Monday, April 29, 2024

డ్రగ్స్ కథా చిత్రమ్‌లో ఎన్నో మలుపులు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : డ్రగ్స్ కథా చిత్రంలో వినూత్న అంశాలు వెలుగు చూస్తున్నాయి. దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. సినీ ఫైనాన్షియర్ వెంకట్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సివి ఆనంద్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కేసులో ముగ్గురు నైజీరియన్‌లు అమోబి చుక్వుడి మూనాగోలు, ఇగ్బ్రావే మైఖేల్, థామస్ అనఘా కలులతో పాటు ఫిల్మ్ డైరెక్టర్ అనుగు సుశాంత్‌రెడ్డి, దేవరకొండ సురేష్‌రావు, కొల్లి రామచంద్, కూరపాటి సందీప్, పగళ్ల శ్రీకర్ కృష్ణప్రణీత్‌లను నార్కొటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు.

వీరి వద్దనుండి 50 గ్రాముల ఎండిఎంఏ, 8 గ్రాముల కొకైన్, 24 ఎస్టసి పిల్స్ 8 సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా పది లక్షల విలువైన సొత్తును స్వాధీనపర్చుకున్నారు. అరెస్టయిన ముగ్గురు నైజీరియన్లలో అమోబి చుక్వుడి మూనాగోలు మే 2020 బిజినెస్ వీసా మీద ఇండియా వచ్చాడు. బెంగళూరులో సెటిలయ్యాడు. బెంగళూరు యలహంక పుట్‌బాల్ క్లబ్ మెంబర్‌గా ఉన్నాడు. ఈజీ మనీ కోసం డ్రగ్స్ అమ్మకం ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇగ్బ్రావే మైఖేల్ 2022లో మెడికల్ వీసాపై ఢిల్లీకి వచ్చాడు. అక్కడ్నించీ బెంగళూరుకు వచ్చి అమోబి చుక్వుడి మూనాగోలుతో కలిసి స్టే చేసేవాడు.

లోకల్ నైజీరియన్ల నుంచి డ్రగ్స్ తక్కువ ధరతో డ్రగ్స్ కొనుగోలు చేసి బెంగళూరు, హైదరాబాద్‌లలో ఎక్కువ ధరకు డ్రగ్స్ అమ్మేవాడు. థామస్ అనఘా కలు 2015లో ముంబై వీసా మీద ముంబై వచ్చాడు. ఆ తర్వాత బెంగళూరులో సెటిల్ అయ్యాడు. ఈజీ మనీ కోసం డ్రగ్స్ బిజినెస్ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడిం చారు. ఇప్పటికే ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన కాపా భాస్కర్ బాలాజీ, పరారీలో ఉన్న రామ్ ఈ ముగ్గురు నైజీరియన్ల వద్దనుంచి కొకైన్, ఎస్టసి పిల్స్ కొనుగోలు చేసేవారని పోలీసులు వెల్లడించారు. అంతేకాదు, వీరిద్దరూ హైదరాబాద్‌లో తమకు తెలిసిన స్నేహితులకు డ్రగ్స్ అందించేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక పట్టుబడిన ఐదుగురు నిందితులు సైతం కాపా భాస్కర్ బాలాజీ, రామ్ వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి ఇతర వినియోగదారులకు విక్రయించేవారని సిపి సివి ఆనంద్ వెల్లడించారు.

బేబీ టీంకు నోటీసులు జారీ చేస్తాం : సిపి సివి ఆనంద్ హెచ్చరిక
అంతేకాదు ఈ డ్రగ్స్ కేసులో బేబీ సినిమా పేరు కూడా తెరపైకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో డ్రగ్స్ సరఫరా చేసిన నైజీరియన్ లను సైతం అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసులో విచారణ ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆయన బేబీ సినిమా ప్రస్తావన తీసుకువచ్చి బేబీ టీంకు నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు. బేబీ సినిమాపై సీరియస్ అయ్యారు. మాదాపూర్ అపార్ట్మెంట్లో లభ్యమైన డ్రగ్స్ కేసులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన బేబీ సినిమా పేరు తెరమీదకు వచ్చింది.

