Monday, April 29, 2024

తీరు మారని పంజాబ్

- Advertisement -
- Advertisement -

Fans angry over Punjab defeat

గెలిచే మ్యాచ్‌లో ఓడడంపై అభిమానుల ఆగ్రహం

కుంబ్లేపై విమర్శల వర్షం

దుబాయి: ఐపిఎల్ అంటేనే అనూహ్య ఫలితాలకు మరో పేరు. చివరి బంతి వరకూ ఏ జట్టు గెలుస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య పోరు సాగడం అనవాయితీగా వస్తోంది. దీనికి ప్రతి సీజన్‌లోనూ ఎక్కువ సంఖ్యలో ఫలితాలు సూపర్ ఓవర్‌కు వెళ్లడాన్ని నిదర్శనంగా చెప్పొచ్చు. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా చివరి బంతి వరకు అనూహ్య మలుపులు తిరిగింది. సునాయాసంగా గెలుస్తుందని భావించిన పంజాబ్ అంతుబట్టని రీతిలో పరాజయం పాలైంది. ఇక గెలుపుపై ఏ మాత్రం ఆశలు లేని రాజస్థాన్ ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చేతిలో 8 వికెట్లు ఉండి ఆఖరి ఓవర్‌లో విజయానికి కేవలం 4 పరుగులు మాత్రమే అవసరం ఉన్న సమయంలో పంజాబ్ ఓడి పోతుందని ఎవరూ కూడా కలలో కూడా ఊహించలేదంటే అతిశయోక్తి కాదు. అయితే అనిశ్చితికి మరో పేరుగా చెప్పుకునే ఐపిఎల్‌లో ఇలాంటి ఫలితాలు సర్వసాధారణమే అనే విషయం మరోసారి ఈ మ్యాచ్ ద్వారా మరోసారి నిరూపితమైంది.

ఇక ఆఖరి ఓవర్ వేసిన కార్తీక్ త్యాగి తన కెరీర్‌లోనే చిరకాలం తీపి జ్ఞాపకంగా నిలిచిపోయే ప్రదర్శన చేసి రాజస్థాన్‌కు సంచలన విజయం అందించాడు. కార్తీక్ బౌలింగ్‌కు దిగే సమయానికి అతని మీద తీవ్ర ఒత్తిడి నెలకొంది. అప్పటికే నికోలస్ పూరన్, మార్‌క్రామ్ దూకుడు మీదున్నారు. మరోవైపు ఆఖరి ఓవర్‌లో పంజాబ్‌కు విజయం కోసం నాలుగు పరుగులు మాత్రమే అవసరం. దీంతో రాజస్థాన్ కూడా ఓటమి ఖాయమనే ఉద్దేశంతోనే కనిపించింది. కానీ కార్తీక్ మాత్రం అసాధారణ బంతులతో చెలరేగి పోయాడు. ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసి పంజాబ్‌ను ఓటమి కోరల్లోకి నెట్టాడు. కీలక సమయంలో రెండు వికెట్లు తీయడమే కాకుండా తన జట్టు రాజస్థాన్‌కు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టాడు. ఇదిలావుండగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకున్న పంజాబ్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది.

కుంబ్లే తీరుపై విమర్శలు..

ఇక పంజాబ్ అనూహ్య పరాజయం పాలు కావడంతో అభిమానులు ఆ జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేను లక్షంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. కీలక ఆటగాడు క్రిస్ గేల్ ఈ మ్యాచ్‌కు ఎంపిక చేయక పోవడాన్ని అభిమానులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కిందటి సీజన్‌లో కూడా చాలా మ్యాచుల్లో గేల్‌ను కుంబ్లే ఎంపిక చేయలేదు. అప్పట్లో కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. తాజాగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా విధ్వంసక బ్యాట్స్‌మన్ గేల్‌ను తుది జట్టుకు దూరంగా ఉంచాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గేల్ బరిలోకి దిగి ఉంటే మ్యాచ్ ఫలితం కచ్చితంగా పంజాబ్‌కు అనుకూలంగా ఉండేదని అభిమానులు పేర్కొంటున్నారు. కుంబ్లే కావాలనే గేల్‌ను పక్కన బెట్టాడని దానికి పంజాబ్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చిందని వారు విమర్శిస్తున్నారు.

గేల్ స్థానంలో మార్‌క్రామ్, ఫబియాన్ అలెన్‌లకు అవకాశం ఇవ్వడాన్ని వారు తప్పుపడుతున్నారు. మరికొంత మంది అయితే కుంబ్లేను టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసే ముందు అతను తీసుకునే నిర్ణయాలకు పరిగణలోకి తీసుకుంటే మంచిదని మరికొందరూ సోషల్ మీడియా ద్వారా సూచిస్తున్నారు. ఇక సునిల్ గవాస్కర్, కెవిన్ పీటర్సన్ వంటి దిగ్గజాలు సయితం కుంబ్లే నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. గేల్ వంటి టి20 స్పెషలిస్ట్‌ను దూరంగా ఉంచడం ఏమాత్రం సరైన నిర్ణయం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ గేల్ బరిలోకి దిగివుంటే అలవోకగా పంజాబ్ గెలిచేదని వారు పేర్కొన్నారు. మొత్తం మీద రాజస్థాన్ చేతిలో ఓటమి పంజాబ్ ప్రధాన కోచ్ గేల్ మెడకు చుట్టుకున్నట్టే కనిపిస్తోంది. దీని నుంచి అతను ఎలా బయటపడుతాడో చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News