Tuesday, April 30, 2024

పీడిత జన విముక్తి సేనాని

- Advertisement -
- Advertisement -

Father Stan Swamy passed away

 

ఒకరు ప్రజల్లో సృష్టించే చైతన్య స్థాయిని బట్టే రాజ్యం ఆ వ్యక్తిపై తన సకల కుట్రలు, కుయుక్తులతో విరుచుకుపడుతుంది. ఇది భీమా కోరేగావ్ కేసులో నిందితులుగా సుదీర్ఘ నిర్బంధం అనుభవిస్తున్నవారందరికీ, అటువంటి కేసు ల్లోని ఇతరులకు వర్తిస్తుంది. 84 ఏళ్ల ముదిమి వయసులో ఈ కేసులో జైల్లో ఉంటూ సోమవారం నాడు ఆసుపత్రిలో కన్ను మూసిన ఫాదర్ స్టాన్ స్వామి వీరిలో ఒకరు. ఆయన వయో భారం గాని, తనను పీడిస్తున్న పార్కిన్‌సన్ వ్యాధిగాని ఆయన వల్ల తమకు ఎటువంటి హాని కలగబోదనే భరోసాను పాలకుల్లో, కఠినాతికఠినాత్మ అయిన రాజ్య వ్యవస్థలో అంకురింపజేయలేకపోయాయి. అయితే పాలకులు గమనించవలసిన కఠోర సత్యమేమిటంటే బతికున్నప్పటికంటే చనిపోయిన తర్వాతనే, ప్రత్యేకించి ఈ మాదిరిగా బంధిత ఆసుపత్రి పడక మీద, పాలక నిరంకుశత్వం పకడ్బందీ పర్యవేక్షణలో, న్యాయస్థానాల చెప్పనలవికాని నిర్లక్షం నీడలో మరణించిన తర్వాతనే స్టాన్ స్వామి మరింత శక్తివంతమైన చైతన్య విద్యుచ్ఛక్తిగా బలహీన, అణచివేయబడిన ప్రజా కోటి నరనరాల్లోనూ పాకుతాడు.

వారిని ఇంకా దీక్షాబద్ధులను గావించి మరింత బలవత్తరమైన పోరాటానికి సమాయత్తం చేస్తాడు. ప్రజలు అందుబాటులోని సాధనాన్ని ప్రయోగించి తమను తొక్కుతున్న ఉక్కు పాదాన్ని ఇప్పుడు ఇనుమిక్కిలి బలంతో ఓడించి తునాతునకలు చేస్తారు. అణచివేత ఎంత తీవ్రమైనదైతే తిరుగుబాటు అంతే గట్టిగా రాటుదేలుతుంది. అది ఓటు రూపంలోనూ వ్యక్తమవుతుంది, స్టాన్ స్వామికి గాని, ఇతర భీమా కోరేగావ్ నిందితులకు గాని ఆ కేసు మూలంలోని సంఘటనతో సంబంధాలు ఉండే అవకాశాల్లేవు. ఒకవేళ ఉండి ఉంటే దానిని నిరూపించడానికి ఇంత ఎక్కువ కాలం పట్టి ఉండేది కాదు. మహారాష్ట్ర సతారా జిల్లాలోని కోరేగావ్ లో 1818 జనవరి 1న ఈస్టిండియా కంపెనీ సేనలకు, పీష్వా బాజీరావ్ 2 దళాలకు మధ్య జరిగిన యుద్ధంలో మహర్ తెగ దళితులు అధికంగా ఉన్న కంపెనీ సైన్యం విజయం సాధించింది. దానిని మహర్‌ల విజయ ఘట్టంగా పరిగణించి ఏటా ఆ రోజున దళితులు అక్కడ ఉత్సవం జరుపుకోడం ఆనవాయితీగా మారింది.

