Friday, April 26, 2024

గోదావరిపై మా ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేవరకు నదుల లింకుకు నో

- Advertisement -
- Advertisement -

Do not accept Godavari-Cauvery river connection:Harish Rao

రాష్ట్రానికి నిర్దిష్టమైన కేటాయింపులు జరిపేవరకూ
గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి అంగీకరించం
శాసనసభలో స్పష్టం చేసిన మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేంత వరకూ, రాష్ట్రానికి నిర్ధిష్టమైన నీటి కేటాయింపులు జరిపేంత వరకూ గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ఒప్పుకునేది లేదని అసెంబ్లీలో ఆర్ధిక, వైద్య-ఆరోగ్యశాఖల మంత్రి టి.హరీష్‌రావు తెగేసి చెప్పారు. గోదావరి నదిలో నీళ్ళు ఉన్నాయని కేంద్రం అంటోందని, నీళే ఉంటే తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు అనుమతులు ఇవ్వ రు? అని శాసనసభలో కేంద్రాన్ని నిలదీశారు మంత్రి హరీష్‌రావు. సోమవారం సాగునీటిశాఖ పద్దుపై జరిగిన చర్చలో మంత్రి హరీష్‌రావు సభ లో సుధీర్ఘమైన వివరణ ఇవ్వడమే కాకుండా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలకు కేంద్ర ప్రభు త్వం తెలంగాణ రాష్ట్రం పట్ల అనుసరిస్తున్న ద్వం ద్వ వైఖరులను ఎండగట్టారు.

తెలంగాణ రాష్ట్రానికి గోదావరి నదీ జలాల్లో నికర జలాల కేటాయింపులు పూర్తిచేసేంత వరకూ, తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేంత వరకూ గోదావరి-కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ఒప్పుకునేదే లేదని మంత్రి హరీష్ పునరుద్ఘాటించారు. ఇదే అంశాన్ని అయిదు రాష్ట్రాల ఉన్నతాధికారుల స మావేశంలోనూ తమ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు స్పష్టంచేశారని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా బడ్జెట్‌లో గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపడుతున్నట్లుగా ప్రకటించిందని మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలోమండిపడ్డారు. ఈ అంశంపై రాష్ట్ర బిజేపీ తమాషా చేస్తోందని, కేంద్ర బిజేపీ తమాషా చూస్తోందని మంత్రి హరీష్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని అడిగామని, ముఖ్యమంత్రి కే.సి.ఆర్.తో సహా ఎంపీలు ఎన్నోసార్లు అడిగారని, కానీ మొన్న బుందేల్‌ఖండ్, కర్ణాటక ప్రాజెక్టులకు జాతీయహోదాలు కట్టబెట్టి తెలంగాణపై అంతులేని వివక్షతను చూపారని కేంద్రంపై మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు.

రాజీవ్‌సాగర్ పేరుమార్చారని మల్లు భట్టివిక్రమార్క అంటున్నారని, కానీ మేము ప్రాజెక్టుకు దేవుళ్ళ పేర్లు పెట్టామని, వేరే పేర్లు పెట్టలేదని అన్నారు. చచ్చిపోయిన వారి వేలు ముద్రలు వేసి కాంగ్రెస్‌వారు కోర్టుల్లో కేసులు పెట్టారని, ఆధారాలతో సహా నిరూపిస్తామని మంత్రి హరీష్‌రావు సవాల్ చేశారు. కమిషన్ల కోసం, రియల్ ఎస్టేట్ కోసం ప్రాజెక్టులు కడుతున్నామన్నారు, కానీ మల్లన్నసాగర్‌కు భట్టీ వస్తానంటే తీసుకెళతానని, నీళ్ళను చూస్తే విపక్షా కడుపు నిండుతుందని అన్నారు. కాంగ్రెస్ ఒక్కటేకాదు, బీజేపీ అతీతం కాదని అన్నారు. ఈ మట్టిమీద పుట్టి తల్లికి ద్రోహం చేస్తూ కేసులు వేస్తారు, అడ్డుకుంటారు, అనుమతులు ఆపుతరు& ఇలాంటి ప్రతిపక్షాలు రాష్ట్రంలో ఉండటం బాధాకరమని మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి కే.సి.ఆర్.నాయకత్వంలో తెలంగాణకు పట్టిన ఒక్కో దరిద్రాన్ని తొలగించుకొంటూ వస్తున్నామని, కానీ కాంగ్రెస్-బిజేపీ నాయకులు భావ దారిద్య్రం మాత్రం పొతలేదని మంత్రి హరీష్‌రావు త్రీవస్థాయలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలకు నీళ్ళ రంది లేదని, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, కేసీఆర్ ఉన్నారనే ధీమా తెలంగాణ ప్రజలకు ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు.

రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం, సమగ్రాభివృద్ధిని సాధించడానికి సాంకేతికపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదటనే ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు డిజైన్‌లో సమూల మార్పులు చేయాల్సి వచ్చిందని ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేయడానికి దారితీసిన పరిస్థితులన్నింటినీ సభకు వివరించారు. ప్రాణహిత-చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగమైన తుమ్మిడిహట్టి బ్యారేజిని నిర్మించి అక్కడి నుంచి తెలంగాణ ప్రజలకు అవసరమైన తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చలేమని, తుమ్మిడిహట్టి వద్ద నీటిలభ్యత అతి తక్కువగా ఉందని, సమృద్ధిగా నీటి లభ్యత ఉన్న కాళేశ్వరం వద్దనే భారీ ప్రాజెక్టును నిర్మించుకొంటేనే ప్రజల నీటి అవసరాలు తీరుతాయని మంత్రి హరీష్‌రావు చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా, సాగునీటి రంగంలోని సాంకేతికపరమైన అంశాలపట్ల అవగాహన లేకుండా కేవలం నిందారోపణలతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. అవినీతి మురికి కూపంలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు.

పనిచేయకుండానే అంచనాలు పెంచారు ః హరీష్‌రావు

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు 2007వ సంవత్సరంలోనే 17,875 కోట్ల రూపాయలతో నిర్మించవచ్చునని జీవో ఇచ్చారని, ఏమీ పనులు చేయకుండా కేవలం 19 నెలల వ్యవధిలోనే ఆ అంచనాలను ఏకంగా 38,500 కోట్లకు పెంచారని కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేగాక ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపినప్పుడు అదే ప్రాజెక్టు వ్యయ అంచనాలను 40,300 కోట్లకు పెంచారని, ఏమీ పనులు చేయకుండానే ఎలా వ్యయ అంచనాలు పెరుగుతాయని ప్రశ్నించిన హరీష్‌రావు& అదీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర& అని ఎద్దేవా చేశారు. అందుకే అవినీతి, అక్రమాల గురించి కాంగ్రెస్‌పార్టీ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుందని అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను సరిదిద్దడం తప్పా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి బ్యారేజి స్థలం వద్ద అవసరమైనన్ని నీళ్ళు లేవని కేంద్ర ప్రభుత్వమే ఒక లేఖ ద్వారా తెలిపిందని, 160 టీ.ఎం.సీ.ల నీటి లభ్యత అక్కడ లేదని, పునరాలోచించుకోవాలని కూడా కేంద్ర జల సంఘం ఒక లేఖలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని, పై రాష్ట్రాలు వాటా నీటిని వాడుకుంటే మీకు అనుకున్నంత నీరు ఉండదని, రీ ఇంజనీరింగ్ చేసుకోవాలని కూడా కేంద్ర జల సంఘం సూచిందని కూడా మంత్రి హరీష్‌రావు వివరించారు.

మీ (కాంగ్రెస్) తప్పులను సరిదిద్దింది ముఖ్యమంత్రి కే.సి.ఆర్.అని, మీరు ఖర్చుపెట్టిన డబ్బును సద్వినియోగం చేసేందుకే రీ ఇంజనీరింగ్ చేశారని అన్నారు. తట్టెడు మట్టి తీయకుండానే ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును సమస్యల వలయంలో ఇరికించారని, ఢిల్లీలో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయని, అయినాగానీ మహారాష్ట్రతో ఈ ప్రాజెక్టుకు ఆమోదాలు తీసుకోలేకపోయారని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. నీళ్ళు ఉండే చోటుకు ప్రాజెక్టును మార్పులు చేసి నిధులను సద్వినియోగం చేసిన ఘనత ముఖ్యమంత్రి కే.సి.ఆర్.కే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 16 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును డిజైన్ చేయగా ముఖ్యమంత్రి కే.సి.ఆర్. చొరవతో కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నదీ జలాలను రికార్డుస్థాయిలో 37 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే విధంగా చేశామని మంత్రి హరీష్‌రావు వివరించాఉ. నీళ్ళను చూస్తూ కూడా కళ్ళులేని కబోదులు మాదిరిగా మాట్లాడటం మరొక పాపమని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలోని సాగునీటి రంగంలో అద్భుతాలు జరుగుతున్నాయని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల ఫలితాలకు రైతన్నలు పండిస్తున్న పంటలే నిదర్శనమని మంత్రి హరీష్‌రావు అన్నారు.

