Monday, May 13, 2024

రెమ్‌డెసివర్‌లో సెలైన్ వాటర్

- Advertisement -
- Advertisement -

 వ్యాక్సిన్ పేరిట విక్రయిస్తున్న వైద్యుడు, కాంపౌండర్ అరెస్టు
 రూ.30వేల చొప్పున ఐదు నకిలీ ఇంజక్షన్ల విక్రయం
 గుర్తించి ఫిర్యాదు చేసిన కొవిడ్ బాధితుని కుటుంబం
 నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అక్రమంగా రూ.25వేలకు విక్రయిస్తూ పట్టుబడ్డ నర్సు, భర్త

Etela Rajender press meet on Corona situation

మనతెలంగాణ/హైదరాబాద్,నిజామాబాద్ ప్రతినిధి:ఖాళీ రెమిడెసివర్ బాటిల్స్‌లో సెలైన్ వాటర్ నింపి వ్యాక్సిన్‌గా విక్రయిస్తున్న ఓ వైద్యుడితో పాటు కాంపౌండర్‌ను గురువారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా బాధితుల నుంచి భారీగా నగదు తీసుకుని ఈ నకిలీ వ్యాక్సిన్ అమ్ముతున్నట్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌కు చెందిన రంజిత్ కుమార్ తన అన్నయ్య మహేశ్ బాబు కరోనా బారిన పడ్డాడు. అతడికి వ్యాక్సిన్ కోసం ఆర్మూర్‌కు చెందిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడు సాయినాథ్‌ను సంప్రదించాడు. ఆయన రెమిడిసివర్ వ్యాక్సిన్ ఇచ్చాడు. అయితే వాస్తవ రెమిడిసివర్‌కు ఇది తేడాగా ఉందని గుర్తించాడు. వెంటనే నిజామాబాద్ ఒకటవ పట్ట-ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో నకిలీ ఇంజక్షన్‌లపై పోలీసులు విచారణ చేయడంతో వారి మోసం బయటపడింది. ఆర్మూర్‌కు చెందిన ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు సాయినాథ్, మరో ఆస్పత్రి కాంపౌండర్ సతీశ్‌గౌడ్‌తో కలిసి నకిలీ రెమిడిసివర్ మందులు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. రెమిడెసివర్ ఖాళీ ఇంజెక్షన్‌లలో స్లైన్ లిక్విడ్ ఎక్కించి విక్రయిస్తున్నారని, ఒక్కో ఇంజక్షన్‌ను రూ.30 వేల చొప్పున ఐదు ఇంజెక్షన్లు విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. మందుల కొనుగోలు విషయంలో ప్రజలు జాగ్రత్తగా తీసుకోవాలని, బ్లాక్‌లో మందులు, ఇంజక్షన్లు కొనుగోలు చేయొద్దని పోలీసులు తెలిపారు.
నర్స్, ఆమె భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
తీవ్రతతో రెమిడిసివర్ ఇంజక్షన్లకు ఏర్పడిన డిమాండ్ అక్రమాలకు దారితీస్తోంది. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలోనే దందాకు తెరలేవగా ఇంటి దొంగల కారణంగా ఆసుపత్రి నిర్వహణ తీరు పై విమర్శలు వెల్లువెత్తాయి. ఓ వైపు కరోనా పేషంట్లకు అవసరమైన మేర ఇంజక్షన్‌లు అందించాలని జిల్లా యంత్రాంగం భావిస్తుంటే ఇంజక్షన్‌లకు ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలని ఆసుపత్రి సిబ్బంది భావించారు. బయటి వ్యక్తులకు రెమిడిసివర్ ఇంజక్షన్‌లు రూ.25 వేలకు విక్రయిస్తూ ఆసుపత్రి నర్సు భర్త అరుణ్ పోలీసులకు పట్టుబడ్డారు. అతన్ని అదుపులోకి తీసుకున్న నాల్గవ టౌన్ పోలీసులు ఇంజక్షన్‌లు ఎక్కడి నుండి వచ్చాయని ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది. రెమిడిసివర్ ఇంజక్షన్‌లు బయటి మార్కెట్‌లో అందుబాటులో లేకపోగా ప్రభుత్వాసుపత్రి నుండి బయట వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో అవుట్‌సోర్సింగ్ కింద పనిచేస్తున్న నర్సు శ్రావణిని, ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేయగా ఈ దందాలో ఎవరెవరి పాత్ర ఉందన్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

విలువైన ఇంజక్షన్‌లు నర్సులు విక్రయించే అవకాశం లేదని పై స్థాయిలో ఉండే సిబ్బంది సహకరిస్తే తప్ప అది వీలు కాదన్న వాదన వినిపిస్తుంది. ఎంత మందికి ఇంజక్షన్‌లు విక్రయించారన్న అంశం పైనే పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి కరోనా ఉధృతి, రోగుల సంఖ్యపెరుగుతున్న కొద్దీ రెమిడిసివర్ ఇంజక్షన్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. రెమిడిసివర్ ఇంజక్షన్ ఇస్తే ప్రాణం దక్కుతుందన్న భావనతో కొవిడ్ బాధితుల కుటుంబాలు ఎంత ధరైనా చెల్లించి ఇంజక్షన్‌లు దక్కించుకొని ప్రాణాలను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న అక్రమార్కులు పలువురు అక్రమాలకు తెరలేపుతున్నారు. ఆర్మూర్‌కు చెందిన రైతులు ఖాళీ రెమిడిసివర్ ఇంజక్షన్‌లో స్లైన్ నింపి రెమిడిసివర్ మందుగా అధిక ధరలకు విక్రయించి పోలీసులకు పట్టుపడగా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రెమిడిసివర్ ఇంజక్షన్‌ల అక్రమ దందా వెలుగు చూడడం గమనార్హం. హైదరాబాద్ సహా వివిధ నగరాల నుండి రెమిడిసివర్ ఇంజక్షన్‌ల పేరిట భారీగానే దందా సాగుతున్నట్లు తెలుస్తోంది.

Doctor arrested for selling fake Remdesivir in Nizamabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News