2018లో అత్యధిక సంఖ్యలో దళిత చైతన్యమూర్తులు హాజరైన ఈ ఉత్సవం మీదికి బయటి వారు రాళ్లు రువ్వడంతో జరిగిన ఘర్షణల్లో ఒక యువకుడు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. ఈ ఉత్సవాలను ఎల్గార్ పరిషత్ అని పిలుస్తారు. ఎల్గార్ అంటే బిగ్గరగా చేసే ప్రకటన. మహారాష్ట్రలో పీష్వాల ఆధిపత్యం కింద దళితులు అనుభవించిన తీవ్రమైన అణచివేతను దృష్టిలో ఉంచుకొని ఈ దళిత విజయోత్సవాన్ని ఆ వర్గం వారు ఏటా ఆ రోజున సగర్వంగా జరుపుకుంటారు. 2018 నాటి భారీ జన సమీకరణ, అప్పుడు చోటు చేసుకున్న అల్లర్ల వెనుక మావోయిస్టుల హస్తమున్నదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతూ ప్రసంగాలను చేశారని, ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) కేసు నమోదు చేసి చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధ చట్టం (యుఎపిఎ ఊపా) కింద అనేక మంది మేధావులు, ఉద్యమ నేతలను అరెస్టు చేసింది. వీరిలో ప్రముఖ విప్లవ కవి వరవర రావు, న్యాయవాది సుధాభరద్వాజ, ఆనంద్ తేల్‌తుమ్డే, గౌతమ్ నవ్‌లఖా తదితరులున్నారు.

స్టాన్ స్వామిని గత ఏడాది అక్టోబర్ 7 న అరెస్టు చేశారు. తమిళనాడుకు చెందిన స్వామి ఆదివాసీల హక్కుల సాధన కోసం పోరాడే కేథలిక్ జెస్యూట్ క్రైస్తవ ఫాదర్. జార్ఖండ్‌లో 30 ఏళ్లుగా పని చేస్తూ ఆదివాసుల హక్కుల పోరాటాన్ని సునిశితం చేస్తూ వచ్చారు. ఆదివాసుల రక్షణ కోసం రాజ్యాంగం 5వ షెడ్యూల్ కింద పూర్తిగా వారి ప్రతినిధులతోనే కూడిన సలహా మండలిని ఏర్పాటు చేయకపోడాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ ప్రజోద్యమాన్ని నడిపారు. అంటే ఆదివాసుల అనుమతి లేకుండా వారి ప్రాంతాల్లోని విలువైన ఖనిజాలను అక్రమంగా తవ్వుతూ వారిని నిర్వాసితులను, నిరాధారులను చేస్తున్న పాలక దుర్మార్గాన్ని నేరుగా సవాలు చేసే స్థాయికి గిరిజనులను సమాయత్తం చేస్తూ వచ్చారు. మూడు వేల మంది గిరిజన కార్యకర్తలను, మూలవాసులను నక్సల్స్‌గా ముద్ర వేసి అరెస్టు చేయడాన్ని ప్రశ్నిస్తూ ప్రకటన విడుదల చేసిన రెండు రోజులకే స్వామిని భీమా కోరేగావ్ కేసులో అరెస్టు చేసి కఠిన నిర్బంధంలో ఉంచారు. జైల్లో కనీస మానవీయ సదుపాయాలను కూడా ఆయనకి కల్పించలేదని వార్తలు వెల్లడించాయి.

ఆ స్థితిలోని ప్రజాపక్షపాతిపై అటువంటి కేసు బనాయించి అంతటి దారుణ నిర్బంధంలో ఉంచడంలోని అన్యాయాన్ని గమనించైనా ఆయనకు న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేయకపోడం దేశంలో గల అప్రజాస్వామిక దుస్థితిని చాటుతున్నది. స్టాన్ స్వామి మరణం సహజమైనది కాదని, వ్యవస్థాగతమైనదని వచ్చిన విమర్శ కొట్టి పారవేయదగినది కాదు. కేంద్ర పాలకులు ఇప్పటికైనా ఆత్మవిమర్శకు పునరాలోచనకు పూనుకొని భీమా కోరేగావ్ కేసును ఉపసంహరించకోడం ద్వారా దేశంలో ప్రజాస్వామ్య హక్కులకు తిరిగి ఊపిరి పోయగలరని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News