Sunday, April 28, 2024

ఇది హైదరాబాద్‌కే ఐకాన్: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం
త్వరలోనే కల సాకారం అవుతుంది
ప్రజలందరూ భాగస్వాములు కావాలి
పాలిటిక్స్‌లో క్లాస్, మాస్‌లకు మంత్రి కెటిఆర్ చేరువ
సుమతో మంత్రి కెటిఆర్ ప్రత్యేక ఇంటర్వూ

Suma kanakala interview with KTR
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. ఆ కల కూడా త్వరలోనే సాకారమవుతుంది. ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. అప్పుడే మనం కలలుగన్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. సిఎం కెసిఆర్ తీసుకొచ్చిన సంస్కరణలతో హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. గూగుల్, ఆమెజాన్, యాపిల్, పేస్‌బుక్ లాంటి దిగ్గజం సంస్థలు ముందుకొస్తున్నాయి. రానున్న రోజుల్లో కమాండ్ కంట్రోల్ రూం హైదరాబాద్‌కు ఐకాన్‌గా మారనుంది. ఆరేళ్లలో రాష్ట్రంతో పాటు హైదరాబాద్ అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌గా దూసుకుపోతుంది. ఇదే విజన్‌తో ముందుకెళ్లి ప్రపంచంలోనే హైదరాబాద్‌కు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తాం. ఇలా అన్ని ప్రత్యేక అంశాలతో యాంకర్ సుమకు ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి కెటిఆర్ ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఈ ఇంటర్వూ లో మంత్రి కెటిఆర్ పర్సనల్ లైఫ్‌తో పాటు రాజకీయ అంశాలపై మాట్లాడారు.

మొదటిసారిగా మాస్క్ లేకుండా ఇంటర్వూ ఇస్తున్నా

మొదటిసారిగా మాస్క్ లేకుండా ఇంటర్వూ ఇస్తున్నాను. ఒకవేళ నాకు కోవిడ్ వస్తే ఎలా అని మంత్రి కెటిఆర్ సుమతో పేర్కొనగా తనకు కోవిడ్ వచ్చే చాన్స్ లేదని సుమ నవ్వుతూ బదులిచ్చారు. నావల్ల వేరే వాళ్లకి యాంకరింగ్ వచ్చే అవకాశం ఉందని కోవిడ్ మాత్రం రాదని సుమ బదులిచ్చారు.

ఇడ్లీ, దోశలే తింటాను…. బంగారం వెండి తినను

మీకు ఇంత శక్తి ఎలా వస్తుంది. మీరు ఏమి తింటారని సుమ అడగ్గా ఏదీ ఉంటే అది తింటాను. ఇడ్లీ, దోశ కాకుండా బంగారం వెండి తినను అంటూ మంత్రి కెటిఆర్ నవ్వుతూ సమాధానమిచ్చారు. మీరు తక్కువ మాట్లాడడం మిగతా వాళ్లు ఎక్కువ మాట్లాడడం ఇదే మొదటిసారని మంత్రి కెటిఆర్ సుమను ఉద్ధేశించి పేర్కొనగా ఈ విషయం గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని సుమ చమత్కరించారు.

పలు ప్రశ్నలకు చమత్కారంగా

సినిమాల్లో హీరోలు క్లాస్‌ను, మాస్‌ను మెప్పించేలా సినిమాలు తీస్తే, పాలిటిక్స్‌లో క్లాస్, మాస్‌లకు దగ్గరవుతూనే అభివృద్ధిని చేసి చూపిస్తున్నారని సుమ అడిగిన పలు ప్రశ్నలకు చమత్కారంగా, సరదాగా సమాధానాలిస్తూ ఇంటర్వూను మంత్రి కెటిఆర్ పూర్తి చేశారు. ఈ ఇంటర్వూకు సంబంధించిన వివరాలు వారి మాటల్లోనే….

ఇది హైదరాబాద్‌కే ఐకాన్

బంజారాహిల్స్‌లో నిర్మించే కమాండ్ కంట్రోల్ రూంను భారతదేశంలో ఎక్కడా ఇలాంటి కట్టడం లేని విధంగా నిర్మిస్తున్నాం. దీనిని రెండునెలల్లో ప్రారంభిస్తాం. ఇది హైదరాబాద్‌కే ఐకాన్ నిలవనుంది. 5 లక్షల సిసి కెమెరాలను రెట్టింపు చేసి హైదరాబాద్ వీధి, వీధిలో కెమెరాలను రెట్టింపు చేసి ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలని కృతనిశ్చయంతో ముందుకెళుతున్నాం.

