Tuesday, April 30, 2024

ఆర్నాబ్‌పై ఫిర్యాదు చేసిన శివసేన ఎమ్మెల్యే ఇంటిపై ఇడి దాడులు

- Advertisement -
ED raids Shiv Sena MLA Pratap Sarnaik residence
ఇది కచ్ఛితంగా రాజకీయ కక్ష సాధింపే: సంజయ్ రౌత్
- Advertisement -

ముంబయి: సెక్యూరిటీ సర్వీసును సమకూర్చే ఒక కంపెనీపై నమోదైన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తునకు సంబంధించి శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్‌కు చెందిన కార్యాలయాలు, నివాసాలతోసహా పలు ప్రదేశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) మంగళవారం దాడులు నిర్వహించింది. కాగా, ఈ దాడులను రాజకీయ కక్షసాధింపు చర్యగా శివసేన అభివర్ణించింది. ఎవరు ఒత్తిడి చేసినా మహారాష్ట్ర ప్రభుత్వం కాని తమ నాయకులు కాని లొంగిపోయే ప్రసక్తి లేదని శివసేన స్పష్టం చేసింది. ముంబయి, పొరుగున ఉన్న థాణెలోని 10 ప్రదేశాలలో ఇడి సోదాలు నిర్వహిస్తోందని వర్గాలు తెలిపాయి. మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ సోదాలలో ఇడి అధికారులకు సిఆర్‌పిఎఫ్ సిబ్బంది సహకరిస్తున్నట్లు వర్గాలు చెప్పాయి. టాప్స్ గ్రూపు(సెక్యూరిటీ సర్వీసులు అందచేస్తున్న కంపెనీ) ప్రమోటర్లు, కొందరు రాజకీయనేతలతోసహా సంబంధిత వ్యక్తుల నివాసాలలో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు చెప్పాయి.

శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ కుమారుడు విహంగ్‌ను కూడా ఇడి అధికారులు తమ కార్యాలయానికి రప్పించుకుని విదేశాల నుంచి జరిగిన డబ్బు లావాదేవీలపై ప్రశ్నించినట్లు వర్గాలు చెప్పాయి. మహారాష్ట్ర శాసనసభలో ఓవల-మైజ్‌వాడ నియోజకవర్గానికి 56 ఏళ్ల ప్రతాప్ సర్నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన శివసేన అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నారు. రిపబ్లిక్ టివి ఎడిటర్-ఇన్-చీఫ్ ఆర్నాబ్ గోస్వామి అరెస్టుకు ఇటీవల దారితీసిన 2018 నాటి ఇంటరీయర్ డిజైనర్ ఆత్మహత్య కేసుపై తిరిగి దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వానికి లేఖ రాసింది ప్రతాప్ సర్నాయక్ కావడం గమనార్హం. ప్రస్తుతం ఆర్నాబ్ గోస్వామి జామీనుపై విడుదలైన విషయం తెలిసిందే. తన ట్వీట్ల ద్వారా మహారాష్ట్ర, ముంబయి ప్రతిష్టను అప్రతిష్ట పాల్జేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించాలని సర్నాయక్ డిమాండు కూడా చేశారు.

ఇడి దాడులు కచ్ఛితంగా రాజకీయ కక్షసాధింపులేనని శివసేన ఎంపి సంజయ్ రౌత్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఆరోపించారు. ఒక రాజకీయ పార్టీ బ్రాంచ్ ఆఫీసులుగా ఇడి లేదా ఇతర దర్యాప్తు సంస్థలు పనిచేయకూడదని ఆయన వ్యాఖ్యానించారు. సర్నాయక్ ఇంట్లో లేని సమయంలో ఇడి అధికారులు సోదాలు జరిపారని, తమకు ఎన్ని నోటీసులు జారీచేసినా సత్యమే గెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలపై మహారాష్ట్రలో ఎటువంటి నిషేధం లేదని, సాక్ష్యాలుంటే తమపైన చర్యలు తీసుకోవచ్చని కూడా ఆయన చెప్పారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వ్యక్తులను మానసికంగా హింసించాలని భావిస్తే ఆ చర్యలు ఎదురు తన్నడం ఖాయమని రౌత్ వ్యాఖ్యానించారు. ఆ సమయం సమీపిస్తోందని కూడా తాను భావిస్తున్నానని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News