప, మధ్యాదాయ దేశాలు దీనికి మద్దతు తెల్పగా, అమెరికా, బ్రిటన్, ఐరోపా యూనియన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు వ్యతిరేకించాయి. ఈ కూటమిలో నార్వేకూడా ఇప్పుడు కొత్తగా కలియడం విచిత్రం. పేటెంట్ హక్కుల రద్దుపై దాదాపు అరవై దేశాల నుంచి ఏకాభిప్రాయం పొందగలిగినా, ఓటింగ్తో నిమిత్తం లేకుండా ఏకాభిప్రాయంపైనే డబ్లుటివొ ఆధారపడే పరిస్థితి కనిపిస్తోంది. ముందుగానే ఫార్మాక్యూటికల్ పరిశ్రమ తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ అనేక ప్రభుత్వాలతో లాబీ నిర్వహిస్తోంది. ధనిక దేశాల్లోని మితవాద రాజకీయ వర్గాలు ఫార్మా పరిశ్రమల పక్షం వహించాయి. మైక్రోసాఫ్ట్ సంస్థ సహ సంస్థాపకులు, బిలియనీర్ బిల్ గేట్స్ ఈ పేటెంట్ హక్కుల ఎత్తివేతను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య ఉపకారిగా ప్రతిష్ట పొందిన బిల్గేట్స్ వ్యక్తిగత ప్రతిష్టకు ఇది కళంకంగా విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే కరోనా కల్లోలాన్ని నిర్లక్షం వహించి పేటెంట్ హక్కులు ఎలాగైనా రక్షణ పొందుతాయని తెలుస్తోంది.

దీనికి చెబుతున్న కారణాల్లో వంచన కనిపిస్తోంది. పేటెంట్ హక్కులను రద్దు చేసి ఆయా దేశాలకు వ్యాక్సిన్ల తయారీకి అనుమతి ఇస్తే వ్యాక్సిన్ల తయారీలో ఉండాల్సిన నాణ్యత, భద్రత కొన్ని లేబొరేటరీలకే పరిమితమౌతుందని, సంబంధిత సాంకేతికతను స్వల్ప, మధ్యాదాయ దేశాలు సరిగ్గా వినియోగించుకోలేక ప్రమాదం ఏర్పడుతుందని సాకులు చూపిస్తున్నారు. ఇది ఒక విధంగా ద్రోహబుద్ధి తప్ప మరేమీకాదు. ఎందుకంటే ఫార్మా సంస్థలు ప్రపంచ మార్కెట్కు కావలసిన తమ పేటెంట్ హక్కులతో ఉన్న వ్యాక్సిన్లను తయారు చేయడానికి ఆయా దేశాల్లోని పరిశ్రమలను సబ్ కాంట్రాక్టు తీసుకుని అతి చౌకగా లభించే మానవ వనరులతో ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. ఇది ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి దారులకు కలసి వచ్చిన అదృష్టం అని చెప్పవచ్చు. వీరి పేటెంట్లకు, లాభాలకు రక్షణ ఉన్నంత కాలం వీరి ఉత్పత్తుల్లో నాణ్యత, భద్రత చాలా ఎక్కువ అన్న నమ్మకం వీరు కలిగిస్తున్నారు.

అభివృద్ధి చెందిన దేశాల్లోని పరిశ్రమలతో సబ్ కాంట్రాక్టు ద్వారా తక్కువ వ్యయంతో వ్యాక్సిన్లను బహుళజాతి కంపెనీలు తయారు చేయిస్తున్నంత కాలం ఈ అద్భుతమైన ఆధిపత్య విధానం కొన్ని సంవత్సరాల వరకు సాగుతూ ఉంటుంది. ఇది బ్రాండెడ్ ఫార్మాక్యూటికల్ ఉత్పత్తుల లోను, వినియోగదారులకు కావలసిన ఉత్పత్తుల్లోను, విలాస వంతమైన వస్తువుల తయారీ లోను ఇదే ఆనవాయితీగా వస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో పేటెంట్ హక్కులు పొందిన లైసెన్సు ఉత్పత్తి దారులకు పేటెంట్ హక్కుల ఎత్తివేతను అడ్డుకోవడం ఒక అవసరం. ఉత్పత్తి చేయాలనుకున్న కొందరి అవకాశాన్ని ఇది అడ్డగిస్తుంది. ఆ ఒప్పందాల నిబంధనలు అపారదర్శకంగా ఉంటాయి. ఉత్పతి చేసే దేశానికైనా లేదా ఇతర అభివృద్ధి దేశాల కైనా ఆయా ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్న గ్యారంటీ ఉండదు. అదీకాక వర్ధమాన దేశాలు కొవాక్స్ సౌకర్యం ద్వారా వ్యాక్సిన్లను సరఫరా చేయవలసి ఉంది. అన్ని దేశాలకు ముఖ్యంగా పేద దేశాలకు కూడా సమానంగా వ్యాక్సిన్లు పంపిణీ చేయాలన్న సదుద్దేశ్యంతో అనేక అంతర్జాతీయ సంస్థలు, ధార్మిక సంస్థలు కొవాక్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అనుకున్న లక్షం మేరకు వ్యాక్సిన్లు దీని ద్వారా పంపిణీ కావడం లేదు. ఈ కొవాక్స్ ద్వారా యావత్తు ఆఫ్రికా కన్నా అమెరికా రాష్ట్రాలకే ఎక్కువగా వ్యాక్సిన్లు అందడం గమనించ వలసి ఉంది.

