Tuesday, April 30, 2024

టిఎస్ ఆర్టీసి కార్గో, పార్శిల్ సేవలు విస్తరింపు

- Advertisement -
- Advertisement -

Expansion of TSRTC Cargo and Parcel Services

వినియోగదారులకు మరింత చేరవయ్యేందుకు ఆర్టీసి సంస్కరణలు
పార్శిల్స్ పికప్ కౌంటర్ల దూరాన్ని తగ్గించే ప్రయత్నం
ఈ నెల 6వ తేదీ నుంచి ఈ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు
ఆర్టీసి చైర్మన్, వైస్ చైర్మన్‌ల వెల్లడి

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజా రవాణా రంగంలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఆర్టీసి సంస్థ కార్గో, పార్శిల్ సేవలతో వినియోగదారులకు మరింత చేరువయ్యింది. ఈ సేవలను వినియోగదారులను మరింత చేరువ చేసే దిశగా టిఎస్ ఆర్టీసి వ్యూహారచన చేస్తోంది. సంస్థకు ఆర్థిక వనరుగా మారిన ఈ సేవలను మరింత విస్తరించే ఆలోచనతో ఆర్టీసి అడుగు ముందుకేస్తోంది. ఈ క్రమంలో పార్శిల్స్ పికప్ కౌంటర్ల దూరాన్ని తగ్గిస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ సేవలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే, వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్, ఐపిఎస్‌లు వెల్లడించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన పార్శిల్స్‌ను ఎంజిబిఎస్ లేదా జెబిఎస్ నుంచి పికప్ చేసుకొని వినియోగదారుల సమీప కౌంటర్ల వరకు పార్సిల్స్‌ను ఆర్టీసి చేర్చుతుంది. ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినందుకు 10 కేజీల లోపు పార్శిల్‌కు రూ.30లు, 10 కేజీలపైన ఉన్న పార్శిల్‌కు రూ.50 వసూలు చేయనున్నట్టు ఆర్టీసి చైర్మన్, ఎండిలు తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ రీజియన్ పరిధిలో 25 స్థలాల గుర్తింపు

వినియోగదారుల చెంతవరకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి గ్రేటర్ హైదరాబాద్ రీజియన్ పరిధిలో 25 స్థలాలను గుర్తించినట్లు, ఈ కౌంటర్లు సోమవారం నుంచి పని చేయనున్నట్టు వారు పేర్కొన్నారు. రైతుబజార్, హెచ్‌సియూ, కోఠి, ఆటోనగర్, హయతనగర్, కాచిగూడ, సిబిఎస్, ముషీరాబాద్, ఉప్పల్ క్రాస్‌రోడ్, ఉప్పల్ బస్టాండ్‌తో పాటు సికింద్రాబాద్ రీజయన్‌లో పటాన్‌చెరు, కూకట్‌పల్లి, చెర్లపల్లి, మేడిపల్లి, హకీంపేట, కుషాయిగూడ, మేడ్చల్, జెబిఎస్, జీడిమెట్ల, రాణిగంజ్, మానిక్‌చంద్ పాయింట్, జగద్గిరిగుట్ట, జెఎన్‌టియూ, కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు, కెపిహెచ్‌బి ఏసి బస్టాప్ కౌంటర్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్టు వారు తెలిపారు. ప్రస్తుతం వివిధ జిల్లాలో ఆర్టీసి, అధీకృత ఏజెంట్లు బుక్ చేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ పార్శిల్స్ ఎంజిబిఎస్, జెబిఎస్ వద్ద డంప్ అయ్యేవి. ఈ పార్శిల్‌ను తీసుకోవడానికి వినియోగదారులు ఇబ్బందులు పడేవారు.

ఈ ఇబ్బందులను అధిగమించడానికి ఆర్టీసి బుకింగ్ కౌంటర్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచామని ఆర్టీసి చైర్మన్, వైస్‌చైర్మన్‌లు తెలిపారు. వివిధ కౌంటర్లలో బుక్ చేసిన పార్శిళ్లను 19 కార్గో బస్సుల ద్వారా సేకరించి ఎంజిబిఎస్, జెబిఎస్‌లకు రవాణా చేయనున్నట్టు వారు పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు పంపించే పార్శిల్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదని వారు తెలిపారు. వినియోగదారుల చెంత డెలివరీ పాయింట్లను తీసుకురావడంతో ఒకింత వారికి సౌలభ్యంగా ఉంటుందని, ఈ సేవలను వినియోగించుకోవాలని వారు కోరారు. ఇతర వివరాలకు టిఎస్ ఆర్టీసి కాల్ సెంటర్ 040-23450033, 040-69440000 నెంబర్‌లలో సంప్రదించాలని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News