ప్రతిఒక్కరికీ భద్రత కల్పించాలన్న ఉద్ధేశ్యంతో ముందుకు

వృద్ధులు, పిల్లలు, మహిళలు హైదరాబాద్‌లో నివాసం ఉండే ప్రతిఒక్కరికీ భద్రత కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్ధేశ్యంతో ముందుకెళుతున్నాం. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే హైదరాబాద్‌లో చైన్‌స్నాచింగ్‌లు తగ్గాయి. చైన్‌స్నాచింగ్ చేయాలనుకునే ప్రతిఒక్కరూ బయపడుతున్నారు. వీటితో పాటు పేకాటక్లబ్‌లు లేవు. గుడుంబా గబ్బులు లేవు. పోకిరీల ఆగడాలు చెక్ పెట్టాం. మతకల్లోలాలకు ఫుల్‌స్టాప్ పెట్టాం. బాంబ్ బ్లాస్ట్‌లు లేవు. తాను చిన్నప్పుడు వీటిని చూశాను. అందుకే వీటి నియంత్రణపై ముందునుంచే దృష్టిసారించాం. ఈ ఆరేళ్లుగా హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది.

సిఎం కెసిఆర్ నిర్ణయాలతో పెట్టుబడులకు స్వర్గధామం

రాష్ట్రం ఏర్పడగానే సిఎం కెసిఆర్ ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు నేడు పెట్టుబడులకు స్వర్గధామంగా మారాయి. పెట్టుబడులు పెట్టేవాడు అన్నీ చూశాకే పెట్టుబడులు పెడతాడు. అందుకే గూగుల్, ఆమెజాన్, యాపిల్, పేస్‌బుక్ లాంటి దిగ్గజం సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి.

హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా 16వ ర్యాంకు

ప్రపంచంలో ఏ నగరం సురక్షితమని కంపారీటెక్ అనే సంస్థ సర్వే చేయగా 5 లక్షల సిసి కెమెరాలతో హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా 16వ ర్యాంకు సాధించగా, దేశవ్యాప్తంగా చూసుకుంటే నెంబర్‌వన్ ర్యాంక్ సాధించింది. అందుకే టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్నాం. హాకాయి లాంటి టెక్నాలజీతో మరిన్ని అద్భుతాలు సాధిస్తాం. ఈ మధ్య సైబరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్‌ను ప్రారంభించాం. అక్కడ ఒకేసారి 15 వేల కెమెరాల ఫీడ్‌ను స్క్రీన్ మీద చూడవచ్చు. ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఆపదలో ఉన్న వారి నుంచి సందేశం రాగానే పక్కనే ఉన్న పోలీస్‌స్టేషన్ నుంచి డ్రోన్ వెళ్లేలా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నాం.

పోకిరీల ఆటకట్టిస్తున్న షీ టీమ్స్

రాష్ట్రం ఏర్పడగానే మహిళల భద్రత నిమిత్తం సిఎం కెసిఆర్ మహిళా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి చర్యలు చేపడితే మహిళలకు రక్షణ లభిస్తుందో వారి సూచనలు, సలహాలు తీసుకున్నారు. అందులో భాగంగానే షీ టీమ్స్ లాంటి వాటిని ఏర్పాటు చేయడంతో మహిళలకు భద్రత కల్పించగలిగాం. ఒక సామాన్యుడు ఫోన్ చేస్తే రెండు గంటల్లో షీ టీమ్స్ స్పందించడంతో పాటు పోకిరీల ఆటకట్టిస్తున్నాయి.

ప్రియాంకరెడ్డి కుటుంబసభ్యులకు న్యాయం జరిగిందా?

ప్రియాంకరెడ్డి జరిగిన అన్యాయం మిగతా అమ్మాయిలకు జరగకుండా చర్యలు చేపడుతున్నాం. నాలుగు రోజుల తరువాత ప్రియాంకరెడ్డి కుటుంబసభ్యులకు న్యాయం జరిగినా, దీనిపై మానవహక్కుల సభ్యులు ఏమి అనుకున్నా, ఆమె కుటుంబసభ్యులకు మాత్రం న్యాయం జరిగింది. రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఆపదలో ఉన్నవారు ఎస్‌ఓఎస్ బటన్ నొక్కగానే ఆ ప్రాంతానికి పోలీస్ డ్రోన్ రావడంతో పాటు సైరన్ మోగేలా నూతన విధానానికి శ్రీకారం చుడుతున్నాం.

అమ్మాయిలపై వేధింపులు జరగకుండా మగపిల్లలకు అవగాహన కల్పించాలి

అమ్మాయిలపై వేధింపులు జరగకుండా ప్రతి ఇంట్లోని మగపిల్లలకు వారి వారి తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి. అమ్మాయిలను, మహిళలను ఎలా గౌరవించాలన్న దానిపై పుస్తకాల్లో పాఠ్యాంశంగా తీసుకొచ్చాం. అందులో భాగంగా సిటీ బస్సుల్లో మహిళలకు, మగవారికి వేర్వేరుగా సీట్లను కేటాయించేలా గతంలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టాం. ఒక్క మహిళలకే కాదు, అందరికీ రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సిటీ మనకు అన్నం పెడుతుంది. దీనిని మనం ఖరాబ్ చేసుకుంటే తెలంగాణ దెబ్బతింటుంది.