వ్యాక్సిన్ల ఉత్పత్తిని చేపట్టాలనుకుంటున్న ఇతర సంస్థలకు వ్యాక్సిన్ల తయారీ సామర్ధం అదనంగా ఉందనడానికి సాక్షాలు లేవని పేటెంట్ హక్కుల ఎత్తివేతను అడ్డుకుంటున్న వర్గాలు వాదిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకముందే అనేక దేశాలకు చెందిన వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు తమ సంసిధ్ధతను వ్యక్తం చేశారు. అనుమతించిన వ్యాక్సిన్లను తయారు చేయడానికి అవకాశం కల్పించాలని ఆసక్తిని చూపించారు. ఇలాంటి సంస్థలు కెనడా, దక్షిణ కొరియాలో కూడా ఉన్నాయి. అత్యధిక ఆదాయ దేశాల్లోని సంస్థలు కూడా పేటెంట్ హక్కుల ఎత్తివేత అవకాశాన్ని వినియోగించుకోడానికి సిద్ధంగా ఉన్నాయని వివరించాయి. కానీ వాటిని ఆంక్షల వలయంలోకి ప్రవేశించనీయడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్ టెక్నాలజీ ట్రాన్సఫర్ హబ్ (సాంకేతిక బదిలీ వ్యవస్థ) ఇప్పటికే 50 సంస్థల ఆసక్తిని గ్రహించింది. మిగతా సంస్థల సామర్ధం పరిమితం అని వాదించడానికి బదులు ధనిక దేశాలు, ఇతర ధార్మిక సంస్థలు ప్రస్తుత కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోడానికి ఎక్కువ సామర్ధం పెరిగేలా ప్రోత్సహించలేరా ? అన్నది ప్రశ్న. ఈ విషయంలో భారత్ తగిన సామర్ధాన్ని సంతరించుకోవడమే కాక, ప్రపంచ ఫార్మసీగా గౌరవాన్ని పొందడం గమనార్హం.

1970 నుంచి 2005 మధ్య కాలంలో ఉత్పత్తుల పేటెంట్ నుంచి ఉత్పాదక సామర్ధ పేటెంట్ గా భారత్ ఎదగడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. ఒకవేళ పేటెంట్ మినహాయింపులను వినియోగించి సహకరించడానికి కొత్త ఫార్మా సంస్థలకు చాలాకాలం పడుతుంది కాబట్టి క్షేత్రస్థాయిలో పేటెంట్ మినహాయిపులు పనికిరానివని కొట్టివేయబడవచ్చు. ఒక పక్క వాక్సినేషన్ డ్రైవ్ చాలా మందకొడిగా సాగుతుండడం , మరో వైపు కరోనా వేరియంట్లు చెలరేగుతుండడం ఈ పరిస్థితుల్లో కరోనా కట్టడికి ఆఖరి గడువు ఎవరు నిర్ణయిస్తారు ? ఇదివరకు పేరు పొందిన చిన్న కంపెనీల వ్యాక్సిన్లతోనే 2020 లో రికార్డు సమయానికే డ్రైవ్ వేగం పెంచ గలిగితే ఆ కంపెనీలకు సాంకేతికత బదిలీ అయ్యేలా ఎవరైనా ఎందుకు మద్దతు ఇవ్వలేదు ? అలా ప్రోత్సహించి ఉంటే ఆ కంపెనీలు తయారు చేసే వ్యాక్సిన్ల సమర్ధత, భద్రత విశ్వసనీయమైన నియంత్రిత సంస్థలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సమీక్షించి ఉండేవి.