ఈ సినిమాలో డ్రగ్స్ ఏ విధంగా వాడాలో ఒక సీను ఉంటుందని, సేమ్ అలానే మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొందరు వినియోగదారులు, సినిమాలో సీన్‌ను చూసి డ్రగ్స్ తీసుకున్నారని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు. బేబీ చిత్ర యూనిట్‌కు నోటీసులు జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్‌ను ప్రోత్సహించే విధంగా సినిమాలు తీయవద్దని నటీనటులకు, దర్శకులకు, నిర్మాతలకు సిపి సివి ఆనంద్ సూచించారు. అంతేకాదు ఇకనుంచి ప్రతి సినిమా పైన నిఘా పెడతామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ స్పష్టం చేశారు.

పరారీలో నవదీప్…?
ప్రస్తుతం మాదాపూర్ డ్రగ్స్ వ్యవహారంలో కస్టమర్ గా ఉన్న హీరో నవదీప్ పరారీలో ఉన్నాడని ఆయన వెల్లడించారు. మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ ను అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

డ్రగ్స్ కథా.. కమామిషు…
గత నెల 31వ తేదీన నార్కోటిక్ విభాగం పోలీసులు గుడిమల్కాపూర్, మాదాపూర్ లో దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. మాదాపూర్ డ్రగ్స్ పార్టీని భగ్నం చేసి సినీ నిర్మాత వెంకట్‌తో పాటు మరో ఐదుగురు బాలాజీ, కె.వెంకటేశ్వర రెడ్డి, డి.మురళి,మధుబాల, మేహక్ అనే యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. బాలాజీ పై గతంలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు. డమరుకం, పూల రంగుడు, లైవ్లీ, ఆటో నగర్ సూర్య సినిమాకు ఫైనాన్సియర్ గా వెంకట్ పని చేసినట్లు గుర్తించారు. సినిమా ఫైనాన్సర్ వెంకట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పార్టీ నిర్వహణ జరగుతుందని గుర్తించి రెయిడ్ చేశారు.

వెంకట్ కదిలికలపై గత మూడు నెలలుగా నార్కోటిక్ బ్యూరో నిఘా పెట్టారు. వెంకట్ కు డ్రగ్స్ మాఫియా పై సంబంధాలు పై ఆరా తీస్తున్నారు. సినీ ఫైనాన్షియర్ వెంకట్ రత్నారెడ్డిపై తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25 కు పైగా కేసులు నమోదైనట్లుగా గుర్తించారు. గతంలో ఐఆర్‌ఎస్ అధికారినంటూ వెంకట్ మోసాలు చేశారు. నిర్మాతలు సి. కల్యాణ్, రమేష్‌ల నుంచి ఐఆర్‌ఎస్ అధికారినంటూ డబ్బులు వసూలు చేసినట్లుగా గుర్తించారు. నిర్మాతల నుంచి రూ.30 లక్షలకుపైగా కొట్టేసిన వెంకటరత్నారెడ్డి.. పెళ్లి పేరుతోనూ యువతుల్ని మోసం చేసినట్లుగా గుర్తించారు. సినిమాలో అవకాశాల పేరిట అమ్మాయిలకు వల వేస్తూ ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేస్తున్నట్లుగా గుర్తించారు.

పెళ్లి పేరుతో ఎన్‌ఆర్‌ఐ నంటూ విదేశీ యువతలను మోసం చేసిన వెంకట్ రత్నారెడ్డి.. తన అక్రమాలకు ఎపికి చెందిన ఓ ఎంపి పేరును ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే సినిమా ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీ కి డ్రగ్స్ మాఫియా తో లింకులు ఉన్నాయని పోలీసు విచారణలో బయటపడింది. తాజాగా ఈ కేసులో నార్కోటిక్స్ బ్యూరో విచారణ కొనసాగుతోంది. సినీ ఫైనాన్సర్ వెంకట్ రత్నా రెడ్డి వాట్సాప్ లో కీలక విషయాలు బట్టబయలయ్యాయి. బాలాజీ, వెంకట్ రత్నారెడ్డి కలిసి డ్రగ్స్ పార్టీలు చేసినట్లు గుర్తించారు. 18 మందికి డ్రగ్స్ ను అమ్మకాలు చేసినట్లు విచారణలో వెల్లడించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News