Tuesday, April 30, 2024

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన డా. మల్లు రవి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయిన డా. మల్లు రవి కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ డా.గౌరవ్ ఉప్పల్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి వనపర్తి ఎంఎల్‌ఎ తూడి మేఘా రెడ్డి,జడ్చర్ల ఎంఎల్‌ఎ జె. అనిరుద్ రెడ్డి , అచ్చంపేట ఎంఎల్‌ఎ డా. చిక్కుడు వంశీకృష్ణ,ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు మధు యాష్కీ గౌడ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికారప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ , జనరల్ సెక్రటరీ చరణ్ యాదవ్ , తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన పలువురు కార్యకర్తలు,అభిమానులు హాజరయ్యి డా. మల్లు రవిని అభినందించారు. ఈ సందర్భంగా మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ ‘నన్ను ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని, నమ్మకం, పనిచేసే సామర్ధ్యం గుర్తించి నాకు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు సిఎం రేవంత్ రెడ్డి ఇచ్చారన్నారు.

గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో నాలుగేళ్లు ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన అనుభవం నాకు ఉందని,ఆ అనుభవంతో కేంద్ర ప్రభుత్వంలోను మంత్రులు, అధికారులతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తో పాటు అనేక నీటి పారుదల ప్రాజెక్టులు,ఆర్ధిక,రక్షణ శాఖకు చెందిన అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నందున ప్రత్యేక ప్రతినిధిగా అనుభవజ్ఞుడైన తనకు బాధ్యతలు ఇచ్చారని ఆయన తెలిపారు. నాకు ఉద్యోగం వచ్చినట్లు అనుకోవడం లేదని, తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని ఆయన అన్నారు.

అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి సైనిక్ స్కూల్,కంటోన్మెంట్ ఏరియాలో రక్షణ శాఖ భూములు వంటి అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పరిష్కరించే దిశలో భాగంగానే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ప్రధానమంత్రిని కలిసి 15 అంశాలతో విజ్ఞాపనలు అందజేశారని తెలిపారు.ఫెడరల్ స్ఫూర్తి లో భాగంగా కేంద్రం రాష్ట్రాల అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నామన్నారు. అదే విధంగా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం మీడియా కూడా తమకు సహకరించాలని,వారి దృష్టికి వచ్చిన అంశాలను తమకు తెలపాలని కోరారు. సాధ్యమైనంత ఎక్కువ సమయం అధికారులు, మీడియాకు అందుబాటులో ఉంటానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News