Sunday, April 28, 2024

ఉత్తరాదిని వణికిస్తున్న చలి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో పొగమంచుతో ఆలస్యంగా 134 విమాన, 22 రైళ్ల సర్వీస్‌లు
6 డిగ్రీలకు దిగజారిన ఉష్ణోగ్రత

న్యూఢిల్లీ : ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ ల్లో పొగమంచుతోపాటు చలిపులి గజగజలాడిస్తోంది. ఢిల్లీ నగరంలో పొగమంచుకు తోడు చలి తీవ్రత నానాటికీ పెరుగుతోంది. నగరంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గురువారం ఉదయం ఇక్కడ దృశ్యమానత (విజిబిలిటీ) 0 మీటర్లకు దిగజారింది. బుధవారం 110 విమానాలు ఆలస్యంగా నడవగా, గురువారం దాదాపు 134 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు తమ టిక్కెట్లను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా రీషెడ్యూల్ చేసుకోవచ్చని ఎయిరిండియా ప్రకటించింది. రైళ్ల సర్వీస్‌లపై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది.

సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, ప్రయాగ్ రాజ్ ఎక్స్‌ప్రెస్ తోపాటు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పాలం విమానాశ్రయంలో 25 మీటర్లు, సఫ్దార్ గంజ్‌లో 50 మీటర్ల దూరం వరకు మాత్రమే కనిపిస్తోంది. గురువారం ఢిల్లీ నగరంలో ఉష్ణోగ్రత కొన్ని చోట్ల 6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. తాజాగా సగటు నాణ్యత 351కు పడిపోయింది. ఉదయం 5.30 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్, హర్యానా, వాయువ్య రాజస్థాన్ ప్రాంతాల్లో దృశ్యమానత (విజిబిలిటీ) 25 మీటర్లు మాత్రమే ఉంటోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌ల్లో 31 వ తేదీ వరకు పొగమంచు అతి తీవ్రంగా ఉండవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాయువ్య ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్‌ను మరికొన్నాళ్లు కొనసాగిస్తున్నట్టు తెలియజేసింది. గురు, శుక్రవారాల్లో ఘజియాబాద్, అలీగఢ్ జిల్లాల్లో పాఠశాలల వేళలను అధికారులు మార్చారు. కొన్ని చోట్ల శెలవులు కూడా ప్రకటించారు. బుధవారం పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో మొట్టమొదటిసారి అత్యల్పంగా 2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. విపరీతమైన పొగమంచువల్ల దారి కనిపించకపోవడంతోప్రమాదాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం జరిగిన ప్రమాదాల్లో 8 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News