మా అమ్మ, మా భార్య ఇద్దరూ సుమ అభిమానులే….

మా అమ్మ, మా భార్య ఇద్దరూ కూడా మీ అభిమానులే. మళయాళీ అమ్మాయి అయినా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారని సుమ ఉద్ధేశించి మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. తాను పుట్టింది కేరళ అయినా పెరిగింది మాత్రం హైదరాబాద్.

ఈ మధ్య 50 మళయాలం సినిమాలు చూశా

ఈ మధ్య 50 మళయాలం సినిమాలు చూశా. చాలా అద్భుతంగా ఉన్నాయని మంత్రి కెటిఆర్ పేర్కొనగా, మీకు అంత టైం ఎక్కడిదని సుమ ప్రశ్నించారు. ఇంటికి వెళ్లగానే ఖాళీగా ఉన్న సమయంలో సినిమాలు చూడడానికి సమయం కేటాయించాను. క్వాలిటీ సినిమాలను చూశా. పృథ్వీరాజ్, మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి హీరోల సినిమాలు చూశా. చాలా వెబ్ సీరిస్‌లు చూశాను. తాను చూసినవన్నీ మంచి సినిమాలేనని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

చాలారోజుల తరువాత మాస్క్ లేకుండా

చాలారోజుల తరువాత మాస్క్ లేకుండా మిమ్మల్ని చూస్తున్నానని సుమ పేర్కొనగా, నన్ను నేను కూడా మాస్క్ లేకుండా చూసుకుంటున్నానని మంత్రి కెటిఆర్ చమత్కారంగా బదులిచ్చారు.

మా పిల్లలకు తాత, నానమ్మలంటే ప్రాణం

తల్లిద్రండులు కామన్‌గా పిల్లలకు శత్రువులుగా కనిపిస్తారు. అదే తాత, నానమ్మలంటే పిల్లలకు ఇష్టం. వారి మధ్య అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది. మా అమ్మా,నాన్నలకు మా పిల్లలంటే ఇష్టం. వారికి కూడా ఆ పిల్లలతో గడపడం ఇష్టంగా భావిస్తారు. తనకు కూడా చిన్నపిల్లలతో మాట్లాడడం ఇష్టం. తాను వాళ్లతో మాట్లాడినప్పుడు వారి ఇష్టాఇష్టాలతో పాటు వారి చదువు గురించి తెలుసుకుంటాను. తాను మాట్లాడిన సందర్భాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవడంతో పాటు వారికి మరింత ఉత్తేజం కలుగుతుందన్న భావనతో వారితో మాట్లాడడానికి ఇష్టపడతాను.

పేదలకు డబుల్ బెడ్‌రూం ఇంటిని నిర్మించి ఇవ్వడమే కెసిఆర్ కల

పేదలకు డబుల్ బెడ్‌రూం ఇంటిని నిర్మించి ఇవ్వడమే కెసిఆర్ కల. డబుల్ బెడ్‌రూం అనేది సిఎం కెసిఆర్‌కు ఊరికే వచ్చిన కల కాదు. సిఎం కెసిఆర్ చిన్నప్పుడు చింతమడక నుంచి దుబ్బాకకు చదువుకోవడానికి వెళ్లేవారు. కెసిఆర్ చదువుకోవడానికి రోజూ ప్రయాణం చేస్తుండడంపై మా తాత దుబ్బాకలోని ఓ స్నేహితుడి ఓ ఇంట్లో కెసిఆర్‌ను ఉంచారు. అక్కడ ఉండి చదువుకున్నప్పుడు చిన్న ఇంట్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడే సామాన్యుడు ఎంత ఇబ్బంది పడుతున్నారో కెసిఆర్ తెలుసుకున్నారు. అందులో భాగంగానే డబుల్ బెడ్‌రూం ఇళ్లకు సిఎం కెసిఆర్ ప్రణాళికలను రూపొందించారు.

1,400 స్లమ్‌లను గుర్తించాం

75 ఏళ్లలో ఇంత స్థాయిలో ఇలాంటి ఇళ్లను ఎవరూ కట్టలేదు. డబుల్ బెడ్‌రూం నిర్మాణంలో భాగంగా రెండు బెడ్‌రూంలు, ఒక హాల్, కిచెన్ ఉండేలా 560 స్కైర్‌ఫీట్‌లతో నిర్మాణం జరుపుతున్నాం. ఇప్పటివరకు 2,70,000 పైచిలుకు ఇళ్లను కట్టించాలని నిర్ణయించాం. అయితే ఈ నిర్మాణాలకు సంబంధించి గ్రామాల్లో ఒక్కో యూనిట్‌కు రూ.5,04,000, మున్సిపాలిటీల్లో రూ.5,40,000, హైదరాబాద్‌లో రూ.8,75,000ల ఖర్చు అవుతోంది. ముందుగా వీటిని కట్టడానికి స్లమ్‌లను గుర్తించాం. అందులో భాగంగా ముందుగా 1,400 స్లమ్‌లను గుర్తించి అక్కడ డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తున్నాం. ముందుగా సనత్‌నగర్‌లో 5 బస్తీలను స్లమ్‌లను తొలగించి డబుల్ బెడ్‌రూంలను నిర్మించాం.

హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూంల నిర్మాణానికి రూ. 9,714 కోట్ల ఖర్చు

ఒక్క హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూంల నిర్మాణానికి రూ. 9,714 కోట్ల ఖర్చు చేశాం. రెండు, మూడునెలల్లో మిగతా ఇళ్లను పేదలకు పంపిణీ చేస్తాం. కొల్లూరులో నిర్మించే 15,660 ఇళ్లను 108 బ్లాక్‌లను నిర్మిస్తున్నాం. పేదవాడి ఇంట్లో కూడా లిప్ట్ ఉండాలన్న ఉద్ధేశ్యంతో కొల్లూరులో నిర్మించే ఇళ్ల వద్ద లిప్ట్‌లను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ప్రజలకు అవసరమయ్యే అన్ని సదుపాయాలను ఏర్పాటుచేస్తున్నాం. ఏషియాలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా నిలిచిపోతుంది.

హుస్సేన్‌సాగర్ పక్కన లేక్ వ్యూ కనిపించేలా…

ఉప్పల్‌లోని సింగంచెరువు తండాలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వం కట్టించిందటే ఎవరూ నమ్మరు. ఒక పెద్ద బిల్డర్ ప్రైవేటు ప్రాపర్టీని నిర్మించినట్టు ఈ నిర్మాణం ఉంది. ఈ ఇళ్లను చూసిన పేదవాళ్లు సంతోషంగా ఉండాలన్న లక్షంతో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా నిర్మించే డబుల్ బెడ్‌రూం ఇళ్లకు రూ.18,000 వేల కోట్లు ఖర్చు అవుతుంది. హుస్సేన్‌సాగర్ పక్కన లేక్ వ్యూ కనిపించేలా డబుల్ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాం.

పేదవాడి ఇళ్లు వారి ఆత్మగౌరవాన్ని నిలిపేలా ఉన్నాయి…

చాలాచోట్ల లక్ష ఇళ్లు చివరిదశలో ఉన్నాయి. పేదవాడి ఇళ్లు వారి ఆత్మగౌరవాన్ని నిలిపేలా ఉండాలని వీటిని నిర్మిస్తున్నాం. అగ్గిపెట్టేలా ఉండవద్దు…ఆత్మగౌరవ ప్రతీకగా ఉండాలన్న ఉద్ధేశ్యంతో ముందుకెళుతున్నాం. ఈ ఇళ్లను చూసైనా ప్రతిపక్ష సభ్యులు మారాలన్నారు.

మాస్క్‌తో పాటు శానిటైజన్ రక్షించింది

కోవిడ్ 19 విజృంభిస్తున్న సమయంలో ఇంట్లో ఉండకుండా ప్రజలకు అందుబాటులో ఉన్నాను. తనకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని తమ పర్సనల్ డాక్టర్ తెలిపారు. అయినా కంటోన్మెంట్ జోన్‌లకు వెళ్లి కోవిడ్ రోగులతో మాట్లాడాను. మాస్క్ మాత్రమే నన్ను రక్షించింది. ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నా. మాస్క్‌తో పాటు శానిటైజన్ కోవిడ్ రాకుండా అడ్డుకుంది.

అభివృద్ధి పనుల పూర్తికి చిత్తశుద్ధితో ప్రయత్నం

ప్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, పార్కుల నిర్మాణాలను ప్రణాళికలబద్ధంగా పూర్తి చేస్తున్నాం. సిఎం కెసిఆర్ విజన్‌లో భాగంగా అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో ముందుకెళుతున్నాం. తాను పుట్టింది కరీంనగర్ అయినా పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల బాధలను చూశాం. ముందుగా ప్రజల మౌలిక వసతులపై దృష్టి సారించాం. అందులో భాగంగా ఇక్కడి ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులను దృష్టిలో పెట్టుకొని వాటిని తీర్చడంలో సఫలం అవుతున్నాం.

