Sunday, April 28, 2024

జ్వరాలపై నిర్లక్ష్యం వహించవద్దు..!

- Advertisement -
- Advertisement -

ముసురు వాతావరణానికి విజృంభించనున్న వ్యాధులు
క్రమంగా నమోదవుతున్న విషజ్వరాలు
అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ హెచ్చరిక
అదనపు కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం
ఎపిడమిక్ కంట్రోల్ నెంబరు 040-24651119 ప్రకటించిన అధికారులు

Fever session start in rainy
మన తెలంగాణ/హైదరాబాద్: జ్వరాలపై ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్షం వహించవద్దని ప్రభుత్వం సీజనల్ అలెర్ట్ ప్రకటించింది. వర్షకాల నేపథ్యంలో రోజురోజుకీ వాతావరణ పరిస్థితులు క్రమంగా మారిపోతున్నాయి. ఈక్రమంలో సీజనల్ వ్యాధులు మరింత విజృంభించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముసురు వాతావరణానికి విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో డెంగ్యూ, ప్లూ, టైపాయిడ్, మలేరియా వంటి విషజ్వరాల కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే కరోనా నివారణ చర్యలతో రెండేళ్లతో పోల్చితే సీజనల్ వ్యాధులు సుమారు 75 శాతం తగ్గాయి.

కానీ నిర్లక్షం వహిస్తే ప్రమాదమని పబ్లిక్ హెల్త్ స్పెషలిస్టులు చెబుతున్నారు. దీంతో ఈ మూడు నెలలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ హెచ్చరించింది. అంతేగాక జూన్ నుంచి అక్టోబరు, నవంబరు నుంచి మార్చి, ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రత్యేక కేటగిరీలుగా విజభించి అధికారులు యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. వీటిని సమర్ధవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం అదనపు కలెక్టర్లకు బాధ్యత అప్పగించింది.

ఈ పరిస్థితుల్లోనే వ్యాప్తి అధికం….

సాధారణంగా వైరస్‌లు, బ్యాక్టీరియాలు శీతల వాతావరణానికి వాటి వ్యాప్తిని పెంచుకుంటూ వెళ్తాయి. మిగతా రోజుల కంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ నెలల్లో వర్షాలు కారణంగా మురికివాడలు, ఇతర గుంటల్లో నీరు నిండి దోమలు వృద్ధి చెందుతాయి. అయితే దోమలతో మలేరియా, డెంగ్యూ వస్తుండగా, కలుషితమైన నీటితో టైపాయిడ్, డయేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అంతేగాక స్వైన్ ప్లూ వంటి ప్రమాదకరమైన విషజ్వరం కూడా సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభమవుతుందని వైద్యులు తెలిపారు.

అయితే ఒక వైపు కొవిడ్, మరోవైపు సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు సర్కార్ పూర్తిస్థాయిలో సన్నాహాలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఆయా వ్యాధులకు సంబంధించిన మందులను అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచింది. సీజనల్, కొవిడ్ లక్షణాలు ఇంచుమించు ఒకేతీరు ఉండటంతో వ్యాధులను గుర్తించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఆసుపత్రుల్లో, ల్యాబ్‌లలో కొవిడ్, నాన్‌కోవిడ్ వేర్వేరు సెక్టార్‌లుగా విభజించి పరీక్షలు చేస్తున్నారు. అవసరమైన వారికి మందులు ఇస్తూ 14 రోజులు విడిగా ఉండాలని పేషెంట్లకు సూచిస్తున్నారు.

లక్షణాలు ఉన్నవారందరికీ యాంటీజెన్‌లు….

చాలా మంది దగ్గు, జ్వరం, నీరసం వంటి లక్షణాలు తేలగానే, కొవిడ్ అనే భావనతో కంగారు పడుతున్నారు. దీంతో వారి ఆరోగ్య పరిస్థితి మరింత విషమిస్తుంది. ఈక్రమంలో లక్షణాలు ఉన్న వారందరికీ యాంటీజెన్ టెస్టులు చేయాలని సర్కార్ అదేశాలు జారీ చేసింది. కరోనా టెస్టులు అనంతరం ఇతర టెస్టులు చేసి వ్యాధి నిర్ధారణ వేగంగా చేయాలని వైద్యశాఖ అన్ని ఆసుపత్రులకు సూచించింది. అనంతరం వారికి చికిత్స అందిస్తూ వ్యాధి తగ్గే వరకు మానిటరింగ్ చేయాలని హెల్త్ డైరెక్టర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా గ్రామీణా ప్రాంతాల్లో ఆశావర్కర్లు, ఎఎన్‌ఎమ్‌లు ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వే చేస్తూ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. లక్షణాలు ఉన్న వారందరికీ ఐసొలేట్ అయ్యేలా సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. విషజ్వరాలు ఉన్నవారు కూడా ఐసొలేట్‌గా ఉంటే బెటర్ అన్నారు. కొవిడ్ తేలితే వారితో పాటు కుటంబ సభ్యులను కూడా నిత్యం పర్యవేక్షించాలని డిహెచ్ తెలిపారు.