పేటెంట్ మినహాయింపులు కేవలం వ్యాక్సిన్లకే కాకుండా, డ్రగ్స్, డయాగ్నస్టిక్స్ మధ్య అనుసంధానం మరింత పెరిగేలా ఉపయోగపడతాయి. దానికి ఎంతో కాలం పట్టదన్నది వాస్తవం. బహుళ జాతి ఫార్మాసంస్థలు ప్రధానంగా చెబుతున్న సాకులు పేటెంట్ హక్కుల రక్షణకు గండి కొడితే తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని, చైనా ఇప్పుడు, భవిష్యత్తులో కూడా కాజేస్తుందని వాదిస్తున్నాయి. కానీ అసలైన జన్యుశ్రేణిని చైనా ఎప్పుడో సమీకరించుకోగలిగింది. దానివల్ల ఆయా సంస్థలు ముందుగానే వ్యాక్సిన్ల తయారీని ప్రారంభించాయి. ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడుస్తున్న యూనివర్శిటీలు, పరిశోధక సంస్థలే వ్యాక్సిన్ల తయారీకి కావలసిన మౌలిక శాస్త్రపరిజ్ఞానాన్ని అందించాయి. ప్రపంచమంతా ఆరోగ్యం, ఆర్థిక పరంగా విధ్వంసం అవుతుంటే పేటెంట్లను అంటిపెట్టుకుని ఉండడం వల్ల ఎవరికి ఎంతవరకు ఉపయోగం? ఏదైనా నూతన ఆవిష్కరణను అభివృద్ధి చేయడానికి ఆ సంస్థ లేదా పరిశ్రమను ఆర్థికంగా ప్రోత్సహించడానికి పేటెంట్ రక్షణ తప్పనిసరి అన్న వాదన బలంగా ఉంటోంది.

ఒకవేళ పేటెంట్ ఆంక్షలను పక్కన పెట్టి తప్పనిసరిగా లైసెన్సులు మంజూరు చేస్తే అసలు ఆవిష్కర్తలకు, పేటెంట్ హక్కులున్న వారికి రాయల్టీ చెల్లించ వలసి ఉంటుంది. వారు బంపర్ లాభాలు పొందక పోయినప్పటికీ ఆదాయం మాత్రం నిరంతరం పొందుతారు. ఫైజర్వ్యాక్సిన్ 2021 మొదటి మూడు నెలల్లో 3.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించ గలిగింది. ఈ ఏడాది 15 బిలియన్ డాలర్ల వరకు అమ్మకాలను పెంచుకోవాలని లక్షంగా పెట్టుకుంది. మోడెర్నా ఈ ఏడాది 18.4 బిలియన్ డాలర్ల వరకు అమ్మకాలు జరగాలని ఆశిస్తోంది. ఆయా లాభాలను రక్షించడానికి ప్రోత్సాహం (ఇన్సెంటివ్) చాలా బలంగా ఉంటోంది. ఈనేపథ్యంలో అమెరికా చొరవ తీసుకున్నప్పటికీ పేటెంట్ హక్కుల మినహాయింపు ఇవ్వడంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లుటివొ) ఏ నిర్ణయం తీసుకుంటుందో స్పష్టం కావడం లేదు.

ప్రపంచానికి ఎదురైన ఘోర విపత్తును సమష్టి గానే ఎదుర్కోగలమని ఒప్పించి బైడెన్ ఏకాభిప్రాయాన్ని సాధించగలిగితే రెండో ప్రపంచ యుధ్ధకాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్టు చూపించిన నాయకత్వంతో పోల్చదగిన నాయకత్వ పటిమగల వాడన్న పేరు సాధించ గలుగుతారు. కానీ ఆయన ఇప్పుడు అలాంటి పటిష్ట కూటమి గలిగిన స్థానంలో లేరు. అందువల్ల అభివృద్ది చెందుతున్న దేశాలు బైడెన్ సంకేతాలను బట్టి తప్పనిసరి లైసెన్సులు మంజూరు చేయడం ప్రారంభించ వలసి ఉంటుంది. పేటెంట్ హక్కుల ( టిఆర్ఐపిఎస్ ) పరిరక్షణకు సంబంధించి ప్రజారోగ్యంపై 2001 లో వెలువడిన డోహా డిక్లరేషన్ లోని అనుకూలతలు ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి దోహదపడుతున్నాయి. జాతీయ ప్రభుత్వాలు విశ్వసనీయమైన సంస్థలను ప్రోత్సహించడం అవసరం. రాత్రికి రాత్రే కంపెనీలను ఎత్తివేసే వాటికి అవకాశం ఇవ్వరాదు. ప్రపంచ ఉత్పత్తి సామర్ధాన్ని విస్తరింప చేయడానికి ధనిక దేశాలు, బహుళ జాతి సంస్థలు తగిన ఆర్థిక వనరులతోపాటు సాంకేతిక సహాయం కూడా అందించాలి. దీనివల్ల పరోపకారంతోపాటు స్వయం సేవతో జ్ఞానోదయం ప్రతిబింబిస్తుంది.
                                                                                                  కె. యాదగిరి రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News