ప్రస్తుతం రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా

ప్రజల మౌలిక అవసరాలు తీరుతున్నాయా లేదా అన్న వాటిపై ముందుగా దృష్టి సారించాలని సిఎం కెసిఆర్ మా అందరికీ దిశానిర్ధేశం చేశారు. వీటి తరువాతే మిగతా వాటిపై దృష్టి సారించాలన్న ఆదేశాల మేరకు తాము వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళుతున్నాం. రాష్ట్రం ఏర్పడినప్పుడు కుత్భుల్లాపూర్ లాంటి ప్రాంతాల్లో 14 రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా జరిగేది. అందులో భాగంగానే ముందుగా శివారు ప్రాంతాలతో పాటు కోర్‌సిటీలో మంచినీటి సరఫరాపై దృష్టి సారించాం. ప్రస్తుతం రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా చేయడానికి గోదావరి నీళ్లను ఇక్కడకు తీసుకొచ్చాం.

మౌలిక వసతులు కల్పించకపోతే ప్రజలు ఒప్పుకోరు

ప్రజల మౌలిక వసతులను అంతరిక్షానికి వెళతాం, వేరే అభివృద్ధి పనులు చేస్తామంటే ప్రజలు ఒప్పుకొరు. అభివృద్ధితో పాటు ప్రజలకు నిరంతరం అవసరమయ్యే మౌలిక అవసరాలు సమాంతరంగా పరిష్కరించాలన్నదే మా అభిమతం. ఆ విధంగానే తాము ముందుకుసాగుతున్నాం.

160 కిలోమీటర్ల మేర రింగ్‌మెయిన్

చెన్నైలో రైలు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తారు. ఆ పరిస్థితి ఏ నగరానికి రాకుండా ఉండాలి. హైదరాబాద్‌కు కృష్ణా 105 కి.మీలు, గోదావరి 200 కి.మీల దూరం ఉంటుంది. ఈ రెండు జీవనదుల నుంచి నీటిని ఒడిసిపట్టి నార్త్ నుంచి సౌత్ నుంచి నీళ్లు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి (160) కిలోమీటర్ల మేర రింగ్‌మెయిన్ వేసి ఈ రెండు జీవనదుల నుంచి మంచినీటిని వాడుకుంటే తాగునీటి సమస్యకు ఫుల్‌స్టాప్ పడుతుంది. రానున్న రోజుల్లో ఒక నదిలో

నీరు ఉండి మరో నదిలో లేకున్నా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.

హైదరాబాద్ దాహార్తిని తీర్చడానికి 1920లో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లను కట్టారు. అప్పటి ప్రభుత్వం హైదరాబాద్‌కు వరదలు రాకుండా, త్రాగునీటి సమస్య తీరేలా సమస్యను పరిష్కరించాలని మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నియమించింది. 1920లో గండిపేట జలాశయాన్ని నిర్మించారు.

ఇది పూర్తయితే 6.5 టిఎంసిల నీరు స్టోరేజ్ చేసుకోవచ్చు

ప్రస్తుతం 2020లో యాధృచికంగా శామీర్‌పేట మండంలో కేశవపూర్‌లో మరో రిజర్వాయర్‌ను నిర్మించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. . ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్వీరాన్‌మెంట్ క్లియరెన్స్ వచ్చింది. ఇది పూర్తయితే 6.5 టిఎంసిల నీరు స్టోరేజ్ చేసుకునేలా నిర్మిస్తున్నాం. ఔటర్ చుట్టూ రింగ్‌మెయిన్ పనులు కూడా సుమారుగా 28 కి.మీల మేర ఇప్పటి వరకు పూర్తయ్యాయి. పూర్తిస్థాయిలో ఇది అందుబాటులోకి వస్తే భావితరాలకు ఇబ్బందులు రాకుండా నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

తెలంగాణ రాకముందు పవర్ హాలీడే

తెలంగాణ రాకముందు పవర్ హాలీడే ప్రకటించేవారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేది. ఇందిరాపార్కు వద్ద పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత 24 గంటల పాటు పరిశ్రమలకు, గృహా అవసరాలకు కరెంట్‌ను సరఫరా చేయడంతో పాటు వ్యవసాయానికి ఉచిత కరెంట్‌ను అందించగలుగుతున్నాం. సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న ప్రణాళికలతోనే 24 గంటల కరెంట్‌తో పాటు ఇంటింటికి మంచినీటిని అందించగలుగుతున్నాం.

అన్నింటిని తట్టుకుంటూనే ముందుకెళ్లాం

కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందన్న అనిశ్చితి నెలకొంది. ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా ముందుకెళ్లాలి, అందరినీ ఎలా మెప్పించాలన్న దానిపై సిఎం కెసిఆర్ చాలా కసరత్తు చేశారు. అప్పటికే సమైక్య పాలకులు ప్రత్యేక రాష్ట్రం రాకుండా అడ్డుకోవడంతో పాటు అనేక కుట్రలకు తెరాతీశారు. వాటిని తట్టుకుంటూనే తాము ముందుకెళ్లాం. ఈ ఆరేళ్లలో అన్నింటిలో మనమే నెంబర్‌వన్‌గా నిలిచాం.

