Tuesday, April 30, 2024

విజయవంతంగా ధరణి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Dharani Registrations Start in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ధరణి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయన్న దానిపై ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తొలి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ పత్రాలను మంచాల ప్రశాంతికి సిఎస్ అందచేశారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ధరణి ద్వారా రిజిస్ట్రేషన్‌లకు మంచి స్పందన ఉందన్నారు. ఉదయం 10.30 గంటలకు 946 మంది రిజిస్ట్రేషన్‌ల కోసం నగదు చెల్లించగా, 888 మంది స్లాట్ బుక్ చేసుకున్నారని ఆయన వివరించారు. అక్కడక్కగా స్వల్ప సాంకేతిక సమస్యలు మినహా రిజిస్ట్రేషన్లు విజయవంతంగా ప్రారంభమయ్యాయని సోమేష్‌కుమార్ వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయన్నారు. రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్‌ను మీ సేవ కేంద్రాల ద్వారా కేవలం రూ.200లు చెల్లించి చేసుకోవచ్చని, స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు. భూముల అమ్మకాలు, గిఫ్ట్‌సేల్ మరణించిన వారి వారసులకు రిజిస్ట్రేషన్, ఫ్యామిలీ పార్టీషన్ తదితర రిజిస్ట్రేషన్లు నేడు ప్రారంభమయ్యాయన్నారు. నాలా, పాత రిజిస్ట్రేషన్‌లు పాత మ్యుటేషన్లు, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లపై నిర్ణయాన్ని త్వరలో ముఖ్యమంత్రి ప్రకటిస్తారన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఫింగర్‌ఫ్రింట్‌లకు సంబంధించి సమస్యలు ఏర్పడితే కంటిచూపు (ఐసెట్) ద్వారా చేస్తామన్నారు.

హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో రైతులకు ధరణి సేవలు అందుబాటులోకి వచ్చాయని సిఎస్ తెలిపారు. ఇప్పటివరకు 1.48 లక్షల ఎకరాలకు సంబంధించిన 59.46 లక్షల ఖాతాలు ధరణిలో నిక్షిప్తం అయ్యాయన్నారు. ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఒకేసారి జరిగే ఈ కొత్త పద్ధతి దేశంలోనే లేదన్నారు. శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో గిఫ్ట్ డీడ్ కింద ధరణి ద్వారా తొలి రిజిస్ట్రేషన్ పత్రాలను మంచాల ప్రశాంతికి సిఎస్ అందచేశారు. మంచాల ప్రభాకర్ తన వ్యవసాయ భూమిని మంచాల ప్రశాంతికి గిప్ట్ సేల్ కింద రిజిస్ట్రేషన్ చేయగా జట్టే సైదులు, కొండా బాలిరెడ్డిలు సాక్షులుగా హాజరయ్యారు. తహసీల్దార్ జనార్ధన్ రావు డిజిటల్ సంతకంతో కూడిన రిజిస్ట్రేషన్ పత్రాలను అందచేశారు. సిఎస్ వెంట రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్‌రోస్, అడిషనల్ కలెక్టర్ హరీష్‌లు ఉన్నారు.

Dharani Registrations Start in Telangana

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News