Monday, April 29, 2024

సైన్స్ లేనిది ఆన్‌లైన్ అర్చనల్లేవు

- Advertisement -
- Advertisement -

Online Archana with My Mandhir

 

నిజాయితీగా దేవుడి పై విశ్వాసముంటే ఆ దేవుడు రూపొందించిన ఉపకరణాలు మాత్రమే నిత్య జీవితంలో వినియోగించుకోవాలి. మానవుడు శోధించి, సాధించినవన్నీ పక్కన పెట్టాలి! దేవుడి పేరుతో ఎన్నో వ్యాపారాలు సాగుతున్నాయన్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు కొత్త కొత్త వ్యాపారాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. అందులో ఒకటి ఆన్‌లైన్‌లో అర్చన ఇంటికి ప్రసాదం. ఇప్పుడు ఏ భక్తుడూ ఏ గుడికీ వెళ్లనక్కర లేదు. అక్కడ పూజారికి పేరు, గోత్రం చెప్పి హారతి తీసుకోనక్కర లేదు. అర్చన చేయించనక్కర లేదు. అంతా ‘స్టార్టప్ మై మందిర్’ ద్వారా చేసుకోవచ్చు. దాని సిఇఒ పేరు రాహుల్ గుప్తా.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ ఆయన స్వస్థలం. ఐఐటి ముంబైలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఎంబిఎ చేశాడు. తర్వాత పదేళ్లపాటు వివిధ స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగం చేశాడు. ‘మై మందిర్’ అనేది ఒక ఆధ్యాత్మిక మాధ్యమం. అందులో దేశంలోని దేవాలయాల్లో జరిగే పూజల వివరాలుంటాయి. ఆయా దేవాలయాల పూజారులతో వీరికి ఒప్పందం ఉంది. ఏ దేవాలయంలో కావాలంటే ఆ దేవాలయంలో అర్చనలు, పూజలు, అన్న దానాలు, ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. వీటి ధరలు రూ. ఆరు వందల నుండి పది వేల వరకు ఉంటాయి. అదనంగా జాతక చక్ర సేవలు కూడా ఉంటాయి. వంద మందికి పైగా ఆధ్యాత్మిక బోధకుల బోధనలు, భజనలు, ప్రవచనాలు, పంచాంగ శ్రవణాలు, పురాణ కాలక్షేపాలు వంటి కార్యక్రమాల్ని ఆన్‌లైన్‌లో మై మందిర్ ప్రసారం చేస్తూ ఉంటుంది. సుమారు పది భారతీయ భాషల్లో కార్యక్రమాలు నడుస్తుంటాయి. ఇందులో తెలుగు ప్రాంతాల్లోని భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో రిజిస్టరై ఉన్నారు.

ఇంతా చేసి రాహుల్ గుప్తా, తన తెలివి తేటల పన్నీరును అలా బూడిదలో ఎందుకు పోశాడో మరి? విద్య సముపార్జించాడు గాని, వివేకవంతుడు కాలేకపోయాడు. జన జీవనాన్ని మెరుగు పరిచే మరేదైనా ప్రాజెక్టుకు రూపకల్పన చేయాల్సింది. మనుషుల బలహీనతలను ఉపయోగించుకుని డబ్బు సంపాదించాలనుకున్నాడు. మూఢ విశ్వాసాల మీద, మూఢ భక్తి మీద తన బతుకు దెరువు వెతుక్కున్నాడు. దీని వల్ల హేతువాదులకు వచ్చిన నష్టమేమీ లేదు. దైవ భావనలో మునిగితేలుతున్న వారికే ఇబ్బంది. మై మందిర్.డాట్‌కామ్, దేవుణ్ణి, దేవుడి పూజల్ని అపహాస్యం చేసినట్లయ్యింది. అందుకు సంప్రదాయవాదులు, భక్తులు నొచ్చుకోవాలి. వారే ఇలాంటి వాటిని వ్యతిరేకించాలి.

దేవాలయం ఎక్కడుంటే అక్కడికి వెళ్లి, పవిత్ర స్నానాలాచరించి, పరిశుభ్రంగా, నిర్మలమైన మనసుతో ప్రత్యక్షంగా దైవ దర్శనం చేసుకుని, నిష్ఠతో పూజలు నిర్వహించుకోవాల్సిన సంప్రదాయాన్ని ఘోరంగా దెబ్బకొట్టి ఆన్‌లైన్‌లోనే పూజలు, అర్చనలు, అన్న దానాలు, గృహప్రవేశాలు నిర్వహిస్తే ఇక దేవాలయాల ప్రముఖ్యం తగ్గుతుందా? పెరుగుతుందా? దేవాలయాల ప్రాముఖ్యం తగ్గడం హేతువాదులకు సంతోషమే కాని, తోటి మానవులు మోసపోతుంటే వారు బాధపడతారు. ఆన్‌లైన్ (పూజలనే) మోసాల్ని నిర్దద్వంగా ఖండిస్తారు.