గండిపేట చుట్టూ కాటేజీలు, సైకిల్‌ట్రాక్‌లు

మొజంజాహి మార్కెట్, దుర్గంచెరువును అందంగా తీర్చిదిద్దుకున్నాం. ఇది టూరిస్టు ప్రదేశంగా మారింది. ఏ ఏరియాలో ఉండేవాటిని ఆ ఏరియాలో అభివృద్ధి చేస్తే ప్రజలను ఆకట్టుకుంటాయి. తాను బెంగళూరు వెళ్లినప్పుడు రెండు, మూడు ప్రదేశాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అయితే మనదగ్గర కూడా అలాంటివి చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేస్తే పర్యాటకలను ఆకర్శించిన వాళ్ల అవుతాం. అందులో భాగంగానే గండిపేట చుట్టూ సైకిల్‌ట్రాక్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దానికి సంబంధించి హెచ్‌ఎండిఏ నుంచి నిధులను కూడా మంజూరు చేయించాం. అక్కడ కాటేజీల నిర్మించడంతో పాటు మరిన్ని అభివృద్ధి చర్యలు చేపట్టాలని ప్రణాళికలు రూపొందించాం.

అందరూ కలిసివస్తేనే విశ్వనగరంగా మార్చవచ్చు

కొంతమంది ఇదే విశ్వనగరం అంటూ మమ్మల్ని ట్రోల్ చేస్తారు. అనుకున్న వెంటనే అన్నీ పనులు పూర్తి కావు. అందరూ కలిసి వచ్చినప్పుడే సిటీలను మనం అభివృద్ధి చేయగలుగుతాం. మెట్రోను విజయవంతంగా పూర్తి చేశాం. మెట్రో దిగగానే ఇంటికి వెళ్లే దారిలో ఫుట్‌పాత్‌లపై ఈజీగా నడిచి వెళ్లేలా ఉండడానికి అనేక చర్యలు చేపట్టాం. మెట్రో దిగగానే మనకు ఇంటికి చేరుకునేలా బస్సు, కారు లాంటి సదుపాయాలు ఉంటేనే మెట్రోరైలు విజయవంతం అవుతుంది.

సిటీ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు రావాలి

సిటీ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు రావాలి. ఓఆర్‌ఆర్ చుట్టూ 160 కి.మీలు ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లను నిర్మించాలి. ఇక్కడ ఆస్పత్రులతో పాటు కాలేజీలు, స్కూళ్లను నిర్మించాలి. ఐటిని విస్తరించాలన్న ఉద్ధేశ్యంతో గ్రిడ్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చాం. దీనివలన నగరం చుట్టూ నాలుగువైపులా అభివృద్ధి చెందుతుంది. ఔటర్, రీజనల్ రింగ్‌రోడ్డులను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులను ఆకర్శించడానికి మరిన్ని వసతులను కల్పిస్తున్నాం. దీనివల్ల హైదరాబాద్ సిటీలో పెట్టుబడులు పెట్టాలన్న, ఎవరైనా ఉద్యోగం చేయాలన్నా మౌలిక సదుపాయాలు కచ్చితంగా ఉండాలన్నదే మా ప్రభుత్వం ముఖ్య ఉద్ధేశ్యం.

మౌలిక సదుపాయాల కల్పనలో నగరానికి 142వ ర్యాంకు

2014 నుంచి 2020 వరకు ఓ సంస్థ చేసిన అధ్యయనంలో హైదరాబాద్‌లో నివాసం ఉండే వారికి మౌలిక సదుయాలు కల్పిస్తున్న నగరంగా హైదరాబాద్‌కు 142 ర్యాంకు ( ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే) దక్కించుకోగా, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల కంటే హైదరాబాద్ మెరుగైనదని ఓ సంస్థ తమ అధ్యయనంతో తెలిపింది.

వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రికల్ వెహికిల్ పాలసీ

వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రికల్ వెహికిల్ పాలసీని తీసుకొచ్చాం. దీనివలన వాయుకాలుష్యాన్ని నియంత్రించ గలుగుతాం. వాయుకాలుష్యం వెదజల్లే పరిశ్రమలను నగరం బయటకు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికోసం 13 ప్రదేశాలను గుర్తించాం. ఇప్పటికే ఔటర్ బయటకు వెయ్యికి పైగా పరిశ్రమలను తరలించడానికి ఏర్పాట్లు చేశాం.

లేని దాని గురించి ఆలోచించవద్దు…

ఎప్పటికప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేని దాని గురించి ఎప్పుడూ ఆలోచించవద్దు, ఉన్నదానిని కాపాడుకుంటే బాగుంటుంది. మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

మా ఆవిడ కూడా డిమాండ్ చేస్తుంది

ఎప్పుడూ మీరు సమయానికి రారని, మీ భార్య ఎప్పుడూ ఫిర్యాదు చేయరా అంటూ సుమ అడిగిన ప్రశ్నకు మంత్రి కెటిఆర్ సమాధానమిస్తూ కచ్చితంగా మా ఆవిడ నుంచి ఈ డిమాండ్ ఉంటుందన్నారు. లాక్‌డౌన్ సమయంలో చాలామంది భర్తలు ఇంట్లోనే ఉంటే తాను మాత్రం బయట తిరగాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రజల కష్ట, సుఖాలను ఎక్కువగా తెలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశా. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలంటే కష్టమే. ఆదివారం పనిచేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నా అయినా సాధ్యం కావడం లేదు.

