Saturday, May 4, 2024

భారత్‌కు తోడుగా ప్రపంచ దేశాలు

- Advertisement -
- Advertisement -

భారత్‌కు తోడుగా ప్రపంచ దేశాలు
ఫ్రాన్స్ నుంచి 8 ఆక్సిజన్ జనరేటర్లు, 5 కంటైనర్లు, 28 వెంటిలేటర్లు, ఔషధాలు
థాయ్‌ల్యాండ్, సింగపూర్ నుంచి ఆక్సిజన్ కంటైనర్లు
ఐర్లాండ్ నుంచి 700 కాన్‌సెంట్రేటర్లు
భూటాన్ నుంచి లిక్విడ్ ఆక్సిజన్

France send 8 Oxygen generators to India

న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌వేవ్‌తో దేశం ఎదుర్కొంటున్న మౌలిక వసతుల కొరతను తీర్చేందుకు ప్రపంచ దేశాలు స్పందిస్తు న్నాయి. తక్షణ సాయానికి ముందుకు వస్తున్నాయి. భారత్‌కు ఔషధాలు, ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను వాయు, జల మార్గాల్లో పంపిస్తున్నామని ఫ్రాన్స్ విదేశాంగశాఖ మంగళవారం వెల్లడించింది. భారత్‌కు సాయ మందించేందుకు ఫ్రెంచి కంపెనీలతోపాటు భారత్‌లోని యూరోపియన్ యూనియన్ సంస్థలతో కలిసి పని చేస్తామని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయెల్ లెనైన్ తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ విజ్ఞప్తిమేరకు ఈ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు లెనైన్ ట్విట్ చేశారు. భారత్‌కు పంపుతున్న 8 ఆక్సిజన్ జనరేటర్లలో ఒక్కొక్కటి 250 పడకల ఆస్పత్రికి పదేళ్లపాటు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చేయగలవని ఫ్రాన్స్ విదేశాంగశాఖ తెలిపింది. ఐదు కంటైనర్ల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను కూడా తొలి విడతగా పంపుతున్నామని తెలిపింది. ఇవి 10వేలమంది పేషెంట్లకు ఒకరోజుకు సరిపోయే మెడికల్ ఆక్సిజన్‌ను ఇవ్వగలవని పేర్కొన్నది. వీటితోపాటు 28 వెంటిలేటర్లు, 200 ఎలక్ట్రిక్ సిరింజే పంపులను పంపిస్తున్నట్టు ఫ్రాన్స్ తెలిపింది. భారత అధికారులు తమకు అవసరమైన సాయం గురించి సూచించినవాటినే తాము పంపిస్తున్నామని ఫ్రాన్స్ తెలిపింది. వీటితో భారత్‌లో కొవిడ్ పేషెంట్ల వసతులు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
థాయ్‌ల్యాండ్ నుంచి ఖాళీ ఆక్సిజన్ కంటైనర్లు భారత్‌కు చేరుకున్నాయని కేంద్ర హోంశాఖ మంగళవారం తెలిపింది. సింగపూర్ నుంచి కూడా మరికొన్ని వస్తాయని తెలిపింది. భారత వైమానిక దళం(ఐఎఎఫ్) విమానాల ద్వారా వీటిని తరలిస్తున్నారు. థాయ్‌ల్యాండ్ నుంచి వచ్చిన ట్యాంకర్లు ఐఎఎఫ్ తరలించినవాటిలో మూడో బ్యాచ్. మొదటి బ్యాచ్ కంటైనర్లు శనివారం సింగపూర్ నుంచి ఇక్కడికి వచ్చాయి. రెండోబ్యాచ్ కంటైనర్లను దుబాయ్ నుంచి సోమవారం తరలించారు. వాటిని బెంగాల్‌లో దించారు. అక్కడి నుంచి వాటిని ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలకు తీసుకెళ్తారు. అక్కడ కంటైనర్లను నింపి కొవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ అవసరమైన ఆస్పత్రులకు ప్రత్యేక రైళ్ల ద్వారా తరలిస్తారు.
భారత్‌కు సాయమందించే దేశాల్లో ఐర్లాండ్ కూడా చేరింది. 700 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లతోపాటు వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను భారత్‌కు పంపనున్నట్టు ఇక్కడి ఆ దేశపు రాయబారి బ్రెండన్ వార్డ్ తెలపారు. బుధవారం ఉదయంకల్లా 700 కాన్‌సెంట్రేటర్లు భారత్ చేరుకుంటాయని ఆయన తెలిపారు. భారత్‌లోని పరిస్థితిని ఎంతో సన్నిహితంగా గమనిస్తున్నామని ఆయన అన్నారు. తమ దేశంలో భారత సంతతివారు అధిక సంఖ్యలో ఉన్నారని, తమ వైద్య వ్యవస్థలో వారిది కీలక భాగస్వామ్యమని ఆయన తెలిపారు. భారత్‌కు నమ్మకమైన మిత్ర దేశంగా పేరున్న భూటాన్ స్పందించింది. తమ దేశం నుంచి రోజుకు 40 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను సరఫరా చేయనున్నట్టు ఢిల్లీలోని భూటాన్ రాయబార కార్యాలయం తెలిపింది. క్రయోజెనిక్ ట్యాంకర్ల ద్వారా లిక్విడ్ ఆక్సిజన్‌ను అసోంకు తరలిస్తామని తెలిపింది.

France send 8 Oxygen generators to India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News