Wednesday, May 8, 2024

గ్రేటర్ ఫలితాల తర్వాతే వరద సాయం

- Advertisement -
- Advertisement -

Flood relief Fund after ghmc elections results

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల ఫలితాల తర్వాతనే వరద సహాయం చేయాలని, సాయం కొనసాగింపుపై ప్రస్తుత పరిస్థితులలో స్టే ఇవ్వలేమని మంగళవారం నాడు హైకోర్టు స్పష్టం చేసింది. వరద బాధితులకు సహాయం యధావిధిగా కొనసాగించాలన్న న్యాయవాది శరత్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈక్రమంలో ప్రభుత్వంతో చర్చించకుండా వరద బాధితులకు ఇచ్చే 10,000 రూపాయల సహాయం ఆపడం రాజ్యాంగ విరుద్ధమని పిటీషనర్ శరత్ కోర్టుకు తెలిపారు. వరద బాధితులకిచ్చే సహాయం మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ కింద రాదని ఎన్నికల కమిషన్ చెప్పిన 25 గంటల వ్యవధిలోనే మాట మార్చిందని పిటిషన్‌దారు ఆరోపించారు. అంతేకాక ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే వరద బాధితుల సహాయం పథకం అమలులోకి వచ్చిందని తెలిపారు. ఈక్రమంలో వరద సాయం నిలిపివేయడం పొలిటకల్ ఎజెండా అవుతుందని శరత్ కుమార్ కోర్టుకు విన్నవించారు.

పిటిషన్‌దారు వాదనలు విన్న కోర్టు ఎన్నికలు ఉన్నాయని ముందుగానే తెలుసా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే బాధితుల అకౌంట్‌లో డబ్బులు ఎందుకు వేయలేదని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర బాడీనా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం క్రింద పనిచేయాలా అని హై కోర్టు ప్రశ్నించింది. బాధితులకు సహాయం ఆపకూడదని ఎలక్షన్ కమిషన్ కోడ్ అఫ్ కండక్ట్‌లో ఉందా అని కోర్టు ఎలక్షన్ కమిషన్‌ని ప్రశ్నించింది. కేంద్ర ఎన్నికల మోడల్ కోడ్ అఫ్ కండక్టే జిహెచ్‌ఎంసి ఎన్నికలకు కూడా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సెక్షన్ 8 ప్రకారం ‘నాట్ టు బీ పుట్ ఆన్ హోల్డ్ టిల్ ది ఎలక్షన్స్ ఆర్ హెల్డ్’ అని కమిషన్‌ను ప్రశ్నించింది. వరద బాధితుల కోసం విడుదల చేసిన ఫండ్ తప్పుదోవ పడుతుందనే ఉద్దేశంతోనే నిలిపివేశామని, కేవలం ఎన్నికల జరిగేంత వరకే దీనిని ఆపామని, తర్వాత యధావిధిగా కొనసాగించుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ కోర్టుకు విన్నవించింది.

ఎన్నికల ముందు ఈ సహాయం చేయడం వలన ఓటర్ల మీద తీవ్ర ప్రభావం పడుతుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. గత నెల 20 న ప్రారంభమైన ఈ పథకం పది రోజులు ఆపితే ఎలాంటి నష్టం లేదని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. వరద బాధితుల సహాయ పథకం కేవలం జిహెచ్‌ఎంసి వరకే పరిమితమా లేక మొత్తం రాష్టానికి వర్తింస్తుందా అని కోర్టు ఎజిని ప్రశ్నించింది. దీనిపై వచ్చే నెల 4 న కౌంటర్ ధాఖలు చేసి పూర్తి నివేదిక సమర్పించాలన్న హైకోర్టు ఆదేశించింది. 4వ తారీఖు తర్వాత డబ్బుల పంపింణీ చేయొచ్చని తెలియజేయడంతో పాటు తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 4 కు వాయిదా వేసింది.

ధరణిలో ఆస్తుల నమోదుపై నేడు విచారణ

ధరణిలో ఆస్తుల నమోదు అంశంపై హైకోర్టులో సోమవారం నాడు విచారణ జరిగింది. ధరణిలో ఆస్తుల నమోదు, ఆధార్ సేకరణ చట్టం బద్ధం కాదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ధరణిలో ఆస్తుల నమోదుపై బుధవారం మద్యాహ్నం విచారిస్తామన్న హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు చేయవద్దన్న ఉత్తర్వులను బుధవారం వరకు పొడిగించింది. తదుపరి విచారణను కోర్టు 25వ తేదీకి వాయిదా వేసింది.

Flood relief Fund after ghmc elections results

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News