యువత ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు

యువత ఉద్యోగాల కల్పనకు అనేక రకాలుగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. దీంతోపాటు యువత ఆలోచనల్లో మార్పు రావాలి. ఆరేళ్లలో టిహబ్, విహబ్,టివర్క్ లాంటి ప్లాట్‌పాంలు పుట్టుకొచ్చాయి. తాను చిన్నప్పుడు డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలని కోరిక ఉండేది. ఇప్పుడు అలా కాదు యువత ఆలోచనలు పెట్టుబడులుగా సరికొత్త ఆవిష్కరణలను తెరమీదకు తీసుకొస్తున్నాం.

లక్షలాది మంది విద్యార్థులకు సిల్క్ మీద శిక్షణ అందిస్తున్నాం

ప్రాచీన వారసత్వాలను కాపాడుకుంటూనే నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం. లక్షలాది మంది విద్యార్థులకు సిల్క్ మీద శిక్షణ అందిస్తున్నాం. అందులో భాగంగానే న్యాక్ లాంటి సంస్థలకు ఈ బాధ్యతలను అప్పగించాం.

ఎంత ఎక్కువ తిడితే టివిలు అంత ఎక్కువ చూపెడుతున్నాయి

రాజకీయాల్లోకి మా పిల్లలను లాగినప్పుడు నాకు బాధ కలుగుతుంది. మా అమ్మ ఎక్కువగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసారం చేసే చానల్‌ను చూస్తుంది. ఎంత ఎక్కువ తిడితే టివిలు అంత ఎక్కువ చూపెడుతున్నాయి. అదే లీడర్ షిప్ అనుకుంటే అది పొరబాటవుతుంది.

ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటా

ట్విట్టర్‌లో తాను చాలా యాక్టివ్‌గా ఉంటా. చాలామంది నా ట్విట్టర్‌ను పాలో అవుతుంటారు. లాక్‌డౌన్ సమయంలో చాలామంది సమస్యలను ట్వీట్టర్ వేదికగా పరిష్కరించా. చాలామంది చేయూతనందించాం. మెడికల్ ఎమర్జెన్సీకి వెంటనే రియాక్ట్ అవుతాను. సిఎం రిలీప్‌ఫండ్ లాంటి వాటిని పేదలకు అందేలా చూస్తా.

సోషల్‌మీడియాతో డైరెక్ట్ కనెక్ట్

సోషల్‌మీడియా అనేది బెస్ట్. దీనివల్ల డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. దీనివల్ల లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంది. ఫేక్ ప్రొపైల్ సృష్టించేవాళ్ల ఇబ్బందులు పడుతున్నాం. సోషల్‌మీడియా వల్ల 5 సంవత్సరాలుగా ఎంతోమందికి సాయం చేశాను. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత పాపులర్ అయ్యిందో సోషల్‌మీడియా అలా పాపులర్ అయిపోతుంది.

మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌లు

టిఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌లు కల్పించింది. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ తరపున 85 మంది మహిళలకు టికెట్లను కేటాయించాం. మహిళా కార్పొరేటర్‌లు బాగా పనిచేస్తారు. చట్టసభల్లో 1/3 మహిళలకు రిజర్వేషన్‌లు కల్పిస్తే బాగుంటుంది.

విశ్వనగరం అంటే…

వీధికుక్కలు, దోమల బాధ, మూసీ మురికికూపంగా ఉండకూడదు. పాదాచారులు నడిచేలా ఫుట్‌పాత్‌లు ఉండాలి. మన పిల్లలు బయటకు వెళితే క్షేమంగా ఇంటికి తిరిగిరావాలి. ఇవన్నీ ఓవర్‌నైట్ కావు. రాష్ట్రం బంగారు తెలంగాణగా మారడానికి కొంత సమయం పడుతుంది. మాకు చేయాలన్న తపన ఉందా లేదా అన్న విషయాన్ని గమనించి మాట్లాడితే బాగుంటుంది.