దేవుణ్ణి నిలబెట్టడానికి సైన్సే ఉపయోగపడుతూ ఉంది అనే వాదనకు తోడుగా పూజలు కూడా సైన్సు సహాయంతోనే జరుపుకోవాల్సి రావడాన్ని భక్తులు భరిస్తారా? మత విశ్వాసకులకు, వైజ్ఞానిక ప్రగతి పడని విషయం కదా? మై మందిర్ కాన్సెప్ట్ సంప్రదాయవాదులకు సౌకర్యంగా ఉందని పైకి అనిపిస్తూ ఉండొచ్చు గానీ, కాలక్రమంలో లోలోన అది దేవాలయ వ్యవస్థను దెబ్బ తీస్తుందన్నది ఆస్తికులు గ్రహించుకోవాలి. ఆన్‌లైన్‌లో ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవడం ఉంది. ఆన్‌లైన్‌లో రెస్టారెంట్‌లో టేబుల్ బుక్ చేసుకోవడం ఉంది. ఆన్‌లైన్‌లో రిసార్ట్‌లో గెస్ట్‌హౌస్ బుక్ చేసుకోవడం ఉంది. ఇలాంటి వాటితో ఆ తర్వాత స్వయంగా వెళ్లి ప్రయాణిస్తాం.

స్వయంగా వెళ్లి భోజనం చేస్తాం. స్వయంగా వెళ్లి గెస్ట్‌హౌస్‌లో గడుపుతాం. ఈ ఆన్‌లైన్ పూజ అలాంటిది కాదు. ఆన్‌లైన్‌లో అర్చన బుక్ చేస్తే, ఇంటికి కొరియర్‌లో ఇంత ప్రసాదం వస్తుంది తప్పితే, అక్కడ అర్చన చేశారో లేదో తెలియదు. భక్తుల్ని మోసం చేసి, డబ్బు లాగడమే దీని ఉద్దేశం అయినట్టు ఉంది. సైన్సును ఉపయోగించి దైవ భావనను నిలబెట్టే యత్నంలో ఇటు సైన్సు దురపయోగం అవుతోంది. అటు భక్తుల్ని దోచుకోవడమూ జరుగుతోంది. అంతా సైన్సు వల్లనే జరుగుతోంది గనక, దేవుడూ దేవుడి మహిమలు ఉట్టి భ్రమలేనన్నది తేలిపోయింది. దేవుణ్ణి టికెట్ స్థాయికి, హోటల్ స్థాయికి దిగజార్చిన ఈ సాఫ్ట్‌వేర్ నేరగాళ్లని దేవుడి భక్తులు శపించరెందుకూ? మన దేశంలో ప్రజలు లాజిక్ కంటే మేజిక్క్‌నే ఎక్కువగా నమ్ముతారు. అందుకే ఇక్కడ సైంటిస్టుల మాటల కన్నా స్వామీజీల మాటలకే విలువ ఎక్కువ. ఆ సూత్రంతోనే దేశంలో వరుసగా రెండోసారి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జనానికి సత్యం చెప్పిన యదార్థవాది శత్రువవుతాడు. ఎవరూ డబ్బివ్వరు. అబద్ధాలు బోధించే మత ప్రవక్త దైవ సమానుడవుతాడు. అతనికి దండిగా డబ్బిస్తారు.

ఈ మధ్య విదేశాల్లో ఈ పూజలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో పూజారిని బుక్ చేసుకుంటే మీరు చెప్పిన సమయానికి ఓ లగ్జరీ కార్లోంచి పూజారి దిగుతాడు. పైన లూజ్‌గా వేసుకున్న ప్యాంటూ, కోటూ విప్పి డిక్కీలో వేస్తాడు. లోన ధోవతి పైన పసుపు రంగు కండువా ముందు ఉంటాయి. ఒక కంప్యూటర్ లాంటి ఇ పూజ పరికరం తీసుకొస్తాడు. హాల్లో మధ్యన పెడతాడు. దాని చుట్టూ కుటుంబ సభ్యుల్ని కూర్చోబెడతాడు. పూజ చేసే క్రమంలో పంతులు హోమమేమైనా చేస్తారేమో మరి పొగవస్తే అలారం మోగుతుందని ఇంటావిడ హడావుడి పడుతుంది. (ఇంట్లో పొగ ఎక్కువగా వస్తే విదేశాల్లో అలారం మోగుతుంది) వారి ఆందోళన గమనించి పంతులు కంగారు పడొద్దని చెపుతాడు. “మీరు ఇ పూజ బుక్ చేసుకున్నారు కదా? పొగా గిగా ఏమీ ఉండదు.అంతా మోక్షమే!” అని చిద్విలాసంగా పైకి చూస్తాడు. కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోతారు. వారు అందులోంచి తేరుకోక ముందే పంతులు అడుగుతాడు. “మంత్రాలు నన్ను చదవమంటారా? లేక కాల్ సెంటర్‌కు ఫోన్ చెయ్యమంటారా?” అని కాల్ సెంటర్ నుండయితే మంత్రాలన్నీ అక్కణ్ణించే చదువుతారు. అని చెప్పి ఒక బటన్ నొక్కుతాడు. ఇ పూజా పరికరం మధ్యలో స్క్రీన్ మీద చిన్న మంట కనిపిస్తుంది. “చూశారుగా ఇదే మన హోమం.

