Saturday, April 27, 2024

ఉద్యమం ఉధృతి

- Advertisement -
- Advertisement -

నేడు రైతుల నిరాహార దీక్షలు

Farmers to Hunger Strike Tomorrow in Delhi

సోమవారం ఉ.8 నుంచి సాయంత్రం 5గం. వరకు రైతు నేతల నిరాహార దీక్షలు
అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు, డిమాండ్ నెరవేరకపోతే 19 నుంచి ఆమరణ నిరాహరా దీక్ష
ఉద్యమాన్ని నీరుగార్పించే కుట్ర జరుగుతోంది: ఢిల్లీ మీడియా గోష్టిలో రైతు నేతలు
మద్దతుగా ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ఒకరోజు నిరాహార దీక్ష
అమిత్‌షాతో వ్యవసాయ మంత్రి తోమర్ చర్చలు

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలందరూ సోమవారం ఒక రోజు నిరాహార దీక్ష చేస్తారని రైతు నాయకుడు గుర్నామ్ సింగ్ చదూని చెప్పారు. ఢిల్లీ శివార్లలోని సింఘు సరిహద్దు వద్ద ఆదివారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. సోమవారం ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నిరాహార దీక్ష ఉంటుందన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్‌కు కేంద్రం అంగీకరించని పక్షంలో ఈ నెల 14నుంచి ఆందోళనను ఉధృతం చేస్తామని రైతుసంఘాలు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం రైతు సంఘాల నేతలు ఒక రోజు నిరాహార దీక్ష చేయనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించడం జరుగుతుందని గుర్నామ్ సింగ్ చెప్పారు. అలాగే ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు కూడా యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ‘కొన్ని వర్గాలు ఆందోళనను విరమించి ప్రభుత్వం ఆమోదించిన చట్టాలకు తాము అనుకూలమని చెప్తున్నాయి. వారు మాతో లేరని స్పష్టం చేస్తున్నాను. వారు ప్రభుత్వంతో కుమ్మక్కయి మా ఉద్యమాన్ని వెన్నుపోటు పొడవాలని అనుకుంటున్నారు. రైతుల ఆందోళనను దెబ్బతీయాలని కేంద్రం కుట్ర పన్నుతోంది’ అని కూడా ఆయన చెప్పారు.

కాగా ఢిల్లీ చేరుకోకుండా రైతులను ప్రభుత్వ ఏజన్సీలు అడ్డుకుంటున్నాయని, అయినా తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగుతుందని మరో నాయకుడు శివకుమార్ కక్కాచెప్పారు. ప్రభుత్వం గనుక చర్చల కోసం మరో ప్రతిపాదన చేస్తే తమ కమిటీ దానిపై నిర్ణయం తీసుకుంటుందని మరో నాయకుడు రాకేశ్ తికాయత్ చెప్పారు. నిరసనల సమయంలో ప్రశాంతంగా ఉండాలని అందరినీ తాము కోరుతున్నట్లు కూడా ఆయన చెప్పారు. కాగా ఈ నెల 19నుంచి తలపెట్టిన ఆమరణ దీక్ష రద్దయిందని, దానికి బదులుగా పోమవారం రోజంతా ఆందోళన ఉంటుందని మరో నాయకుడు సందీప్ గిడ్డే విలేఖరుల సమావేశంలో ప్రకటించారు.
రైతుల ఆందోళనకు మద్దతుగా సిఎం కేజ్రివాల్ నిరాహార దీక్ష
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆవందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సోమవారం తాను కూడా ఒక రోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ వెల్లడించారు. ఆప్ కార్యకర్తలతో పాటుగా దేశప్రజలందరు కూడా ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా సోమవారం ఒక రోజునిరాహార దీక్ష చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం వర్చువల్ ప్రెస్‌మీట్‌లో కేజ్రివాల్ పాల్గొన్నారు. మూడు వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం తన ‘అహంకారం’ వీడాలని కేజ్రివాల్ అన్నారు. రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆ మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి గ్యారంటీ ఇస్తూ కొత్త చట్టాన్ని తీసుకు రావాలని కోరారు. మరో వైపు రైతులు చేస్తున్న ఆందోళన రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. కేంద్రం వెనక్కి తగ్గని నేపథ్యంలో సోమవారం దేశవ్యాప్త ఆందోళనకు రైతు సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్టవేసిన రైతులంతా సోమవారం ఒక రోజు నిరాహార దీక్ష చేస్తారని రైతు సంఘాల నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే.
అమిత్ షాతో తోమర్ చర్చలు
కేంద్రం తీసుకువచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పంజాబ్‌కు చెందిన మరో మంత్రి సోంప్రకాశ్‌లు ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు.కేంద్ర మంత్రుల వెంట పంజాబ్‌కు చెందిన బిజెపి నేతలు కూడా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ సమావేశంలో వారు ఏం చర్చించారో మాత్రం వెంటనే తెలియరాలేదు. ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలతో కేంద్రం జరుపుతున్న చర్చల్లో తోమర్, ప్రకాశ్‌తో పాటుగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌లు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

Farmers to Hunger Strike Tomorrow in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News