విపక్షాలు వాస్తవాలను అంగీకరించలేక దుష్ప్రచారం చేస్తున్నాయని, కాంగ్రెస్-బిజేపి పార్టీలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని అన్నారు. దేశం మన నుంచి నేర్చుకునేటంత గొప్పగా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించామని అన్నారు. స్మశాన తెలంగాణను మీరు (కాంగ్రెస్) ఆవిష్కరిస్తే& సస్యశ్యామల తెలంగాణను మేము ఆవిష్కరించామని మంత్రి హరీష్‌రావు సభకు స్గర్వంగా వివరించారు. కృష్ణానదిలో అదనపు నీటిని సాధించేందుకు కొట్లాడుతున్నామని చెప్పారు. నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలు, ఘోరాలకు ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకుల మౌనమే ప్రధాన కారణమని మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

10 జిల్లాలకు వరప్రదాయని మల్లన్నసాగర్ ః హరీష్‌రావు

తెలంగాణలోని పది జిల్లాలకు మల్లన్నసాగర్ వరప్రదాయనిగా మారిందని, ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి విపక్షాలు అనేక రకాల సమస్యలను సృష్టించినప్పటికీ వెనుకడుగు వేయలేదని మంత్రి హరీష్‌రావు సభకు వివరించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో పది జిల్లాల ప్రజల జీవన విధానం అద్భుతంగా ఉంటుందని, వ్యవసాయ ముఖచిత్రమే మారిపోతుందని మంత్రి హరీష్‌రావు సగర్వంగా చెప్పారు. కమిషన్ల బుద్దితో ఉన్నవారు, ఆ ప్రయత్నం చేసిన వారు వాటి గురించే మాట్లాడుతున్నారని, అవినీతి కూపంలో మునిగిపోయిన వారే అసెంబ్లీలో రాద్దాంతం చేస్తున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అవగాహన లేకుండా దుర్మార్గంగా మాట్లాడుతూ సభను తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో వందలాది కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తున్న గోదావరి నదిని జీవనదిలా మార్చామని, నదిలో ఏ సీజన్‌లో చూసినా నీరు నిల్వ ఉండే విధంగా ప్రాజెక్టులను నిర్మించి పర్యావరణ సమతుల్యతను పాటిస్తున్నామని అన్నారు.

ప్రాజెక్టుల నిర్మాణాలతో ఆస్తులు, భూములను కోల్పోయిన నిర్వాసితులకు నాలుగింతలుగా పరిహారం ఇచ్చి ఆదుకొన్నామని, ప్రాజెక్టుల్లో నిర్వాసితులే మొదటి లబ్దిదారుడిగా గుర్తించి ఆదుకొంటున్నామని చెప్పారు. అటవీశాఖ, విద్యుత్తు శాఖలకు నిధులను చెల్లించామని కూడా వివరించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చరిత్రలో ఎన్నడూ 14 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వలేదని, కానీ తాము ఇచ్చామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితాలను వరంగల్లు, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు అందిందా ? లేదా? అన విపక్షాలను నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో చెరువుల్లో, నదుల్లో పల్లేర్లు, తుమ్మలు మొలిస్తే టి.ఆర్.ఎస్.పార్టీ ప్రభుత్వ హయాంలో రైతన్నలు బంగారు పంటలు పండిస్తున్నారని అన్నారు. మిషన్ కాకతీయ ఒక అద్భుతమని, దీంతో పాడి పెరిగిందని, పంట పెరిగిందని, భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో పాలమూరు పొలాల్లో ఎన్నడూ నీళ్ళు పారలేదని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News