ఇంతకన్నా మరేం ఉండదు. నో ఫ్లేమ్, నో స్మోక్, నో కార్బన్… ఎవ్రీ థింగ్ ఎకో ఫ్రెండ్లీ” అని ఆశ్చర్యపోయే వాళ్లందరినీ ఆశీర్వదిస్తాడు. అందరూ దాని వంక చూసే లోపు అతను మరో బటన్ నొక్కుతాడు. “శుక్లాంబరధరం విష్ణుం.. ఆ ఇప్పుడు నెయ్యి సమర్పించాలి. మీ అందరి ముందు నెయ్యి సీసాల బొమ్మలున్నాయి కదా? వాటిని టచ్ చెయ్యండి” ఆజ్యం సమర్పయామీ హోమంలో నెయ్యి వేస్తుతంటాం కదా? అదే ఇదన్న మాట. అందరూ నెయ్యి బటన్ నొక్కండి చాలు. అందరూ వారి ముందున్న నెయ్యి మీటలు నొక్కుతారు. పంతులు శుక్లాంబరధరం మరో సగం చదివి “ఇక్కడ మనం దేవుడికి కొబ్బరి కాయ కొడతాం. కంగారు పడకండి. నిజంగా కొబ్బరి కాయలేం అవసరం లే దు. అన్నీ ఈ ఇ పూజా పరికరంలోనే ఉన్నాయి” చూడండి అని పూజారి బటన్ ప్రెస్ చేయగానే అందరి ముందూ స్క్రీన్ మీద కొబ్బరి కాయలొస్తాయి. “శుక్లాంబరధరం… దేవుడికి కొబ్బరి కాయ సమర్పించాలనుకున్న వారు బటన్ నొక్కడీయ్… శుక్లాంబరధరం” అంటూ పూజారి పంతులు మరోసారి సగం శ్లోకం చదువుతాడు…. పూజా కార్యక్రమం అలా సాగుతుంది!

సైన్సును ఉపయోగించుకుని దేవుణ్ణి, పూజల్ని, వ్రతాల్ని అపహాస్యం చేసుకుంటూ మోక్షం వెతుక్కుంటున్నది భక్తులు, సంప్రదాయవాసులు మాత్రమే నాస్తికులకు, హేతువాదులకు, సైన్స్ కార్యకర్తలకు ఇలాంటి నాటకాలాడడం అవసరమే లేదు. దేవుడే ఒక భ్రమ అని అనుకునే వారు భ్రమల గురించిన భ్రమల్ని ఎలా నమ్ముతారూ? వాస్తవ జీవితంలో ఇలాంటివి జరుగుతున్నాయంటే ఏమిటీ? తమని తాము అప్‌డేట్ చేసుకుని, దైవ వ్యాపారులు సృజనాత్మకంగా జనాన్ని మోసం చేస్తున్నారని అర్థం! ప్రజలకు నిత్యావసరాలు అందించడానికో, వారి జీవన ప్రమాణాలు పెంచడానికో సైన్సును ఉపయోగించుకుంటే అది, జనులందరు హర్షించదగ్గ విషయమయ్యేది. దేశాన్ని ఎంత డిజిటల్ ఇండియా చేసినా ఆహారం గుగూల్ నుండి డౌన్‌లోడ్ చేసుకోలేం. వాన కురవాలి, నారు పోయాలి, రైతుకు చెమట పట్టాలి. ఒక తిండి గింజ పండించలేని మంత్రాలు, పూజలు, ప్రేయర్లు, మంత్రాలు మన జీవితాల్ని మారుస్తాయని ఎలా నమ్ముదాం? మత విశ్వాసాలేవీ విజ్ఞానం పెంచలేవు. అవునా కాదా? అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి!

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News