రుచి, వాసన తెలియకపోవడం ప్రధానం….

దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులు, విరేచనాలు వంటి లక్షణాలు సీజనల్ వ్యాధులతో పాటు కొవిడ్‌లోనూ కనిపిస్తాయి. ఈక్రమంలో సింప్టమ్స్ తేలగానే కొవిడ్ అనే ఫోబియాకు గురై మనోధైర్యాన్ని కోల్పోవద్దని నిపుణులు పేర్కొంటున్నారు. కొవిడ్ వైరస్ సోకితే ఈ లక్షణాలతో పాటు రుచి, వాసన లేకపోవడాన్ని ప్రధానంగా గుర్తించాల్సిన అవసరం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఎలాంటి లక్షణాలు ఉన్నా, వెంటనే పిహెచ్‌సిలకు వెళ్లి యాంటీజెన్ టెస్టు ద్వారా మొదట కరోనాను నిర్ధారించుకోవాలని, ఆ తర్వాత మిగతా పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు.

కరోనాతో పాటు ప్రధానంగా ప్రభుత్వం ఫోకస్ చేసిన వ్యాధులు…
వెక్టార్ బోర్న్…మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా
వాటర్‌బోర్న్…థైరాయిడ్, డయారియా
ఎయిర్‌బోర్న్.. ఇన్‌ప్లూయెంజా, న్యూమోనియాతో పాటు సీజనల్ జ్వరాలు, పాముకాట్లు.
నివారణ కార్యక్రమాలు…

ప్రతి శుక్రవారం ‘డ్రై’ డే నిర్వహించనున్నారు. వేడి నీళ్లు, ఆహారంపై అవగాహన కల్పించనున్నారు. అంతేగాక మాస్కు, భౌతికదూరం, శానిటేషన్ వంటి ప్రాధాన్యతలను వివరించనున్నారు. దీంతో పాటు డోర్ టు డోర్ ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్లు, డ్రైనేజీ మరమ్మత్తులు, నీటి నిల్వ లేకుండా తొలగించనున్నారు. ఈ మేరకు పంచాయితీ రాజ్, మున్సిపల్, అధికారులను సమన్వయం చేయనున్నారు. ప్రభుత్వం నుంచి సరఫరా అవుతున్న మిషన్ భగీరథ నీటిని క్లోరినేషన్ చేయడం, ట్యాంక్‌లను శుభ్రం చేయనున్నారు.

వైద్యశాఖ యాక్షన్ ప్లాన్…

ఇంటింటికి తిరిగి లక్షణాలున్నోళ్లందరికీ కిట్లు ఇవ్వనున్నారు. కరోనాతో పాటు మలేరియా, డెంగ్యూ, స్వైన్ ప్లూ వంటి విషజ్వరాల నిర్ధారణకు ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నారు.దీంతో పాటు గ్రామాల్లో హెల్త్ క్యాంపులు, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫీవర్ ఓపి, కరోనాకు ప్రత్యేక బెడ్లు, ప్రతి రోగానికి సరిపడా మందులను నిల్వ చేయడం, పాముకాట్లు మందులను స్టాక్ చేయడం జరుగుతుంది. అంతేగాక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలోనే ఆక్సిజన్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచనున్నారు. దీంతో పాటు సీజనల్, కరోనాపై సలహాలు, సూచనలు, ఇతర సహాయం కొరకు ఎపిడమిక్ కంట్రోల్ నెంబరు 040-24651119ను సంప్రదించాలని అధికారులు ప్రకటించారు.

కరోనా, సీజనల్‌కు వేర్వేరు ఏర్పాట్లు చేశాంః పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు

రాష్ట్రంలో కరోనా, సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. ఆశాలు, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇస్తున్నాం. జ్వరం, ఇతర ఏ వ్యాధి లక్షణాలున్నా వెంటనే స్థానిక పిహెచ్‌కి వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి. ఆలస్యం చేసి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News