Sunday, May 5, 2024

బిసిసిఐకి కాసుల పంట

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ ద్వారా రూ. 4వేల కోట్ల ఆదాయం
కోశాధికారి అరుణ్ ధుమల్

Four thousand crores profit in IPL

న్యూఢిల్లీ: ఇటీవలే యూఎఇ వేదికగా నిర్వహించిన క్యాచ్ రిచ్ ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)పై కాసుల వర్షం కురిపించింది. ఐపిఎల్ సీజన్13 ద్వారా బిసిసిఐ దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ విషయాన్ని బిసిసిఐ కోశాధికారి అరుణ్ ధుమల్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. కిందటి ఏడాది పోల్చితే ఈసారి అధిక లాభం వచ్చిందని ధుమల్ వివరించారు. ఓ జాతీయ వార్త సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు. కరోనా కష్ట కాలంలోనూ కూడా ఐపిఎల్ ద్వారా బిసిసిఐ వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించడంపై ధుమల్ ఆనందం వ్యక్తం చేశారు.

అందరి కృషి, సహకారం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఐపిఎల్ విజయవం అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మరి విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది అసలు ఐపిఎల్ జరగడమే కష్టమనిపించింది. అయితే బిసిసిఐ ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు, ఐపిఎల్ ఫ్రాంచైజీ యాజమాన్యాల సహకారం వల్లే టోర్నమెంట్ విజయవంతమైంది. అందువల్లే బిసిసిఐకి కళ్లు చెదిరే ఆదాయం లభించిందన్నారు. ఇది తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని ధుమల్ పేర్కొన్నారు. ఈసారి టివి వ్యూయర్‌షిప్ కూడా 25 శాతం పెరిగిందన్నారు. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో ఐపిఎల్ నిర్వహణకు బిసిసిఐ మొగ్గు చూపడంపై ఆరంభంలో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు.

అయితే బిసిసిఐ మాత్రం ధైర్యంతో ముందడుగు వేసి సక్సెస్ అయ్యిందన్నారు. ఐపిఎల్ విజయవం కావడంలో అందరి పాత్ర ఉందన్నారు. బిసిసిఐ ఒక్కదాని వల్లే టోర్నీ సక్సెస్ కాలేదనే విషయాన్ని గుర్తుంచు కోవాలన్నారు. భారత్‌తో సహా విదేశీ క్రికెటర్లు కూడా ఎలాంటి భయం లేకుండా ఐపిఎల్ బరిలోకి దిగారని, అంతేగాక ఎమిరేట్స్ బోర్డు పకడ్బంధీ ఏర్పాట్లతో టోర్నీ సజావుగా సాగేలా చేసిందన్నారు. టోర్నీ ఆరంభానికి ముందు తమకు కూడా ఓ రకమైన ఆందోళన ఉండేదన్నారు. పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడడంతో టోర్నీ సజావుగా సాగుతుందా లేదా అనుమానం నెలకొందన్నారు. అయితే ముంబైచెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు అనూహ్య స్పందన రావడంతో తామంతా ఊపిరి పీల్చుకున్నామని ధుమల్ వివరించారు. ఇక కిందటి సారితో పోల్చితే తమకు 35 శాతం మేర నిర్వహణ ఖర్చు తగ్గిందన్నారు. ఇది కూడా భారీ ఆదాయం లభించడంలో ముఖ్య భూమిక పోషించిందన్నారు. ఇక ఐపిఎల్ ద్వారా భారీ మొత్తంలో ఆదాయం దక్కడంతో తమ ఆర్థిక కష్టాలన్నీ తీరి పోయాయని, రానున్న రోజుల్లో క్రికెటర్లకు వేతనాలు చెల్లించడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని కోశాధికారి అరుణ్ ధుమల్ ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News