Wednesday, May 1, 2024

వైరస్ గాల్లో ప్రయాణించినా, ఆందోళన అవసరం లేదు..!

- Advertisement -
- Advertisement -

Even if corona virus travel in air there is no need to worry

 

కరోనా క్రిముల వ్యాప్తిపై సిసిఎంబి ఆసక్తికర వ్యాఖ్యలు
తుంపర్లలోని కణాలు కేవలం 2 నుంచి 3 మీటర్ల లోపు మాత్రమే ప్రయాణిస్తాయి వెల్లడించిన డైరెక్టర్ రాకేశ్ మిశ్రా

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ కణాలు గాల్లో ప్రయాణించినా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిసిఎంబి(సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ పేషెంట్లు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్లలో ఉండే కరోనా, గాలిలోని దుమ్ము కణాలతో కలసి కేవలం 2 నుంచి 3 మీటర్ల వరకు మాత్రమే ప్రయాణిస్తున్నట్లు తమ తాజా అధ్యయనంలో వెల్లడైనట్లు ఈ సంస్థ వివరించింది. హైదరాబాద్‌లో కరోనా చికిత్స జరుగుతున్న ఆసుపత్రుల్లోనూ, కరోనా బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, తక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలి నమునాలను పరిశీలించి అధ్యయనం చేసినట్లు డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. అయితే గాలి ధారాళంగా వెళ్లేందుకు ఏర్పాట్లు లేని గదుల్లో వైరస్ ఆనవాళ్లు ఎక్కువగా ఉండగా, వెంటిలేషన్ మెరుగ్గా ఉన్న ప్రదేశాల్లో వైరస్ ఉనికి చాలా స్పల్పంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

కావున ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో వెంటిలేషన్ సక్రమంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. అయితే వ్యాప్తి చెందదని నిర్లక్షంగా మాత్రం ఉండొద్దని ఆయన కోరారు. ఈ శీతాకాలం పూర్తయ్యే వరకు మాస్కు, భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు కరోనాపై పోరాటం చేయాల్సిందేనని ఆయన చెప్పారు. ఇప్పటికే కరోనా నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన నిర్ణయాలను తీసుకుందని, రాబోయే రోజుల్లో కూడా ఇతే పద్ధతులను కొనసాగించాలని ఆయన కోరారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర వైరస్ తీవ్రత తక్కువున్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకొకపోతే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ గాలి ద్వారానూ వ్యాప్తి చెందుతున్నట్టు ఇప్పటికే అనేక దేశాల పరిశోధన సంస్థలు, పలు దేశాల శాస్త్రవేత్తలు తమ పరిశోధన వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించాయి. కానీ కరోనా గాలి ద్వారా వ్యాపిస్తున్న తీరు ఆయా దేశాల్లో ఆందోళన చెందుతున్న స్థాయిలో మాత్రం లేదని సిసిఎంబి డైరెక్టర్ డా రాకేశ్ మిశ్రా వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News