చెత్తతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాం

గతంలో హైదరాబాద్‌లో 3,500 టన్నుల చెత్త వెలువడేది. ప్రస్తుతం అది 6 వేల పైచిలుకు అయ్యింది. ఈ వ్యర్థాలను సేకరించి వాటిని జవహర్‌నగర్ ప్లాంట్‌కు తరలిస్తున్నాం. ఈ చెత్తతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పటికే 20 మెగావాట్ల ప్లాంట్‌ను ప్రారంభించాం. రానున్న రోజుల్లో మరో 28 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ప్రారంభిస్తాం. మరో 15 మెగావాట్లను ఉత్పత్తి చేసేలా దుండిగల్‌లో మరో ప్లాంట్‌ను సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం చెత్త డంపింగ్ యార్డు ప్రస్తుతానికి జవహర్‌నగర్‌లో మాత్రమే ఉంది. ఈ ఒక్క చోటే కాకుండా మరో చోట కూడా ఈ యార్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించిన స్థల సేకరణ కూడా పూర్తయ్యింది. వీటితో పాటు నిర్మాణరంగ వ్యర్థాలతో కంకర, ఇసుక, టైల్స్‌ను తయారు చేస్తున్నాం.

మూసీ నీటి శుద్ధికి మరిన్ని చర్యలు

మన డ్రైనేజీ నీరు మూసీలోకి పోయే ముందు దానిని శుద్ధి చేసేలా చర్యలు చేపట్టాం. హైదరాబాద్‌లో 2 వేల ఎంఎల్‌డి మురుగునీరు ప్రవహిస్తోంది. అయితే మన దగ్గర 700 ఎంఎల్‌డిలను శుద్ధి చేసే యంత్రాలు మాత్రమే ఉన్నాయి., వీటికి అదనంగా మరో 1200 ఎంఎల్‌డిలను శుద్ధిచేసే యంత్రాలను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నాం.
హైదరాబాద్ అభివృద్ధిలో ప్రజలను కూడా భాగస్వాములు చేయాలన్న ఉద్ధేశ్యంతో ప్రతి వార్డులో నాలుగు కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడానికి, మిగతా పనులకు లంచం ఇవ్వకుండా కొత్త పాలసీలను ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తున్నాం. అందులో భాగంగానే కొత్త చట్టాలు ధరణి లాంటి వాటిని అమల్లోకి తీసుకొచ్చాం. ఎస్‌ఆర్‌డిపి కింద అండర్‌పాస్‌లు, బ్రిడ్జిలను నిర్మించాం. దీంతోపాటు ఎస్‌ఎన్‌డిపిలను త్వరలో అమల్లోకి తీసుకొచ్చి నాలాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం.

నాలాల కింద 28 వేల అక్రమ కట్టడాలు

గత ప్రభుత్వాల హయాంలో నాలాలను ఆక్రమించి కట్టడాలు జరిపారు. చెరువులను కబ్జాలు చేశారు. కాంగ్రెస్ హయాంలో వేసిన ఓ కమిటీ నాలాల కింద 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. అయినా అప్పటి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. 100 ఏళ్లలో పడని వర్షం ఈ సంవత్సరం కురిసింది. ఇవన్నీ తాము ముందుగా ఊహించలేదు. ఇలాంటి వాటిని తట్టుకునేలా రానున్న రోజుల్లో ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇప్పటికిప్పుడే విశ్వనగరంగా హైదరాబాద్ మారుతుందని చెప్పలేను. కానీ దానికి కూడా సమయం పడుతుంది. దీనికి ప్రజలు కూడా సహకరిస్తేనే విశ్వనగరంగా హైదరాబాద్‌ను మార్చవచ్చు.

అన్ని అంశాలపై ప్రజలకు అవగాహన రావాలి

హరితహరం సిఎం మానసపుత్రిక. రాష్ట్రం ఏర్పడగానే 1,12,000 చదరపు కిలోమీటర్ల భూ భాగంలో ఎంత గ్రీనరి ఉందన్న దానిపై సిఎం కెసిఆర్ అధికారులతో లెక్కలు తీయించారు. అందులో గ్రీనరి ఎంత శాతం ఉంది. ఫారెస్టు ఎంత ఉందన్న దానిపై లెక్కలు తీయించిన సిఎం కెసిఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే 24 శాతం ఉన్న గ్రీన్‌కవర్‌ను 33 శాతానికి తీసుకురావాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ 5 సంవత్సరాల కాలంలో గ్రీనరి పెంపుదల 28 శాతానికి చేరుకుంది. రానున్న రోజుల్లో మిగతా 5 శాతాన్ని కూడా అధిగమిస్తాం. అందులో భాగంగా గ్రామాల్లో, పట్టణాల్లో గ్రీనరీ కోసం 10 శాతం బడ్జెట్‌ను కేటాయించేలా సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. మొక్కల పెంపకంతో పాటు నర్సరీల కోసం ఈ నిధులను కేటాయిస్తారు. పట్టణాలు కాంక్రీట్ జంగల్‌గా మారకుండా చూడాలని సిఎం కెసిఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు పార్క్‌లతో పాటు మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రజలు కూడా మొక్కల పెంపకంపై అవగాహన వచ్చింది. మిగతా అంశాలపై కూడా ప్రజల్లో అవగాహన రావాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News