Sunday, May 12, 2024

త్వరలో బెల్ట్ షాపులు క్లోజ్…!

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా మూసివేత
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ
నేపథ్యంలో మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు
బెల్ట్ షాపులను నడిపిస్తే కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయం

హైదరాబాద్: బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ నజర్ పెట్టింది. ఈ క్రమంలోనే బెల్ట్ షాపులను మొత్తంగా బంద్ చేయాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ దిశగా వ్యూహాలను రచిస్తున్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులను బంద్ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్లుగానే రాష్ట్రంలో బెల్ట్ షాపులను బంద్ చేయించేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో మొత్తం 2,620 వైన్స్‌లతో పాటు 1,800 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి.

ఈ వైన్ షాపులకు అనుబంధంగా గ్రామాల్లో లక్షకు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం12 వేల 769 గ్రామపంచాయతీలు ఉండగా ఒక్కో గ్రామంలో 6 నుంచి 10 కి పైగా బెల్ట్ షాపులుండగా, రాష్ట్రంలో లక్షా 10 వేలకు పైగా బెల్ట్ షాపులు ఉన్నట్టు ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే బెల్ట్ షాపులను బంద్ చేయకుంటే వారిపై కేసులు పెట్టేలా ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. ఎక్సైజ్ శాఖకు సంవత్సరానికి సుమారుగా రూ.40 వేల కోట్ల ఆదాయం ఈ శాఖ ద్వారా వస్తుంది. అయితే ఈ బెల్టుషాపుల ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు.

బెల్టు షాపులంటే…
బెల్టు షాపులంటే ప్రత్యేకంగా షాపులుండవు. కిరాణా షాపులు, కల్లు దుకాణాలు, కొన్ని గ్రామాల్లో స్వీట్ షాపులు. ఇవే బెల్టు షాపులకు అడ్డా. వీటి ద్వారానే గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. వైన్ షాపుల కంటే బెల్టు షాపుల్లో అధికంగా వసూలు చేస్తారు. అయితే మండల కేంద్రానికి వెళ్లి మద్యాన్ని తెచ్చుకోలేని మద్యంప్రియులు గ్రామాల్లోని బెల్టు షాపుల్లోనే అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. బెల్టు షాపుల ద్వారా గ్రామాల్లో కుటుంబాలు ఛిద్రం అవుతున్నాయని భావించిన కాంగ్రెస్ వాటిని పూర్తిగా ఎత్తివేస్తామని ఎన్నికలకు ముందు హామీనిచ్చింది.

అటకెక్కిన తీర్మానాలు..
గ్రామాల్లో బెల్టు షాపుల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని పల్లెల్లో మహిళలు, యూత్ వింగ్స్, ప్రజలు గతంలో కాంగ్రెస్ నాయకులకు ఫిర్యాదు చేశారు. పలు గ్రామాల్లో మద్యాన్ని నిషేధిస్తున్నట్లు తీర్మానాలు కూడా చేశారు. సర్పంచ్‌తో పాటు గ్రామాల్లోని పెద్దల సహకారంతో బాండ్ పేపర్ ద్వారా సంతకాలు సేకరించి దండోరా కూడా వేయించారు. కొన్ని రోజులే ఈ తీర్మానాలు అమలయ్యాయి. ఆ తర్వాత యధావిధిగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారులే దీనికి అనధికారికంగా సిగ్నల్ ఇవ్వడం, మాములుగా దాడులు చేయడంతో మళ్లీ బెల్టుషాపులను యథేచ్ఛగా నడుపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News